‘ఏమి సేతుర లింగా..ఏమి సేతూ’

‘మావోళ్లు మంచిగుంటే మొన్ననే అధికారంలోకి వచ్చేటోళ్లం. గిట్లనే ఉంటనే ఎవ్వరూ బాగచేయలేరు. ఎప్పుడు ఎలా స్పందించాలనే విషయంపై అధిష్టానం క్లారిటీగా లేదు’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు బాహాటంగానే అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇగ, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అయితే తన కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదని హైరానా పడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై మీడియా ముందుకొచ్చి బాంబులు పేల్చేస్తున్నాడు. తనకు పార్టీలో మద్దతు దక్కకపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ‘సుంకిశాల’ ఘటనలో ఎమ్మెల్యేల బృందాన్ని అక్కడికి తీసుకెళ్లి, సమస్యను లేవనెత్తి ఇంజినీర్‌ను సస్పెండ్‌ చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో తాను సక్సెస్‌ అయ్యానని చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో ఆయనకు పార్టీ నుంచి తగిన మద్దతు లభించలేదు. ‘సక్సెస్‌ను కూడా పార్టీ ఓన్‌ చేసుకోకపోతే ఎందుకు?’ అని ఆయన గుస్సా అవు తున్నారు. ‘ఎంత మొత్తుకున్నా ఏమున్నది గర్వకారణం? మీడియాలో నాలుగు స్కోలింగ్‌లు తప్ప! సర్కారు లోపాలపై పోరాటంపై సపోర్టు ఇచ్చేవారేరి? ఏమి సేతుర లింగా…ఏమి సేతూ’ అని ఏలేటి అనుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
– అచ్చిన ప్రశాంత్‌