ఏం చేద్దాం…?

What shall we do...?– పోటీపై తుమ్మల గందరగోళం.. 6న తుది నిర్ణయం
– బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కేసీఆర్‌ భేటీ.. వనమాకు అందని ఆహ్వానం
– తేలని ఖమ్మం పంచాయితీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రంలో రోజుకో రీతిన మార్పు చోటు చేసుకుంటున్నది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కారు దిగడం.. చేయందుకోవడం లాంఛనమేననే చర్చ సాగుతోంది. అయితే ఆయన పోటీ చేసే స్థానం విషయంలోనే సందిగ్ధత నెలకొంది. తుమ్మల పాలేరు నుంచి టిక్కెట్‌ ఆశిస్తుండగా కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత వస్తే ఆయన వచ్చేనెల 6న కాంగ్రెస్‌ గూటికి చేరతారనే చర్చ సాగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్‌ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు సమాచారం లేదని తెలుసింది. వనమాను అభ్యర్థిగా ప్రకటించినా బీఫామ్‌ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని వనమా అనుచరులు కొట్టిపారేస్తున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఎటూతేల్చుకోలేని సందిగ్ధావస్థలో ‘గులాబీ’బాస్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బాణోత్‌ హరిప్రియ(ఇల్లెందు), రేగా కాంతారావు (పినపాక), మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)తో ఆదివారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ భేటీ అయ్యారు. తుమ్మల ప్రభావం ఉమ్మడి జిల్లాపై ఏమేరకు ఉంటుందనే అంశంపై చర్చించినట్టు సమాచారం. తుమ్మల స్వస్థలం దమ్మపేట మండలం గండుగులపల్లి కాబట్టి అశ్వారావుపేట నియోజకవర్గం, అలాగే టీడీపీ హయాంలో మంత్రిగా భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అధికంగా ఉండటంతో ఆ నియోజకవర్గంపై అధికంగా, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలపై పాక్షికంగా ప్రభావం ఉంటుందని విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలపై ప్రభావం బాగానే ఉంటుందని కొంతమంది చెప్పినట్టు సమాచారం. తుమ్మలను వదులుకోవడంతో చోటుచేసుకునే పరిణామాలు, ప్రత్యర్థికి ఒనగూరే లాభనష్టాలపైనా చర్చించి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి బలమైన నేత పార్టీని వీడిన దృష్ట్యా తుమ్మల విషయంలో నిర్ణయ పర్యవసానాలపై ఒకింత లోతైన చర్చే జరిగి ఉండొచ్చని బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నారు. వనమాకు సమాచారం లేకపోవడంపై చర్చ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభ్యర్థులు ఐదుగురిలో నలుగురికి ప్రగతి భవన్‌ నుంచి శనివారం సమాచారం అందడంతో హైదరాబాద్‌ వెళ్లారు. ఆరోజు సీఎంకు వీలుకాకపోవడంతో ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. అయితే కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మాత్రం సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా భావించే వనమా వెంకటేశ్వరరావు పేరు ప్రకటించారని, ఆయనకు టిక్కెట్‌ రాని పక్షంలో పార్టీ వీడితే ‘కారు’ ఫలితం తారుమారు అవుతుందనే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అనర్హత కేసు ఎలాగూ ఉంది కాబట్టి ఒకవేళ కోర్టు వనమాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆ నెపంతో మరొకరికి టిక్కెట్‌ కేటాయించవచ్చనే ఎత్తుగడతోనే కేసీఆర్‌ టిక్కెట్‌ ఇచ్చారనే చర్చ కూడా వైరల్‌ అవుతోంది. అదే జరిగితే తన చేతికి మట్టి అంటకుండా వనమాను తప్పించొచ్చనే వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నారనే మాట వినిపిస్తోంది. కానీ వనమా అనుచరులు మాత్రం ఈ భేటీకి సమాచారం లేకపోవడానికి వేరే కారణాన్ని చూపుతున్నారు. నలుగురు అభ్యర్థుల మీటింగ్‌కు రెండురోజుల ముందుగానే వనమా ప్రత్యేకంగా సీఎంను కలిశారని, అందుకే ఈ సమావేశానికి సమాచారం అందలేదని చెబుతున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా వనమా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వంపై బీఫామ్‌ వచ్చేంత వరకు నిర్ధారణకు రాలేమన్నది బీఆర్‌ఎస్‌లోనే కొందరు నేతల మాట. ఇదిలా ఉండగా.. ఏ క్షణానైనా వనమా అభ్యర్థిత్వం గల్లంతయ్యే ఛాన్స్‌ ఉందనే విశ్వాసంతో రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌ ఉన్నారు. అలాగే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కూడా కొత్తగూడెం నుంచి పోటీపై ఆసక్తి చూపుతున్నారు. జలగం సైతం ఇదే దిశగా అచితూచి అడుగులు వేస్తున్నారు.