– రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్
– ఎన్నికలు, రాజకీయ పరిస్థితులపై ఆరా
– నేడు కీలక భేటీ
– హాజరుకానున్న సీఎం, మంత్రులు, ఇన్‌చార్జీలు, ముఖ్యనేతలు
– దిశా నిర్దేశం చేయనున్న కేసీ వేణుగోపాల్
– ఆ రెండు సీట్లపై స్పష్టత వచ్చేనా?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్లమెంటు ఎన్నికల్లో సానుకూల వాతావరణం ఉండటమే అందుకు కారణం. ఎప్పటికప్పుడు తెలంగాణపై ఓ కన్నెసి ఉంచుతున్న అధిష్టానం…అవసరమైనప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీల పరిస్థితులు, ప్రభుత్వ పాలనా తీరుపై సమీక్షలు నిర్వహిస్తోంది. తద్వారా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తోన్న హస్తం పార్టీ…ఆదివారం సాయంత్రం ఓ కీలక భేటీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు రానున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, అభ్యర్థులతో ఆయన ఓ ప్రముఖ హోటల్‌లో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. టీపీసీసీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన అధిష్టానం…దాన్ని చేరుకునేందుకు కూడా ఏం చేయాలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీని కోసమే కేసీ వేణుగోపాల్ క్లోజ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీ నేతల మధ్య కొంత అసంతృప్తి నెలకొంది. పార్టీని నమ్ముకున్న వారిని కాదనీ, గెలుపు గుర్రాల పేరుతో కొత్త వారికి టిక్కెట్లు కేటాయించడం పట్ల కొంత మంది గుర్రుగా ఉన్నారనే విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఈ కీలక భేటీ ద్వారా వేణుగోపాల్ అభ్యర్థుల ఎంపిక వన్‌సైడ్‌గా జరిగిందన్న ఆరోపణలకు చెక్ పెట్టనున్నారని తెలిసింది. రాత్రికి రాత్రికే కొంత మందికి టిక్కెట్లు ఇచ్చిన నేపథ్యంలో అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై అధిష్టానం తరుపున ఓ క్లారిటీ ఇచ్చేందుకు ఆయన రంగంలోకి దిగినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఇలాంటి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ నేతలను గాడిలో పెట్టాలనేది అధిష్టానం ఆలోచనగా ఉన్నది. అందుకే ఆదివారం జరగనున్న సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనేక విషయాలపై ఈ భేటీతో స్పష్టత ఇవ్వనున్నారు. మంత్రులుగానీ, ఇన్‌ఛార్జీలుగానీ ఏకపక్షంగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వంటి నేతల పర్యటనలు, రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు సంబంధించి పక్కా ప్లాన్ రూపొందించుకుని ప్రజల్లోకి పోవాలని ఆదేశించనున్నారు. మొత్తంగా అత్యధిక సీట్లను కైవసం చేసుకునేందుకు వీలుగా అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణను అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
ఆ రెండు సీట్ల సంగతి తేలనుందా?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానుండటంతో ఖమ్మం, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల సంగతి తేలనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలకుగానూ 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌తో పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఖమ్మం, కరీంనగర్ సీట్లపై ఆయా జిల్లాల కీలక నేతలు పేచి పెడుతున్నారు.ముఖ్యంగా ఖమ్మం విషయంలో డిప్యూటీ సీఎం, మంత్రుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లే కాకుండా హైదరాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా ఆ సీటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరితోపాటు కమ్మ సామాజికతరగతికి చెందిన కొంత మంది నేతల పేర్లు కూడా తెరవైకి వస్తున్నాయి. కరీంనగర్ స్థానంపై కూడా తేలని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆ జిల్లాకు చెందిన మంత్రులు… తమ అనుయాయులకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు సీట్ల పంచాయతీపై ఇప్పటికే ముఖ్యమంత్రి అటు అధిష్టానంతోనూ, ఇటు సహచర మంత్రులతోనూ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అయినప్పటికీ ససేమిరా అనడంతో ఆ పంచాయతీ అధిష్టానం కోర్టులోకి పోయింది. ఈ సమస్యలకు ఆదివారం జరగనున్న సమావేశంలో క్లారిటీ వచ్చేనా? లేదా? అనేది వేచి చూడాల్సిందే…