– రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో అనేక చిక్కులు
– నిశితంగా గమనిస్తున్న భారత్
వాషింగ్టన్ : 2020 ఎన్నికలలో జో బైడెన్ చేతిలో పరాజయం పాలైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అభిశంసన విచారణలు, నేరారోపణలు, శిక్షలు, హత్యా యత్నాలు…ఈ అవమానాలన్నింటినీ భరిస్తూనే ఆయన తిరిగి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం రాత్రి ఓవల్ కార్యాలయంలో రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. అనంతరం రాజకీయ నేతలు, ఆహ్వానితులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై సతీమణి, ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌తో కలిసి నృత్యం చేశారు. ట్రంప్ మరోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టిన సందర్భాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలలో అనేక చిక్కులు తలెత్తాయి. వాణిజ్యం విషయంలో ట్రంప్ తన కఠిన వైఖరిని కొనసాగించే అవకాశం ఉంది. సుంకాల విధింపు, అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటి రక్షణాత్మక విధానాల కారణంగా వాణిజ్య ఒప్పందాలు…ముఖ్యంగా టెక్నాలజీ, ఔషధాల విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే భారత వ్యూహాత్మక ప్రాధాన్యతలకు ట్రంప్ మద్దతు ఇస్తుండడం ఊరట కలిగించే విషయమే. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలని అమెరికా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారత్ ప్రాధాన్యతకు అమెరికా బాసటగా నిలుస్తోంది.ట్రంప్ వైఖరి ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భారత్ కలవరపడుతోంది. దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇది వివాదాస్పద అంశం కాబోతోంది. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలకు ఇది విఘాతం కలిగించబోతోంది. భారత్ వంటి వర్ధమాన దేశాలు ఈ వాణిజ్య వ్యవస్థల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.