– పూర్తి స్థాయిలో హాజరు కాని ఎమ్మెల్యేలు
– ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలే లేవు
– ఆర్డినెన్సుల జారీతో సరి
– ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల చట్టసభల తీరు
న్యూఢిల్లీ : ఛత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాల చట్టసభల పనితీరును పరిశీలిస్తే ఎంత పేలవంగా జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఈ శాసనసభలు ఏవీ ఏడాదిలో కనీసం నెల రోజులు కూడా సమవేశం కాలేదు. ఆ సమయంలో కూడా ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగిన దాఖలాలు లేవు. శాసనసభ సమావేశాలు జరగని సమయంలో మాత్రం ఆర్డినెన్సులు జారీ చేసి పని కానిచ్చారు. రాజస్థాన్ శాసనసభ తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఉప సభాపతిని సైతం ఎన్నుకోలేకపోయింది. మధ్యప్రదేశ్‌లో 2020 మార్చిలో ప్రభుత్వం మారింది. అప్పటి నుండి అక్కడ కూడా శాసనసభకు ఉప సభాపతి లేరు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తొలి పది సంవత్సరాల కాలంలో రాజస్థాన్ అసెంబ్లీ సగటున ఏడాదికి 59 రోజులు, మధ్యప్రదేశ్ అసెంబ్లీ 48 రోజులు సమావేశమయ్యాయి. అయితే చివరి పది సంవత్సరాలలో వార్షిక సగటు పనిదినాల సంఖ్య మరింత తగ్గిపోయింది. రాజస్థాన్ శాసనసభ 29 రోజులు, మధ్యప్రదేశ్ శాసనసభ 21 రోజులు మాత్రమే పనిచేశాయి. తెలంగాణ అసెంబ్లీ 2017లో అత్యధికంగా 37 రోజుల పాటు పనిచేయగా అప్పటి నుండీ ప్రతి సంవత్సరం పనిదినాలు తగ్గుతూ వచ్చాయి. ఏడాదికి 20 కంటే తక్కువ రోజులే అసెంబ్లీ పనిచేసింది. గత ఐదేళ్లలో రాజస్థాన్ అసెంబ్లీ ఏడాదికి సగటున 29 రోజులు, ఛత్తీస్‌ఘర్ అసెంబ్లీ 23 రోజులు, మిజోరం 18 రోజులు, మధ్యప్రదేశ్ 16 రోజులు, తెలంగాణ 15 రోజులు మాత్రమే పనిచేశాయి.
ప్రోరోగ్ చేయకుండానే…
సాధారణంగా శాసనసభను సమావేశపరుస్తున్నట్లు గవర్నర్ తెలియజేస్తారు. సభను ప్రోరోగ్ చేస్తున్నట్లు గవర్నర్ నోటీసు జారీ చేయడంతో సమావేశాలు ముగుస్తాయి. రాజస్థాన్, తెలంగాణలో మాత్రం సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా వాయిదా వేశారు. దీంతో సాంకేతికంగా సమావేశాలు అనేక నెలల పాటు కొనసాగాయి. సమావేశానికి, సమావేశానికి మధ్య చాలా తేడా వచ్చింది. ఉదాహరణకు 2021, 2022 సంవత్సరాలలో రాజస్థాన్‌లో ఫిబ్రవరిలో మొదలైన సమావేశాలు సెప్టెంబర్‌లో ముగిశాయి. సమావేశాలను ప్రోరోగ్ చేయకపోవడమే దీనికి కారణం. ఈ సమావేశాలలో 80% వరకూ ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జరగగా మిగిలినవి సెప్టెంబర్‌లో జరిగాయి.
ఆరినెన్సులతో సరి
2019-2023 మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 39 ఆర్డినెన్సులు జారీ చేసింది. తర్వాతి స్థానాల్లో ఉన్న తెలంగాణలో 14 ఆర్డినెన్సులు, రాజస్థాన్‌లో 13 ఆర్డినెన్సులు జారీ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఒక్క 2020లోనే 11 ఆర్డినెన్సులు జారీ చేశారు. ఆ సంవత్సరం శాసనసభ కేవలం ఆరు రోజులు మాత్రమే సమావేశమైంది. అయితే జారీ చేసిన 11 ఆర్డినెన్సుల్లో ఆరింటికి కాలదోషం పట్టింది. వాటి స్థానంలో సకాలంలో బిల్లులు ప్రవేశపెట్టకపోవడమే దీనికి కారణం. 2021లో శాసనసభ 20 రోజులు మాత్రమే సమావేశం కాగా ఆ ఏడాది ప్రభుత్వం 14 ఆర్డినెన్సులు జారీ చేసింది.
తగ్గిపోతున్న సభ్యుల హాజరు
ఐదు రాష్ట్రాల శాసనసభలు సమావేశమైంది తక్కువ రోజులే అయినప్పటికీ సభ్యుల హాజరు పూర్తి స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఈ రాష్ట్రాల్లో గడచిన ఐదు సంవత్సరాల్లో సభ్యుల సగటు హాజరు 83%గా నమోదైంది.
చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం
సమావేశాలు జరిగింది తక్కువ సమయమే అయినప్పటికీ, కనీసం సభల్లో బిల్లులపై అర్థవంతమైన చర్చ జరిగిందా అంటే అదీ లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో 48% బిల్లుల్ని ఒక రోజులోనే చర్చించి, ఆమోదించారు. అంటే ప్రవేశపెట్టిన రోజు లేదా మరునాడు వాటిని ఆమోదించారన్న మాట. దీనినిబట్టి ఏపాటి చర్చ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత సమావేశాల్లో మిజోరం అసెంబ్లీలో 57 బిల్లుల్ని ప్రవేశపెట్టారు. అవన్నీ ప్రవేశపెట్టిన రోజో లేదా మరునాడో ఆమోదం పొందాయి. 2020లో కేవలం ఆరు గంటల పాటు సమావేశమైన ఛత్తీస్‌ఘర్ శాసనసభ 14 బిల్లుల్ని ఆమోదించింది. మధ్యప్రదేశ్‌లో 2022లో రెండు రోజుల వ్యవధిలో కేవలం ఐదు గంటల పాటు సమావేశమైన శాసనసభలో 13 బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఐదు రాష్ట్రాల శాసనసభల్లో బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు మూడో వంతు సమయం చర్చకు వెచ్చించారు. మిగిలిన సమయంలో వివిధ శాఖల ఖర్చులపై చర్చించి, ఓటింగ్ నిర్వహించారు. మిజోరంలో అన్ని శాఖల డిమాండ్లపై చర్చించి ఓటింగ్ జరిపారు. మిగిలిన రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం అన్ని డిమాండ్లూ చర్చకు రాలేదు. పార్లమెంటులో మాదిరిగా శాఖాపరమైన వ్యయాన్ని పరిశీలించేందుకు ఈ ఐదు రాష్ట్రాల్లో కమిటీలేవీ లేవు.