– కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అధోగతే..
– మోడీ ఆడబిడ్డలకు అన్యాయం చేసిండ్రు : రోడ్‌షోల్లో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ -మిర్యాలగూడ/ యాదగిరిగుట్ట
ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండని కాంగ్రెస్ నాయకులు వేడుకుంటు న్నారని.. కానీ ఇప్పటికి 11సార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా ఏం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు బీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్‌రెడ్డ్డి, భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు గెలుపు కోరుతూ రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారని చెప్పారు.
మళ్లీ ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, వెంకటరెడ్డి, జానారెడ్డి సన్నాసులు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ప్రజలంతా రాష్ట్ర పరిస్థితిని ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం కట్టాలని కోరారు. రాష్ట్రంలో 24గంటల కరెంట్ రావట్లేదని అంటున్న కాంగ్రెస్ నేతలు మిర్యాలగూడ మండలంలోని ఏదైనా గ్రామానికి వచ్చి కరెంట్ తీగలు పట్టుకొని.. వస్తుందో రాట్లేదో తెలుసుకోవాలని సూచించారు.
ఎద్దు, వ్యవసాయం తెలియనోడు రేవంత్‌రెడ్డి అని, క్లబ్‌లు, పబ్‌లు మాత్రమే ఆయనకు తెలుసని అన్నారు. రైతుల బాధలు తెలియనోడు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
2014లో యాదగిరిగుట్ట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే సరిపోతుందని తెలిపారు. యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలు వెళ్లే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ ఆడబిడ్డలకు అన్యాయం చేశారని, రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200 చేశారని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ.400కే సిలిండర్ ఇస్తామన్నారు.