ఏది ఏది రక్షణ..?

What is the protection..?అర్థరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అని మహాత్ముడు ఏనాడో చెప్పారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు గడిచినా పట్టపగలు సైతం రక్షణ లేకుండా పోయింది. ఇంటి నుండి వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం తర్వాత మహిళలపై లైంగిక దాడులు తగ్గుతాయని అందరూ ఆశించారు. దీనికంటే ముందే గృహ హింస, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం… ఇలా మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ ఇవేవీ మహిళల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నయి.
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:) అని చెప్పుకునే గొప్ప దేశం మనది. స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి చిహ్నంగా మన దేశాన్ని చూపెట్టుకుంటున్నాం. కానీ ఇదంతా కేవలం మాటలు, రాతలకే పరిమితమని దేశంలో జరుగుతున్న ఘోరాలు చెబుతున్నాయి. మహిళలకు భద్రత కరువయ్యింది. లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. కోల్‌కతలో ఇటీవల ఓ వైద్య విద్యార్థిపై జరిగిన అమానుష ఘటనే దీనికి నిదర్శనం.
అర్థరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అని మహాత్ముడు ఏనాడో చెప్పారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు గడిచినా పట్టపగలు సైతం రక్షణ లేకుండా పోయింది. ఇంటి నుండి వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం తర్వాత మహిళలపై లైంగిక దాడులు తగ్గుతాయని అందరూ ఆశించారు. దీనికంటే ముందే గృహ హింస, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం… ఇలా మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ ఇవేవీ మహిళల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నాయి.
భారతదేశంలో ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళలపై లైంగికదాడి జరుగుతోంది. ప్రతి 42 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, వరకట్నం కోసం ప్రతి 99 నిమిషాలకు ఒక మహిళ బలౌతోంది. అంతేకాకుండా అపహరణలు, అమ్మాయిల అక్రమ రవాణా ఇలా అనేక విధాలుగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. చిన్నారులు, యువతులు, మహిళలపై నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి.
పని చేసే మహిళల్లో ఎక్కువ శాతం విధులకు వెళ్లి వచ్చేటప్పుడు తమకు రక్షణ లేదని వెల్లడించారని అసోచామ్‌ అనే సంస్థ చేసిన సర్వే ఏనాడో తేల్చింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ముంబై, పూణె, కోల్‌కతా, హైదరాబాద్‌లోని పెద్ద సంస్థలతో పాటు, మధ్యస్థ చిన్నతరహా కంపెనీల్లో పని చేస్తున్న ఐదు వేల మందిని ఈ సంస్థ సర్వే చేసినట్టు సమాచారం. ఏకంగా 92 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీపీఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌర విమానయానం, నర్సింగ్‌హౌమ్స్‌లో పని చేస్తున్న మహిళలు తమకు తగిన రక్షణ లేదని చెప్పారు.
అనాదిగా కొనసాగుతున్న పితృస్వామ్య వ్యవస్థ మహిళలకు శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చి లింగపరమైన అసమానతల సమాజంగా మార్చడం వల్లనే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలను కోర్కెలు తీర్చే వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా, వంటింటి కుందేలుగా, వరకట్నం తీసుకొచ్చే వారిగా మాత్రమే చూసే భావజాలం పాతుకుపోయింది. మహిళంటే చులకన భావం, ఏమీ చేయలేని బలహీనురాలు, నిస్సహాయురాలిగా చిన్నచూపు చూస్తున్నారు. ముందు ఇలాంటి భావజాలంలో మార్పు రావాలి. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. మరీ ముఖ్యంగా మహిళను మనుషులుగా గుర్తించే సమాజం రావాలి. అప్పుడే అమ్మాయిలకు రక్షణ.