ఏమిరా బాలరాజూ…?

‘తెలంగాణ కోసం ఎక్కని గడప లేదు.. మొక్కని దేవుడు లేడు…’ గులాబీ బాస్‌ కేసీఆర్‌ పదే పదే చెప్పే మాట ఇది. దీన్ని విలేకర్ల భాషలోకి మార్చుకుంటే వార్తలు, స్టోరీలు, సంబంధిత సమాచారం కోసం వెళ్లని ఆఫీసు లేదు.. నమస్కారం పెట్టని అధికారి లేడు… అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ రోజు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయానికి వెళితే… ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌ పర్యటనలో ఉన్నారు. మంత్రులందరూ జిల్లాల్లో బిజీబిజీ అయిపోయారు. సెక్రటేరియట్‌లో ఆ రోజు కార్యక్రమాలే లేకుండా పోయాయి. మరి సాయంత్రానికి ఏదో ఒక వార్త రాయాలే.. ఒక మాంచి స్టోరీ వండి వడ్డించాలాయే. అందుకే ఓ నలుగురైదుగురు పాత్రికేయులు కలిసి ‘వైట్‌హౌస్‌’ లాంటి ఆ సచివాలయంలో కింది నుంచి పైదాకా ఆరు అంతస్తులెక్కి, దిగారు. ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను కలిసేందుకు ప్రయత్నిస్తే వారందరూ వారి వారి శాఖల ఆంతరంగిక సమావేశాల్లో మునిగిపోయారు. ఇక చేసేదేమీ లేక… ఉసూరుమంటూ మొదటి అంతస్తులోని క్యాంటీన్‌లోకెళ్లి, కాసింత తేనీరు (అదేనండీ ‘టీ’) తాగి, అలా కూలబడ్డారు. ఇంతలో ఓ సీనియర్‌… తనకు బాగా పరిచయమున్న ఓ ఆఫీసరుకు ఫోన్‌కొట్టి…’అన్నా.. మీరైనా ఉన్నారా…? కలిసేందుకు వస్తున్నాం…’ అనగానే ‘తప్పకుండా రండి బ్రదర్‌…’ అంటూ ఆహ్వానించ టంతో ఎగిరిగంతేశారు ఆ జర్నలి స్టులు. ఆయన ఛాంబర్‌లోకి అడుగుపెట్టగానే… పెద్దపెద్ద కేకలు వినబడుతున్నాయి. విషయమేంటని ఆరాతీస్తే… ఆయన కింద పని చేసే మరో ఉద్యోగి వేరే డిపార్టుమెంటు లో పనిచేసే తన భార్య ట్రాన్స్‌ఫర్‌ కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలంటూ అడిగారు. సరే సిఫారసు చేస్తా, మీ ఆవిడ వివరాలన్నీ ఈ పేపర్‌ మీద రాసివ్వు… అంటూ ఆ ఆఫీసరు సూచించారు. ఓ ఐదు నిమిషాల తర్వాత మనవాడు రాసిచ్చిన వివరాలు చూసి ఆయన ఖంగు తిన్నారు. తమ్ముడూ.. నువ్వు రాసిన వివరాలు సరిగాలేవు, మరోసారి వాట్సాప్‌లో టైప్‌ చేసి, నాకు పంపు, నేను పై వాళ్లకు పంపుతా… అని చెప్పాడు. పది నిమిషాల తర్వాత అతడు టైపు చేసింది చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు ఆ ఆఫీసరు. ‘ఒరేరు బాబూ.. నువ్వు గవర్నమెంటు కొలువులో, పెద్ద పొజీషన్‌లో ఉన్నావు. కనీసం పై ఆఫీసరుకు లెటర్‌ ఎలా రాయలో తెలియకపోతే ఎలా..?’ అంటూ ఒంటికాలి మీద లేచాడు. అది చూసిన పాత్రికేయులకు ‘ఏమిరా బాలరాజూ.. నీవల్ల దేశానికి ఏమి ఉపయోగం…?’ అనే ధర్మవరపు సుబ్రమణ్యం డైలాగ్‌ గుర్తొచ్చింది.
-బి.వి.యన్‌.పద్మరాజు