పిల్లల కలలకు అక్షరం జతకట్టిన వేళ

When a letter is attached to a child's dreamsఎన్ని మార్కులు, ఎన్ని ర్యాంకులు వచ్చాయన్నది కాదు, అసలు పిల్లలు సొంతంగా ఓ చిన్న కథను చదవగలుగుతున్నారా? సొంతంగా ఆలోచించి రెండు మూడు వాక్యాలు రాయగలుగుతున్నారా? అలా రాయనూ చదవనూ చేతకాకపోతే ఆ చదువెందుకు? చట్టుబండలెందుకు?… ఇది ఈ నాటి మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

చదువుకున్న తల్లిదండ్రుల వద్ద, ఉపాధ్యాయుల వద్ద అలాంటి పిల్లలు ఏళ్ల తరబడి గడుపుతూ కూడా ఆ పునాది విద్యకు (ఫౌండేషన్‌ లిటరిసీ) దూరమవుతున్నారంటే ఎవరిని నిందించాలి? వేల, లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ కూడా పిల్లలకు జరుగుతున్న ఈ నిశ్శబ్ద విధ్వంసాన్ని తప్పించుకు తిరగడం ఘోరనేరం కాదా?
పిల్లలు ఎక్కడబడితే అక్కడ వుంటారు. పుట్టపగిలిన చీమల్లా మనకు కనిపిస్తూనే వుంటారు. వారు ఏ సామాజిక వర్గమైనా, ఆర్థిక అంతరాలైనా కావచ్చు, పిల్లలు పిల్లలే. కావాల్సిందల్లా పిల్లలకు పునాది విద్యనందించాలనే తపన, చిత్తశుద్ధి, సంకల్పం. కాస్త ఓర్పు. సమయ కేటాయింపు. ఓ చిన్నగది. కాసిని కథల పుస్తకాలు. చక్కటి బొమ్మలతో ఏక వాక్య కథలు, ద్వివాక్య, త్రివాక్య కథల (పిక్టోరియల్‌ స్టోరీ బుక్స్‌) తో పిల్లల్లో మమేకమైతే త్వరగా భాష, చదవనూ రాయనూ నేర్చుకోవడం… అదీ ఆసక్తిగా జరుగుతుంది. ఆ ఆసక్తి నుండే శక్తి ఉద్భవిస్తుంది. అలా సొంతంగా చదవడం, రాయడం వస్తే జీవితంలో ఆత్మస్థైర్యానికి కొదవేముంది? పునాది పడ్డట్టే. తమ జీవితంపై తమకే సాధికారత ఏర్పడేందుకు బీజాలు పడ్తాయి. అలా కాని చదువులు కరిమింగిన వెలగపండులా మిగిలిపోతాయని చెప్పడం సత్యదూరం కాదుగా!
ఇప్పుడు వీటన్నిటికీ సమాధానంగా షాద్‌నగర్‌లో ‘అస్వ’ (అమ్మ సోషల్‌ వెల్‌ఫేర్‌ ఫౌండేషన్‌) వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న చైల్డ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ (బాల విద్యాకేంద్రం) నిలుస్తున్నది. పైకి చూస్తే ఇది చిన్నపిల్లలు తమంత తాముగా చదువుకునే ఓ చిన్న బాల గ్రంథాలయం. ఆ గ్రంథాలయం కేంద్రంగా సాగే ఎన్నో సృజనశీల కార్యక్రమాలు. ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం, బొమ్మలు తయారు చేయడం (క్రాఫ్ట్‌ వర్క్‌) రైతు బజార్‌లు మాదిరి బాలబజార్‌లు నిర్వహించడం, మంటలేని వంట (కుక్‌ వితౌట్‌ ఫైర్‌), పౌష్టికాహార తయారీ, ప్రథమ చికిత్స, నాట్యం, నాటకం, పరిశుభ్రత – పర్యావరణ పరిరక్షణ… ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు తమంత తాముగా ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. మధ్యలో తత్సంబంధిత వాలంటీర్లు అనుసంధానకర్తలుగా మాత్రమే సమన్వయం చేస్తుంటారు.
గత 15 ఏళ్లుగా ‘అస్వ’ చేస్తున్న ఈ కృషి వలన ఎంతోమంది బాలలు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడ్డారు. కాగా మరెంతోమంది యువతీయువకులు చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ బాలలతో కలిసిపోతూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అనుభూతులను కలబోసుకుంటున్నారు. నిజంగా వారంతా ఓ పెద్ద కుటుంబంగా తమకు తాము భావిస్తున్నారు. దీనికి కేంద్రంగా నిలిచింది శ్రీనివాస్‌ – హరిత కుటుంబం.
ఈ క్రమంలో బాలకథా పరిశోథకులు వి.ఆర్‌.శర్మ, అమరవాది నీరజగార్లు ప్రత్యేకంగా ఆ పిల్లల్లోని ప్రతిభను వెలికితీసి వారిచేత కథలు, రచనలు రాయించేటట్లు చేశారు. ‘రాయండి.. రాయండి.. వాళ్ల జీవితాలను వాళ్ల భాషలోనే రాయండి’ అని కవి శేషేంద్ర శర్మ ఇచ్చిన పిలుపుకు కొనసాగింపుగా వాళ్ల జీవితాలను వాళ్ల భాషలోనే వాళ్లచేతే రాయించండి అనేలా చేశారు.
‘ఈనాటి బాల్యం… ఆనందం – విషాదం, సుఖం – దు:ఖం, భద్రత- అభద్రత, అజీర్తి – ఆకలిచావులు, ఆరోగ్యం – రోగాలు’ ఇలాంటి వాటి మధ్యన వేరువేరుగా చీలిపోయిందని ఆవేదన పడుతున్న శర్మగారు ఆ బాలలచే నిజంగానే గొప్ప ఎక్సర్‌సైజ్‌ చేయించారు.
‘పిల్లలు తీగకు పాకే లతల లాంటి వారు. చేయూతనిస్తే ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు’ అని నమ్మే నీరజగారైతే పిల్లలకు కథోత్సాహం కల్పించిన తీరు ఆ కథల్లో నిజంగానే ప్రతిఫలించింది.
ఓ చిన్నారి అశ్విని సి.యల్‌.సి. ఆనవర్సిరి కథలో చైల్డ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ను (సి.ఎల్‌.సి.) క్రియేటివ్‌ లెర్నింగ్‌ సెంటర్‌గా మార్చివేసింది.
చరణ్‌ జింక – మొసలి కథలో గమ్మత్తైన ఎత్తులు – జిత్తులు చెప్తాడు. అనుకోనిది ఏదైనా జరిగితేనే అది నాటకం అవుతుంది. మంచి కుటుంబం కథలో ఆశ్రిత జీవన్నాటకంను చెప్తుంది.
జహీరాబాద్‌ బాలోత్సవానికి వెళ్లిన ‘సనా’ దానిని ఓ రంగుల పండుగగా వర్ణిస్తూ మేము డాన్స్‌ బాగా చేశాము. కొందరు మా కన్నా ఇంకా బాగా చేశారు అంటూ హృదయ పూర్వకంగా మెచ్చుకుంటుంది.
ఏ ఒక్కరికో ఆనందం కాదు, అందరికీ ఆనందం, అందరిదీ ఆనందం అంటుంది పిల్లల కథల పండుగ కథలో వైష్ణవి.
మంజుముల్‌ బార్సు సినిమాను ఓ చిన్న కథగా రాశాడు మనోహర్‌. చీపురుతో ఆకాశాన్ని ఓ దెబ్బ కొడితే, ఆ దెబ్బకు ఆకాశం ఎన్నో కిలోమీటర్లు పైకి పోయినట్టు మధుశ్రీ ఔరా! అనేలా కథ రాసింది మరి.
ఇలా పిల్లలు తమ ఊహలు, అనుభవాలు, అనుభూతులు, కలలు రంగరించి ఓ చోట అచ్చుగా కుప్పగా పోశారు. వాటిని కథలు అనడానికి కూడా వారి మనసొప్పలేదనుకుంటాను. అందుకే పిల్లల రచనల రంగుల ప్రపంచం అని నామకరణం చేశారు. కానీ తమ బాల్యంలో చేపపిల్లల్లా తుళ్లి తుళ్లి పడుతున్న ఆ అందమైన నిష్కల్మష భావాల్ని ఓ గట్టుపై నుండి రచయితలా గమనించి రాయడం ఎంతైనా గొప్ప విషయమేగా. ఆ విధంగా వారిని బాలరచయితులుగా తీర్చిదిద్దుతున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులు. ఈ చిరుపుస్తకం ఈ నెల 2వ తేదీన పిల్లల, పెద్దల సమక్షంలో ఆవిష్కృతమైంది. విద్యావేత్త ఉపేందర్‌, బాలప్రేమికులు సి.ఎ.ప్రసాద్‌, గరిపల్లి అశోక్‌ మంచి పుస్తకం. భాగ్యలక్ష్మి, క్రియ జగన్నాథరావు, డా||విజయలక్ష్మి ప్రభృతులు పాల్గొన్నారు.

– కె.శాంతారావు, 9959745723