దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఢంకా మోగింది. షెడ్యూల్ తాజాగానే వచ్చినా, ఆ వాతావరణం ఎప్పటినుంచో ఉంది. కోడ్ అమల్లోకొచ్చినా, నోటిఫికేషన్ మాత్రం నవంబరు మూడున రానుంది. అన్ని పార్టీలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాయి. తెలంగాణ రాజకీయాలు మాత్రం కప్పల తక్కెడనే తలపిస్తు న్నాయి. జంప్‌జీలానీల జోరు నడుస్తున్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, అధికారంలోకి రావడానికి ”శక్తివంచన లేకుండా” పావులు కదుపుతు న్నాయి. పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. బీజేపీ డీలాపడింది. ఈ క్రమంలో ఎన్నికల్లో విలువలు, వలువల సంగతే మరిచిపోయాయి. ఇంకా నోటిఫికేషన్ రానేలేదు, అప్పుడే గెలుపు కోసం నానాగడ్డీ కరుస్తున్నారు. ప్యాకేజీల పేరుతో బల్క్‌గా టికెట్ల బేర సారాలు బాహాటంగానే సాగుతున్నాయి. పార్టీలో చేరికల కమిటీ వేసిన బీజేపీ, మాఫీయాను లీడ్ చేసే వ్యక్తి చీకోటి ప్రవీణ్‌ను అక్కున చేర్చుకుంది. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి దూకిన నేతకు నేరుగా ఎంబీసీ కార్పొరేషన్ పద విని కట్టబట్టింది గులాబీ సర్కారు. ఆరు గ్యారెంటీలపై ఆశలు పెట్టు కున్న కాంగ్రెస్, అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టేందుకే పూను కుంది. ఇలా ఈ పార్టీలు రకరకాల చర్యల ద్వారా ప్రజలకు హామీల పేర మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కోడ్ కూసిందో లేదో అప్పుడే అక్రమాల తుట్టే కదిలినట్టయింది. తొలిరోజే రూ.2 కోట్లకు పైగా పోలీసు తనిఖీల్లో పట్టుబడటం గమనార్హం.
బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో 15న రానుంది. అప్పుడే సీఎం ఎన్నికల సభల తేదీలు ఖరారయ్యాయి. దీన్ని అవకాశంగా తీసు కుని బతుకమ్మ చీరెల పంపిణీని తాయిలంగా మార్చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఎన్ని హామీ లిచ్చినా పార్టీలో నుంచి వెళ్లేవారే తప్ప, వచ్చే జాడ కనిపించడం లేదు బీజేపీకి. ఏడాది కింద చేరిన వారంతా తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేసుకుం టున్నట్టు వినికిడి. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడమే బీజేపీ వ్యూహమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సెలవిచ్చారు. మిగతా పార్టీల్లో టిక్కెట్లు దక్కని వారికి ఎర్రతివాచీ వేసి మరీ పార్టీలోకి లాక్కునే యోచన మో-షాల పార్టీకుంది. వీరికి అభ్యర్థులు కరువయ్యారన డానికి కిషన్‌రెడ్డి మాటలే సాక్ష్యం. సంఖ్యలు కుదిరాయంటూ, మళ్లీ మేమే అధికారంలోకి వస్తా మంటూ మంత్రి కేటీఆర్ సభలు, సమావేశాల్లో ఘీంకారాలు చేస్తూనే ఉన్నారు.
హాట్రిక్ సీఎం కేసీఆరే అంటూ కోరస్ పాడుతున్నాడు మంత్రి హరీశ్‌రావు. కాగా కాంగ్రెస్‌లో ఇంకా టికెట్ల పంచాయితీ కొలిక్కే రాలేదు, కుక్కర్లు పంచేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తూ దొరికారని బీఆర్‌ఎస్ ఆరోపణ. జనాభా లెక్కలు తీయని బీజేపీ ఏలు బడిలో, ఇండియా కూటమికి చెందిన బీహార్‌లో కులగణన చేయడం పట్ల రాష్ట్రంలో భారీగానే చర్చకు ఊతమి చ్చింది. కల్వకుంట్ల కవిత మాటల్లో అది కనిపించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దళితబంధు, బతుకమ్మ చీరల పరిస్థితిపైనా చర్చ జరుగుతున్నది. నిబంధనల ప్రకారమే పంపిణీ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సీఈవో చెప్పే శారు. కాగా ఎన్నికల కోసం వామపక్షాలు ఐక్యంగా నడవాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు చర్చలు జరుపుతున్నాయి. కాగా బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు పైకి లేకపోయినా, అంతర్గతంగా అంతా సవ్యంగా ఉందనే వ్యాఖ్యానాలు ఉండనే ఉన్నాయి. మతోన్మాదులతో ఎలాంటి సం’బంధం’ లేదంటూనే అంటకాగేందుకు తహతహ లాడుతున్నాయి.
వియ్యం లేకపోతే అసలుకే ఎసరొస్తుందనే భయం బీఆర్‌ఎస్, బీజేపీలో నిజంగానే కనిపిస్తున్నది. ఎన్నికల్లో ప్రతిపక్షాలపై విజయం సాధించడానికి పదేండ్ల పాశుపతాస్త్రంతో సిద్ధంగా ఉన్నామంటూనే, ఒకింత ఉలిక్కిపాటు బీఆర్‌ఎస్‌లో ఉన్నది. తొమ్మిదేండ్లల్లో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చామంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నా, ఆ పార్టీలో ఉత్సాహం కరువైంది. ఒకవైపు ప్రజలను ఆకట్టుకోవడానికి విస్త్రృతంగా హామీలు ఇస్తూనే, మరోవైపు తమ పార్టీకే ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పరాజయాన్ని మూట కట్టుకున్న కాంగ్రెస్, ఈసారీ అమీతుమీకి సిద్ధమవుతున్నది. ఇటీవల అనేక సభలు, సమావేశాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్, త్వరలో రాహుల్, ప్రియాంకతో బస్సుయాత్రకు శ్రీకారం చుట్టే యత్నంలో ఉంది. నవంబరు 30న జరిగే ఎన్ని కల కురుక్షేత్రానికి ఎవరికి వారు తమదైన శైలిలో వ్యూహాంతో అడుగులేస్తున్నారు. ఎన్నికల్లో మ్యాజిక్కులు చేసి ఓటును కొల్ల గొట్టే రాజకీయ పార్టీలపై ఓ కన్నేయాలి. కల్లబొల్లి కబుర్ల మాయలో పడకుండా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి ఓటే ఆయుధంగా అప్రమత్తం కావాలి. ఎన్నికల్లో చర్చ జరగాల్సింది ప్రజా సమస్యల పైన. పునర్వీభజన చట్టంపైన. సాగునీటి ప్రాజెక్టులపైన. షెడ్యూల్డ్ సంస్థలపైన. వీటిపై కాకుండా రాజకీయ తిట్లపురాణాలతో ప్రజలను గందరగోళ పరిచి తమ పబ్బంగడిపే యత్నాన్ని అడ్డుకోవాలి. విలక్షణ తీర్పునివ్వాలి. పారాహుషార్.