కంచెలు బద్దలైన వేళ..!

When the fences are broken..!ఆ నల్లని రాళ్లలో దాగుండే కన్నుల గురించీ, ఆ బండల మాటున మ్రోగే గుండెల గురించీ అడిగితే అమర శిల్పి జక్కన్న బదులివ్వకపోవచ్చు గాని, ‘జ్ఞానపీఠం’ నుండి లేచొచ్చి సి.నారాయణరెడ్డి సమాధానం చెప్తాడు కావచ్చు! ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ముళ్ల కంచెలు పరచడం, కందకాలు తవ్వించుకోవడం జానపద చరిత్రల్లోనో, విఠలాచార్య సినిమాల్లోనో కనపడే దృశ్యాలు. శత్రు రాజుల నుండి తమను తాము రక్షించుకునేందుకు ఆయా దేశాల రాజులు, చక్రవర్తులు చేసిన చేష్టలవి. మరి ఏవైపు నుండి దాడొస్తుందని, ఏ శత్రువులు దండయాత్ర చేస్తారని కేసీఆర్ ప్రగతిభవన్‌ చుట్టూ ఈ కంచె ఏర్పాటు చేశాడో తెలీదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా ఇది కన్పడదు. చివరకి రక్త పంకిలమైన చరిత్రున్న అమెరికాలో వైట్‌హౌస్‌ ముందే ప్రదర్శనలు జరుగుతాయి. వాషింగ్టన్‌ డి.సి.లో ఐ.ఎమ్‌.ఎఫ్‌., ప్రపంచ బ్యాంకు కార్యాలయాల ముందే వివిధ రకాల నిరసనలు నిత్యం జరుగుతూంటాయి.
ఉద్యమ పార్టీగా కుబుసం విడిచేసిన ‘మిన్నాగు’ తమది ‘ఫక్తు’ పాలకపార్టీ అంటూ బుసలుకొట్టిన తర్వాత భారీ ఇనుప గేట్లకు ఇనుప కంచెలు మొలవడం పెద్ద ఆశ్చర్యమేమీకాదు. ఒక పక్క రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం జరుగుతుండగానే కంచెల్ని కూల్చేయడం స్వాగతించాల్సిన విషయం. పంజరంలో బందీగా ఉన్న పక్షిని బయటి విశాల ప్రపంచంలోకి వదిలేస్తే అది ఎంత ఆనం దిస్తుందో తెలీదు గానీ, చుట్టూ కందకాలు, కంటకాలతో నిండిన ప్రహరీల మధ్య, పోలీసుల పహారాలో ప్రజల కందనంత దూరంలో, నిక్షిప్తమైన అధికారాన్ని బద్దలు కొడ్తే లోపలికెళ్ళేవారి ఆనందానికి అవధులుండవు. చివరికి ప్రజాధనంతో నిర్మించిన సెక్రటేరియట్‌లోకి… ఎన్నికైన పార్లమెంటు సభ్యుడిగానూ అనుమతి నిరాకరించబడ్డ వ్యక్తే ముఖ్యమంత్రి రూపంలో ప్రవేశిస్తూ ”ప్రజలు హక్కుదార్లుగా లోనికి రావచ్చ”ని చెప్పినపుడు బయటికి విడుదలైన పక్షికి మించిన ఆనందం లోనికెళ్లే మనుషుల్లో వెల్లివిరిస్తోంది. ఈ వాస్తవ తెలంగాణను రేవంత్‌ సర్కార్‌ నిలబెట్టగలిగితే అంతకుమించిన ఆనందమేముంటుంది?!
ఏమైనా కంచెలు పెకలించడం ఒక రూపం మాత్రమే. ‘రూపం’పై పోరాటమే చాలదు. ‘సారం’ దగ్గరికెళ్లాలి. 1946 – 52 మధ్య మన తెలంగాణలో మట్టి మనుషులే గడీలను కూల్చారు. ఆ తర్వాత బ్రహ్మజెముడు మొక్కలు కాదు, వనాలే పెరిగాయి. విషవృక్షాల దుంపనాశనం చేసే వరకు ప్రజలు విశ్రమించకుండ చూడాలి.
కేసీఆర్‌ ఓటమికి ఆ ప్రభుత్వ నకారాత్మక చర్యలే కారణమా, కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కారణమా, ముఠాల్ని, వాటి కుమ్ములాటలను నియంత్రించగలిగిన అధిష్ఠానం గొప్పతనం కారణమా వంటి వెన్నో ఉన్నాయి. ఎమ్మెల్యేల అవినీతిపై కూడా మీడి యాలో బానే చర్చ జరుగుతోంది. ఆవు చేలో మేస్తే దూడ (లు) గట్టున మేస్తాయా అన్నట్టు ఆర్మూరులో ఆర్‌టీసీకి రూ.ఏడు కోట్లు ఎగవేసిన శాసనసభ్యుని పాగా, మరిక తాజా మాజీ శాసన సభ్యుడి బకాయి రూ. 1.63 కోట్లు, ఒక పెద్ద సంస్థ బకాయి రూ. ఆరు కోట్లు, మరొక సంస్థ బకాయి రూ.5కోట్లు, ప్రస్తుతానికి బయట కొచ్చాయి. తవ్వితే ఇంకెన్ని పాములు బయటి కొస్తాయో! ఎన్‌పీడీసీఎల్‌ కి రూ.రెండు కోట్లు ఎగవేసిన శాసనసభ్యుని కథనం నేటి పత్రికల్లోని వార్త. విద్యుత్‌ శాఖలోని రూ.85 వేల కోట్ల అప్పుల్ని ఇప్పటిదాకా కప్పిపెట్టిన ఉన్నతాధికారి రాజీనామాను ఆమోదించవద్దని ఈ ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం.
గత పదేండ్లగా కేసీఆర్‌ సర్కార్‌ చర్యలపై శ్వేత పత్రం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం కూడా ఆహ్వానించదగ్గదే. వివిధ డిపార్ట్‌మెంట్లలో పదకొండు వేల ఫైళ్లు దుమ్ముకొట్టుకుంటూ పడున్నాయట! యాదాద్రి థర్మల్‌ కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ద్వారా తీసుకున్న అప్పులో నుండి రూ.30వేల కోట్లు కాళేశ్వరానికి మళ్లించి నట్లు నిన్న ముఖ్యమంత్రి సమీక్షలో బయల్పడినట్లు తెలు స్తోంది. మాటల మాయాజాలంతో నెట్టుకొస్తున్న కేసీఆర్‌ సర్కార్‌ తీరుకు దర్పణాలివి.
వయసురీత్యా మిగతా రాష్ట్రాలన్నిటి కంటే చిన్నది మన రాష్ట్రం. కేసీఆర్‌ కుటుం బంపై వచ్చిన, వస్తున్న ఆరోపణలు ఒక రకమైతే, రాష్ట్రంలో జరిగిన ఈ అధికార దుర్వినియోగాల్ని, ఇష్టారీతిగా తెలంగాణతో ఆటలాడుకున్న ఈ పద్ధతుల్ని ఎండగట్టాలి. ప్రతిపక్షంలో ఉండి పాలకులపై వాక్బాణాలు సంధించడం వేరు. పాలకులైన తర్వాత ప్రజలకు తామేంటో, ప్రజల సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో చేసి చూపడం వేరు.
ప్రజల సమస్యల తోరణం రేవంత్‌రెడ్డి సర్కార్‌ కోసం వేచియుంది. వాటిని పరిష్కరించగలిగితేనే ప్రజలకు ఉపశమనం చేసినవారవుతారు.
”పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడే పుట్టదని”
వాడు ప్రయోజకుడై ప్రజల మన్ననలను పొందినపుడేనని సుమతీ శతకకారుడు చెప్పిన విషయం ఈ ప్రభుత్వ గమనంలో ఉండటం అవసరం.