హైదరాబాద్ నగరంలో నలభై శాతం రోడ్లు డ్రెయినేజీ నీటితో తడిసి ముద్దవుతున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నుంచి డ్రెయినేజీ నీరు ప్రవహిస్తుండడంతో ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చాలా పోష్ లొకాలిటీ అలాగే గ్రీన్ ఛాలెంజ్‌లో ఉత్తమ కాలనీగా గుర్తింపు పొందిన కాలనీలు సైతం డ్రెయినేజీ కంపుతో సతమతమ వుతున్నాయి. ఏండ్ల క్రితం వేసిన పైపులైన్ వాటి మీద పెద్ద పెద్ద చెట్లు, వాటి వేర్లతో పైప్ లైన్ ధ్వంసమైన ఆనవాళ్లు చాలా చోట్ల ఉన్నాయి. ఎల్‌బి నగర్, బియన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, మీర్‌పేట్, టికేఆర్ కమాన్, జిల్లెలగూడ, బాలాపూర్‌లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. పెరిగిన జనాభాకు తగినట్టుగా పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో వర్షం పడినప్పుడల్లా భవంతుల మధ్య ఉన్న రోడ్లపై మురుగునీరు ధారావాహికంగా ప్రవహిస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టినా, కాల్స్ చేసి ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ, సీవరేజ్ బోర్డు అధికారుల్లో చలనం లేదు. బియన్ రెడ్డి, బీడి గార్డెన్స్, చైతన్యపురి, కర్మన్‌ఘాట్ దగ్గర మురుగునీరు మోకాలిలోతు వెళుతున్నా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారే తప్ప సమస్య పరిష్కరించాలనే ఆలోచన లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత డ్రెయినేజీ పైపులైన్ సామర్థ్యం సరిపోకపోవడంతో తరుచూ మ్యాన్ హోల్స్ పొంగి రోడ్లపై మురుగు నీరు పారుతోం దనేది తెలియని విషయమా? అక్కడక్కడ గుంతల్లో మురుగునీరు నిల్వ ఉండటంతోవిపరీతమైన దుర్వా సన కూడా వస్తోంది. దోమలు వృద్ధి చెంది కాలనీ వాసులు విషజ్వరాల బారిన పడుతున్నారు. మ్యాన్‌హోల్ ధ్వంసమై రోడ్లు గుంతలమయమైతే నాలుగు కర్రలు నాటి, ప్లాస్టిక్ బాక్సులు పెట్టి హెచ్చరిక బోర్డుపెడుతున్నారే తప్ప శాశ్వత పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేద్దామన్న స్పృహ మాత్రం కార్పొరేటర్లకు లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన పార్టీలో లేకపోవడంతో సమస్యల పరిష్కారానికి ఉత్సాహం కనపరచడం లేదనే విమర్శ కూడా వినిపిస్తోంది.ఏడాదిలో రెండు వందల రోజులకు పైగా మురుగు నీటిలోనే వెళ్లాల్సి న దుస్థితి ఉందంటే ఇక్కడి కాలనీవాసులు ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు చొరవ తీసుకుని రోడ్లపై మురుగు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– డా. ఏ. ప్రణయనాథ్ రెడ్డి