పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల రేటుకు పడిపోయే స్వభావం ఉందంటూ జోస్యం చెప్పే సిద్ధాంతాలను ముందుకు తెచ్చిన పెద్దపెద్ద ఆర్థికవేత్తలు చాలామంది ఉన్నారు. ఈ విధమైన సిద్ధాంతాలను ప్రతిపాదించిన ఆర్థికవేత్తలకు పెట్టుబడిదారీ విధానం ఎల్లకాలమూ కొనసాగే విధానం కాదన్న వాస్తవం తెలుసు అని మార్క్స్ అన్నాడు. ఈ సిద్ధాంతాలలో కొన్ని తర్కానికి నిలబడతాయి. మరికొన్ని నిలబడవు. ఆ విధంగా నిలబడని సిద్ధాంతాలలో ఆడమ్ స్మిత్ సిద్ధాంతం కూడా ఉంది.
పెట్టుబడి ”అతిగా” పోగుబడితే అది లాభాల రేటు పడిపోడానికి దారి తీస్తుందని ఆడమ్ స్మిత్ భావించాడు. అతని వాదన ఈ విధంగా ఉంది… ఏదైనా ఒకానొక పరిశ్రమలో అంతకంతకూ ఎక్కువ పెట్టుబడి పోగుబడి, అంతకంతకే ఎక్కువ సరుకులు ఉత్పత్తి అయితే, అప్పుడు ఉత్పత్తికయ్యే ఖర్చుతో పోల్చి చూసుకున్నప్పుడు ఆ సరుకు ధర పడిపోతుంది. దాంతో ఒక్కో సరుకు మీదా వచ్చే లాభం పడిపోతుంది. ఆ విధంగా ఒక్కో సరుకు మీదా వచ్చే లాభం పడిపోయినప్పుడు మొత్తం పెట్టిన పెట్టుబడి మీద వచ్చే లాభం కూడా పడిపోతుంది. ఇదే వాదన మొత్తం ఆర్థిక వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి అంతకంతకూ ఎక్కువ పోగుబడినప్పుడు లాభాల రేటు పడిపోతుంది.
అయితే ఈ వాదన తప్పు. ఒకానొక పరిశ్రమకో, రంగానికో వర్తించేది యావత్తు ఆర్థిక వ్యవస్థకు వర్తించదు. ఒకానొక పరిశ్రమలోనో, రంగంలోనో పెట్టుబడి ఎక్కువగా పోగుబడి, మరింత ఎక్కువ మంది కార్మికులను నియమించుకుని దాని ద్వారా అదనపు ఉత్పత్తిని చేశారనుకుందాం. ఆ అదనపు ఉత్పత్తిని వినియోగించేందుకు కావలసిన అదనపు డిమాండ్ కేవలం ఆ రంగం నుండే ఉత్పన్నం కాదు. ఇతర రంగాల నుండి కూడా తోడవ్వాలి. కాని తక్కిన రంగాల్లో ఉత్పత్తి గాని, అదనపు డిమాండ్ కాని ఏమీ మారకుండా అదే రీతిగా కొనసాగుతాయన్న ప్రాతిపదికన ఆడమ్ స్మిత్ సిద్ధాంతం నిర్ధారించింది. కేవలం ఆ రంగంలోనే అదనపు డిమాండ్ వచ్చేటట్లయితే ఆ రంగంలో చేసిన అదనపు ఉత్పత్తి విలువ కన్నా ఆ రంగంలో కలిగే అదనపు డిమాండ్ అనివార్యంగా తక్కువగానే ఉంటుంది. అప్పుడు ఆ సరుకు ధరను తగ్గించడం మినహా వేరే మార్గం ఉండదు. అలా తగ్గించినందు వలన లాభం రేటు తగ్గుతుంది. ఇదే ఆడమ్ స్మిత్ చెప్పినది.
కానీ, మనం ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తంగా చూస్తే ఈ వాదన నిలబడదు. అయితే ఇప్పుడిప్పుడు కొందరు అమెరికన్ వామపక్ష ఆర్థికవేత్తలు ఆడమ్ స్మిత్ వాదననే మళ్ళీ ముందుకు తెస్తున్నారు. ఇందులో వాళ్ళు అదనంగా చెపుతున్నది ఇలా ఉంది: పెట్టుబడి పోగుబడిన తర్వాత పెట్టుబడిదారుల నడుమ పోటీ పెరుగుతుంది. దాని ఫలితంగా జరిగే సాంకేతిక పురోగతి వలన శ్రామిక ఉత్పాదకత కూడా పెరుగుతుంది. దానివలన అదనంగా జరిగే ఉత్పత్తి చెల్లుబాటు కావాలంటే ఆ సరుకు ధరను తగ్గించక తప్పదు. అప్పుడు లాభాల రేటు తగ్గుతుంది.
సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా కార్మికుల సంఖ్య తగ్గుతుంది. దానివలన కార్మికులకు చెల్లించే జీతాల వాటా తగ్గుతుంది. కార్మికులకు చెల్లించే వాటాలో తగ్గుదల కన్నా ఆ సరుకు ధర ఎక్కువగా తగ్గినప్పుడే పై వాదన చెల్లుబాటు అవుతుంది. కాని సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు కార్మికుల జీతాల వాటా తగ్గిన దాని కన్నా సరుకు ధర ఎక్కువ మోతాదులో తగ్గడం అనేది జరగదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే దాని ఫలితంగా కార్మికుల సంఖ్య బాగా తగ్గుతుంది. దాని ఫలితంగా వారికిచ్చే వేతనాల వాటా బాగా పడిపోతుంది. దానితో పోలిస్తే సరుకు ధర తగ్గుదల కారణంగా పెట్టుబడిదారుడి లాభం తగ్గేది ఏమీ ఉండదు.
అందుచేత ఆడమ్ స్మిత్ వాదనను, దాని ప్రాతిపదికన అమెరికన్ వామపక్ష ఆర్థికవేత్తలు చేసే వాదనలను పక్కన పెడదాం. తక్కిన వారిలో రికార్డో చేసిన వాదనను చూద్దాం… అతడు మొక్కజొన్నను ఒక సరుకుగా తీసుకుని తన వాదనను చేశాడు. మొక్కజొన్నను ముడిసరుకుగా ఉపయోగించే ఉత్పత్తిదారులకు లాభాలు పెరిగిన కొద్దీ ఆ పంటను మరింత ఎక్కువగా పండించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదనంగా మొక్కజొన్న పండించాలంటే అందుకు అదనంగా భూమి అవసరం అవుతుంది. కాని మొక్కజొన్న పంటకు అనువుగా ఉండే భూమి పరిమితంగానే ఉంటుంది. అప్పుడు తక్కువ దిగుబడినిచ్చే భూముల్లో సైతం మొక్కజొన్న పంట సాగు చేయడం ప్రారంభిస్తారు. ఆ భూముల్లో మొక్కజొన్న దిగుబడి తక్కుగా ఉంటుంది. దాని ఫలితంగా పెట్టుబడిదారులకు వచ్చే లాభం రేటు కూడా తగ్గుతుంది. ఈ వాదనలో ఒక తర్కం ఉంది.
ఇక ఆ తర్వాత మార్క్స్ చెప్పినది చూద్దాం. పెట్టుబడి పోగుబడుతున్నకొద్దీ స్థిర పెట్టుబడికి, అస్థిర పెట్టుబడికి మధ్య నిష్పత్తి మారిపోతూ ఉంటుంది. స్థిర పెట్టుబడి శాతం పెరుగుతూ పోతుంది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం కూడా మెరుగుపడుతూ ఉంటే అప్పుడు శ్రామిక ఉత్పాదకత పెరుగుతుంది. ఆ పరిస్థితుల్లో నికరంగా జరిగే ఉత్పత్తిని అమ్మినప్పుడు వచ్చే రాబడిలో వేతనాలకు, లాభానికి మధ్య నిష్పత్తి గనుక స్థిరంగా ఉంటే అప్పుడు లాభాల రేటు పడిపోతుంది (ఉదా: ఒకానొక సరుకు విలువ రూ.10 అనుకుందాం. అందులో పెట్టుబడి రూ.5 అనుకుందాం. తక్కిన రూ.5లో వేతనాలకి రూ.1, పెట్టుబడిదారుడి లాభంగా రూ.4 ఉంటే వేతనాలకు, లాభానికి మధ్య నిష్పత్తి 1:4 అవుతుంది. ఈ నిష్పత్తి స్థిరంగా కొనసాగడం అంటే పెట్టుబడిదారుడి లాభం పెరిగితే అప్పుడు కార్మికుల వేతనాలు కూడా అదే మోతాదులో పెరగడం అన్నమాట -అను).
అదే పెట్టుబడిదారుడి లాభం పెరిగినా కార్మికుల వేతనాలు పెరగకుండా పాత స్థాయిలోనే కొనసాగితే అప్పుడు లాభాల రేటు పడిపోకుండా పెరుగుతూనే ఉంటుంది. అయితే దీనికీ ఒక పరిమితి ఉంటుంది. స్థిర పెట్టుబడి పెరుగుదల అలాగే కొనసాగుతూ పోతే అప్పుడు కార్మికుల వేతనాలను ఉన్నస్థాయిలో కొనసాగించడం కుదరదు (కొనసాగిస్తే లాభాల రేటు పడిపోతుంది గనుక) వాటిని కుదించక తప్పదు, కాని కార్మికుల వేతనాలను ఒక స్థాయికన్నా తక్కువకు కుదించడం సాధ్యం కాదు. అటువంటప్పుడు లాభాల రేటు పడిపోవడం మొదలవుతుంది.
అయితే ఉత్పత్తిలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి వినిమయ సరుకులు. రెండవది ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్ధాలు, యంత్రాలు. ఈ ముడి పదార్థాల, యంత్రాల ఉత్పత్తిలో కన్నా వినిమయ సరుకుల ఉత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానం, శ్రామిక ఉత్పాదకత ఎక్కువగా పెరిగినప్పుడే స్థిర పెట్టుబడి నిష్పత్తి పెరుగుతుంది. ఇలా కొన్ని సందర్భాలలో జరగవచ్చు. అయితే వాస్తవ ఆచరణలో ఇలాగే అనివార్యంగా జరిగితీరాలని లేదు. మార్క్స్ చెప్పినది తార్కికంగా సరైనది. ఆడమ్ స్మిత్ చెప్పిన మాదిరిగా కాదు.
తార్కికంగా సరైన మూడో వాదనను పరిశీలిద్దాం… ఒకానొక దేశంలో స్థూల డిమాండ్ పెరుగుదల లేకుండా నిలిచిపోయిందనుకుందాం. అప్పుడు ఉత్పత్తి అయిన సరుకులు అమ్ముడు పోకుండా కొంత నిలవ ఉండిపోతాయి. అప్పుడు పూర్తి స్థాపక సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేయకుండా కొంత ఆపుతారు. దాని ఫలితంగా లాభాల రేటు పడిపోతుంది. లాభాల రేటును పడిపోకుండా కొనసాగించాలంటే అప్పుడు కార్మికుల వేతనాల వాటాను తగ్గించాలి. దాని వలన స్థూల డిమాండ్ మరింత పడిపోతుంది. అంటే లాభాల రేటు పడిపోకుండా నిలబెట్టడం కోసం తీసుకున్న చర్య (కార్మికుల వేతనాల వాటాను తగ్గించడం) ఆ లాభాల రేటును నిలబెట్టకపోగా పడిపోయే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.
లాభాల రేటు పడిపోయే ధోరణి అంటే అది ధోరణి మాత్రమే. వాస్తవంగా లాభాలరేటు పడిపోయేదాకా పెట్టుబడిదారుడు ఆగడు. ఈ లోపే దానిని అరికట్టే చర్యలు తీసుకుంటాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల రేటు పడిపోకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి లాభాల రేటు పడిపోవడం మీద చర్చ అంటే జోస్యం చెప్పడం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ తన లాభాల రేటును నిలబెట్టుకోడం కోసం ఏ విధంగా వ్యవహరిస్తుందో విశ్లేషించడానికి తోడ్పడే సాధనం అని గ్రహించాలి.
నిజానికి లాభాల రేటు పడిపోకుండా నిలబెట్టుకునే క్రమంలోనుంచే సామ్రాజ్యవాదం ముందుకొచ్చింది. స్థిర పెట్టుబడి నిష్పత్తి పెరిగిపోతూ ఉంటే అది లాభాల రేటు పడిపోడానికి దారి తీస్తుంది. కనుక ఆ నిష్పత్తి పెరిగిపోకుండా ఉండేందుకు చేసే ప్రయత్నం వలస దేశాల నుండి ముడి సరుకులను కారు చౌకగా గాని, ఉత్తి పుణ్యానికి గాని కొల్లగొట్టేందుకు సామ్రాజ్యవాద దేశాలను పురికొల్పింది. అదే మాదిరిగా ఉత్పత్తి దేశీయ మార్కెట్ లోని డిమాండ్‌ను మించిపోయి జరిగితే, ఆ అదనపు ఉత్పత్తిని అమ్ముకోడానికి వలస దేశాల మార్కెట్లను వాడుకున్నారు. ఇక్కడ రికార్డో ఉదహరించిన మొక్కజొన్న ఉదంతం గుర్తు చేసుకుందాం. నిజంగానే మొక్కజొన్న పండించే భూభాగం పరిమితంగా ఉంటే అప్పుడు తమ లాభాల రేటు పడిపోకుండా ఉండటానికి సామ్రాజ్యవాదులు వలస దేశాల్లో ఆ మొక్కజొన్న వినియోగాన్ని ఏదో విధంగా తగ్గించి తమ దేశాల వైపు మళ్ళించుకుంటారే తప్ప లాభాల రేటును తగ్గనివ్వరు.
వలస విధానం ఇప్పుడు లేదు. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనం ఉంది. దాని వలన సామ్రాజ్యవాదం మూడవ ప్రపంచ దేశాల మీద నయా ఉదారవాద విధానాలను రుద్దగలుగుతోంది. అంతకు మునుపు వలస పాలనలో ఏ విధంగా కొల్లగొట్టగలిగారో, ఇప్పుడు ఈ నయా ఉదారవాద విధానాల ద్వారా కూడా అదే మాదిరిగా సామ్రాజ్యవాదులు మూడవ ప్రపంచ దేశాలను కొల్లగొట్టగలుగుతున్నారు. – స్వేచ్ఛానుసరణ
ప్రభాత్ పట్నాయక్