కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు, వాటి యజమానులు ఒకే అంశంపై ఆందోళనలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రభుత్వాల పుణ్యమా అని ప్రత్యేక రాష్ట్రంలో అలాంటి పరిస్థితి నెలకొంది. పాలకులు మారినా విద్యార్థుల భవిష్య త్తు మాత్రం మారడం లేదంటే ఇదేనేమో! అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు, వచ్చాక వాటి విస్మరించడం, దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. కానీ పదేండ్ల తర్వాత పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత సర్కార్‌లో విద్యారంగానికి, విద్యార్థులకు జరిగిన నష్టాల్ని గుర్తుచేసుకుని మరీ కొత్త ప్రభుత్వాన్ని గెద్దనెక్కించారు. కానీ ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులు, వారి భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యవైఖరితోనే వ్యవహరించడం బాధాకరం. ఎస్సీ,ఎస్టీ,బీసీల్లో సామాజికంగా వెనుకబడిన పేద, బడుగు బలహీనవర్గ విద్యార్థులు చదువుకునేందుకు స్కాలర్‌షిప్, ఫీజురీయంబర్స్‌మెంట్ ఎంతగానో దోహదపడతాయనేది వాస్తవం. అయితే ప్రభుత్వ విద్యారంగం పట్ల నమ్మకాన్ని పెంచడంలో విఫలమైన పాలకుల కారణంగా చాలామంది ప్రయివేటు విద్యాసంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రయివేటులో చదివే విద్యార్థులక కూడా సర్కార్ ఫీజు రీయంబర్స్‌మెంట్ అందించాలి. కానీ, నాలుగేండ్ల నుండి ఫీజు బకాయిలను విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో విద్యార్థులే కాదు, వారితో పాటు కళాశాలల యజమానులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. గత సర్కార్‌ది బకాయిలు విడుదల చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం. దానివలన చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైన దుస్థితి. తాము అధికారంలోకి రాగానే పెండింగ్‌లోని బకాయిలన్నీ విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. కానీ, పాలన ప్రారంభించి పదినెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కొలువులకు, చదువులకు గ్యారంటీ లేకుండా పోయింది. గత సర్కార్ చేసిన తప్పిదాలతో ఉన్నత విద్య సంక్షోభంలోకి వెళ్లింది. దాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు నాణ్యమైన విద్య అందుతుందనే ఆశతో రీయంబర్స్‌మెంట్‌పై ఆధారపడి ప్రయివేటు కళాశాలల్లో చదువుతున్నారు. నాలుగేండ్లుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజుల్ని ప్రభుత్వం చెల్లించపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థికభారంతో అవస్తలు పడుతున్నారు. రాష్ట్రంలో ఏడాదికి 14లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు, వీరికి యేటా రూ.3వేల కోట్లు అవసరమవుతాయి. కానీ నాలుగేండ్లుగా ఈ చెల్లింపుల్లేవు. విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ప్రభుత్వం ట్రెజరీల నుండి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలేమో ఫీజులు కట్టలేదనే పేరుతో చదువు పూర్తయినా.. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. దీంతో పైచదువుల కోసం అప్పులు చేసి మరీ సర్టిఫికెట్లు తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
స్కాలర్‌షిప్, రీయంబర్స్‌మెంట్‌కు కొన్ని మార్గదర్శక సూత్రాల్ని ప్రభుత్వాలే రూపొందించాయి. కానీ, వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. అకాడమిక్ ప్రారంభంలోనే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల నుంచి పత్రాల్ని పరిశీలించాలి.అందులో అర్హులని తేలితే ముందే 25శాతం, మధ్యలో 50శాతం, మిగిలిన ఫీజు ఏడాది చివరిలో చెల్లించాలి. కానీ ఈ నిబంధనల్ని గత, నేటి ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్యార్థి దరఖాస్తు చేసుకుని తన కోర్సు ముగిసేవరకు కూడా ఫీజులు విడుదల చేయడం లేదు. ఈ బకాయిల్ని ఓసారి పరిశీలిస్తే గనుక సమస్య ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. 2019-20కి గాను రూ.800 కోట్లు, 2020-21 రూ.2356 కోట్లు, 2021-22 రూ.2100.43 కోట్లు, 2022-23 రూ.2958.14 కోట్లు మొత్తంగా చూస్తే రూ.8214.57 కోట్లు ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని సర్కార్లు విడుదల చేయకపోవడంతో ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ‘విద్యార్థులకు సంబంధించిన ఫీజు సర్కార్ చెల్లిస్తుందనే ఆశతో విద్యార్థుల్ని చేర్పించుకున్నాం. కొంత ఇబ్బంది అయినా సరే, అప్పులు తెచ్చి కళాశాలల్ని నడిపిస్తున్నాం. ఇప్పుడేమో బకాయిలు బాగా పేరుకుపోయాయి. ఎంతకాలమని ఇలా నెట్టుకురావాలి?’ అని వాపోతున్నారు. వారి ఆవేదనలో కూడా అర్థమున్నది. సర్కార్ బకాయిలు చెల్లించక పోవడంతో కొంతమంది ఆందోళనలకు దిగుతున్నారు. మరికొం దరైతే ఏకంగా కళాశాలల్ని నడపలేక మూసేసుకుంటున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో ఇంటర్ 166, డిగ్రీ 72, ఇంజనీరింగ్ 29, పారా మెడికల్ కళాశాలలు 42 మూతపడ్డాయి. యాజమాన్యాలు కూడా కళాశాలలు బందుచేసి ఐదురోజుల పాటు సమ్మెకు దిగారు. ఓ వైపు విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు యాజమాన్యాల నిరసనలు కొనసాగడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. టోకెన్స్ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ బకా యిలు విడుదల చేస్తామని ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలకు హామీనిచ్చారు. కానీ నేటివరకూ కూడా బకాయిలు విడుదల చేయకపోవడంలో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీనిచ్చి దాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నది. ఎందుకంటే ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేదు. సమీక్షలు కూడా సజావుగా జరగడం లేదు. ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖను ఉంచుకోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలియదు! ఈ శాఖను స్వయంగా ఆయనేే చూస్తున్నారంటే సమస్యలు వెంటనే పరిష్కార మవుతాయని ఎవరైనా ఆశిస్తారు. కానీ, జరుగుతున్నదేమిటి? ఇంతవరకు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడానికి కారణలేంటి? ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో విద్యార్థులు చదువుల్లో ఎలా రాణిస్తారు? ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం. విద్యారంగానికి కమిషన్ వేసి ఛైర్మన్‌ను, కమిటీని నియమించడం మంచిదే. కానీ, పెండింగ్‌లో బకాయిలు విడుదల చేయక పోవడం చూస్తే విద్యార్థుల భవిష్యత్తుపై సర్కార్ నిర్లక్ష్యపు ధోరణి కనిపిస్తున్నది. ఈ విషయమై ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళనలు చేపట్టింది. ఈ ఉద్యమాల్లో విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవ్వాలి. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్న సంగతి మరవకూడదు.
– శనిగరపు రజినీకాంత్, 8106052553