కార్మికుల కల సాకారమైన వేళ…

When workers' dreams come true...కార్మికవర్గం చేయిచేయి కలిపింది. శ్రేయోభిలాషుల మమకారం తోడైంది. ఇంకేముంది పదేండ్ల నిరీక్షణ ఫలించింది. శ్రామికుల కల సాకరమైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో సీఐటీయూ భవన నిర్మాణం పూర్తయింది. ఈనెల 28న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు కామ్రేడ్‌ బృందాకారత్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆ రోజున కార్మికులు కదం తొక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఎదులాపురం ఇక ఎరుపెక్కనుంది. తమ హక్కుల సాధనతో పాటు కార్మిక, కర్షక, సామాజిక ఐక్య పోరాటాలను ముమ్మరం చేయడానికి భవనం వేదిక కానుంది. పాలకుల విధానాలపై పోరాడే ఎవరికైనా ఇది నిలయంగా ఉంటుంది.
సరిగ్గా పదేండ్ల కిందట 2014 సెప్టెంబర్‌ 22న ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. ఆ ఏడాదిలోనే భవనం పూర్తి చేయడానికి ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. నాటి పరిస్థితుల్లో ఒక ఫ్లోర్‌ పూర్తిచేసుకుని రెండు ఆఫీస్‌ రూములు నిర్మించి కార్యాలయాన్ని పనిలోకి తీసుకురాగలిగాం. జిల్లాల విభజనతో ఉమ్మడిగా ఉన్న ఉద్యమం నాలుగు జిల్లాలుగా విడిపోవడం.. తదనంతరం జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో భవన నిర్మాణం అనుకున్న విధంగా పూర్తి కాలేకపోయింది. అయినప్ప టికీ ఈ భవనం ఆర్టీసీ కార్మికుల యాభైరోజుల సమ్మెకు వేదికైంది. పోరుబాట పట్టిన కుండిషేకుగూడ ఆదివాసులను అక్కున చేర్చుకుంది. సీసీఐ సాధన పోరాట కమిటీ ఇక్కడే రూపుదాల్చింది. కార్మిక, కర్షక పోరాటాలకు కేంద్ర బిందువైంది. ఈ మధ్యకాలంలో జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, సీఐటీయూ ఆల్‌ ఇండియా కోశాధికారి కామ్రేడ్‌ ఎం.సాయిబాబు ప్రోత్స హించిన తీరు మాలో స్థైర్యాన్ని నింపింది. మరోమారు బిల్డింగ్‌ నిర్మాణం వైపు దృష్టి సారించేందుకు ఊతమిచ్చింది. పార్టీ జిల్లా ఇన్‌చార్జి కామ్రేడ్‌ బండారు రవికుమార్‌ ప్రతినిధ్యం వహిస్తూ, అందిస్తున్న సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌ రోజువారిగా ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించి ప్రోత్సాహం అందించడం పనిచేయడానికి దోహదం చేశాయి. యావత్తు జిల్లా ఆఫీస్‌బేరర్స్‌ అందరూ బిల్డింగ్‌ నిర్మాణం తమ భుజ స్కందాలమీద వేసుకొని పూర్తి చేయడానికి సంకల్పించారు. సహజంగానే పోరాటాల్లో అందరికీ ఆద ర్శంగా నిలిచే అంగన్వాడీ యూనియన్‌ బిల్డింగ్‌ నిధుల సేకరణలో కూడా అదే స్ఫూర్తిని కన బరిచింది. తదుపరి ఆశా యూనియన్‌ అండగా నిలిచింది. మహిళలకు అవకాశాలిస్తూ..ప్రోత్సాహం అందిస్తే పట్టు దలతో ఎంతటి కఠిన ఫలితాలైనా అవలీలగా సాధిóస్తారనడానికి ఈ రెండు రంగాల్లోని మహిళా కామ్రేడ్స్‌ ఉదాహరణగా నిలిచారు. గ్రామపంచాయతీ, రిమ్స్‌ తదితర సంఘాలు అన్ని తమ శక్తికి తగ్గట్టు ఆర్థిక సహకారమందించాయి. కార్మికవర్గాన్ని అక్కున చేర్చుకున్న దాతల సహకారం తోడై భవన నిర్మాణం పూర్తి చేసుకోగలిగాం.
కామ్రేడ్‌ ‘బాశెట్టి’ భవనంగా నామకరణం
చివరి శ్వాసవరకు ఎర్రజెండానే ఆయువుపట్టుగా జీవించి అమరుడైన కామ్రేడ్‌ బాశెట్టి మాధవ రావు పేరు ఈ భవనానికి పెట్టాలని నిర్ణయించాం. ఈ భవనాన్ని పోరాటాలకు నిలయంగానే కాకుండా ఒక విజ్ఞాన కేంద్రంగా నడపాలని సీఐటీయూ భావించింది. బాశెట్టి మాధవరావు 1978లో ఆదిలా బాద్‌లో కార్మిక సంఘాన్ని స్థాపించారు. కట్టెలు మోసేవారి నుండి మొదలుకొని సినిమా కార్మికులు, హమాలీ, రిక్షా తదితర సంఘాల్ని నిర్మించారు. అగ్రకులంలో పుట్టినా అణగారిన ప్రజల హక్కుల కోసం ఉద్యమించారు. నిరాడంబర జీవితానికి మారుపేరుగా నిలిచి మరణించే వరకు సైకిల్‌పైనే తన ప్రయా ణం సాగించారు. వ్యాపార కుటుంబం నుండి వచ్చినా ఆయన అటువైపు వెళ్లకుండా పేదల అభ్యు న్నతి కోసం అహర్నిశలు శ్రమించారు. దోపిడీలేని సమసమాజ స్థాపనే తన లక్ష్యంగా మరణించే వరకు ఎర్ర జెండాను వదల్లేదు. సమాజాన్ని రాజకీయ చైతన్యం చేయాలనే సంకల్పంతో ప్రజాశక్తితో పాటు ఇతర పత్రికలు, మ్యాగ్జిన్‌లను అభ్యుదయ వాదులు, పాఠకులు, ప్రజలకు చేరవేశారు. ఈ వృత్తినే తన ఇంటి పేరుగా మార్చుకొని ‘పేపర్‌ మాధవరావు’గా పేరు గడించారు. అందుకే అయన విజ్ఞాన ప్రధాత కాబట్టే ఈ కార్యాలయానికి కామ్రేడ్‌ బాశెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం అని నామకరణం చేశాం. ఆయన ఆశ యాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ కార్యాలయం పనిచేయనుంది. ఆయన ఉద్యమ సహచరుడు ఏడు పదుల వయసులోనూ నవయువకుడిలా ఉద్యమ రణం సాగిస్తున్న కామ్రేడ్‌ బండి దత్తాత్రి కార్యా లయ నిర్మాణ పనులు దగ్గరుండి పూర్తిచేయించారు. మరో ఉద్యమ సహచరుడు కామ్రేడ్‌ లంక రాఘ వులు తనవంతు సహకారమందించారు. ఈ కార్యాలయం ప్రారంభానికి విచ్చేస్తున్న మాజీ ఎంపీ మిడి యం బాబురావు, సాయిబాబు, మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములు, పాలడుగు భాస్కర్‌, బండారు రవికుమార్‌లకు కామ్రేడ్‌ మాధవరావుతో ప్రత్యక్ష ఉద్యమ అనుబంధం ఉంది. ఉద్యమాలే ఊపిరిగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా జీవిస్తున్న ఇలాంటి నాయకులు కార్యాలయం ప్రారంభోత్స వానికి రావడం జిల్లాలో భవిష్యత్తు ఉద్యమాలకు మరింత ఊతమిస్తుంది.
శ్రామికుల సంకల్పం..
కొండలను సైతం పిండి చేయగల సామర్థ్యం కలిగిన శ్రామికులు తలుచుకుంటే కానిది ఏముం టుంది..? ఖర్చుతో కూడుకున్న పని మనతో సాధ్యం అవుతుందా? అని ఆలోచిస్తున్న సందర్భంలో కార్మికవర్గం తామున్నామంటూ భరోసా కల్పించింది. బిల్డింగ్‌ నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించి నప్పుడు సీఐటీయూ దగ్గర రోజువారి కార్యకలాపాలకు సైతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ, కార్మికుల మీద ఉన్న ప్రగాఢ విశ్వాసమే నాయకత్వాన్ని ముందుకు నడిపించింది. కార్మికులు చేస్తున్న రంగాల్లో నెలల తరబడి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న దుస్థితి. ఇలాంటి సమయంలో కూడా భవన నిర్మాణం తమదిగా భావించి విరివిగా విరాళాలు అందించారు. వారి దగ్గర లేకుంటే ఇతరుల దగ్గర అప్పు తీసుకుని మరీ బిల్డింగ్‌కు తమ వంతు చేయూతనందించారు. అందరి కృషితో ఐక్య పోరాటాలకు కేంద్రబిందువైన సీఐటీయూ కార్యాలయ నిర్మాణం పూర్తయింది. కార్మికుల కల సాకారమైంది. ఇక భవిష్యత్తు ఉద్యమాలకు వేదికగా మారనుంది. భవవ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, విప్లవ జేజేలు.
దర్శనాల మల్లేష్‌
8500700333