– ఆహార అలవాట్లపై దుష్ప్రచారాలు…అశాస్త్రీయ వైఖరులు
– శాపంగా మారిన పెడ ధోరణులు
– అధిక పనిభారంతో కుదేలవుతున్న అంగన్‌వాడీలు
న్యూఢిల్లీ : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని ఎలా నివారించాలన్న విషయంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 11న నూతన ప్రొటోకాల్ విడుదల చేశారు. ఆరోగ్యం, అభివృద్ధి విషయాలలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని అంగీకరిస్తూనే దేశం ఎదుర్కొంటున్న ముఖ్య మైన సవాళ్లలో ఇది కూడా ఒకటని ప్రొటోకాల్ తెలిపింది. పోషకాహార లోపం కారణంగా తలెత్తే స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిణామాలను సరిచేయడం కష్టమేనని కూడా తేల్చింది.
చిన్నారుల్లో పౌష్టికాహార లోపం ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆదాయాలు తక్కువగా ఉండడం, కుటుంబాలు పెద్దవిగా ఉండడం, లింగ వివక్ష, పంట విధా నాలలో మార్పులు, అవగాహనా లోపం, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆహార అసమతుల్యత ఏర్పడుతుంది. పిల్లలకు ఆహార లభ్యత తగ్గిపోతుంది. వారు సంప్రదాయక ఆహార అలవాట్లకు దూరమవుతారు. 0-6 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో చేపట్టిన పోషణ్ అభియాన్ కార్యక్రమం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేరుస్తూ తాజాగా ప్రభుత్వం ప్రొటోకాల్‌ను విడుదల చేసింది.
ప్రొటోకాల్ ఏం చెబుతోంది?
పిల్లలకు అందించే ఆహారంలో విధిగా పాలు, గుడ్లను చేర్చాలని ప్రొటోకాల్ సూచించింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మాత్రమే కాకుండా పిల్లలందరికీ వారంలో అన్ని రోజులూ గుడ్లను ఇవ్వాలి. ఒకవేళ కుల, మత, ఆరోగ్య పరమైన ఆంక్షలు ఉన్నట్లయితే అలాంటి పిల్లలకు అదనంగా మరో గ్లాసు పాలు లేదా ఓ కప్పు పెరుగు ఇవ్వవచ్చు.
తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు అంగన్‌వాడీ కార్యకర్తలు ‘ఆకలి’ పరీక్ష జరపాలని తాజా ప్రొటోకాల్ సూచించింది. ఇందుకోసం బాగా వేడిచేసిన ఆహారాన్ని ఉపయోగిస్తారు. ఈ పరీక్షలో ఫెయిల యిన చిన్నారులను మాత్రమే పోషకాహార పునరావాస కేంద్రాలకు (ఎన్‌ఆర్‌సీలు) పంపుతారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని అనుబంధ పోషకాహార కార్యక్రమంలో నమోదు చేసి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వద్దకు పంపుతారు. అయితే ఈ పరీక్ష అంత విశ్వసనీయమైనది కాదు.
అడ్డంకులు…అవరోధాలు
సంప్రదాయ ఆహారాన్ని తినాలని పెద్దలు తరచూ చెబు తుంటారు. అయితే ఆర్థిక, రాజ కీయ, సామాజిక కారణాల వల్ల చాలా మందికి ఆది సాధ్యపడడం లేదు. కొన్ని కులాలు, జాతుల వారు జంతు వనరుల నుండి లభించే ఆహారాన్ని తీసుకుంటారు. అయితే అదేదో పెద్ద నేరమైనట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో ఈ ధోరణి బాగా కన్పిస్తోంది. ఉదాహరణకు అక్షయ పాత్ర వంటి సంస్థలు అనేక రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన కాంట్రాక్టులు తీసుకుంది. అయితే ఈ సంస్థ అశాస్త్రీయమైన సాత్వికాహార వైఖరిని అవలంబిస్తూ పిల్లలకు మాంసం, గుడ్లు ఇవ్వడం లేదు. దీంతో చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తుతోంది. గోవధ నిషేధం, ముస్లింలను ఆర్థి కంగా బహిష్కరించడం, మాంసం దుకాణాలను నిషేధిం చడం వంటి మతపరమైన చర్యలు, పెడ ధోరణుల కార ణంగా చిన్నారులు పోషకాహా రానికి దూరమవుతున్నారు. ఒకవైపు పిల్లలకు పోషకాహారం అందించాలని చెబుతున్న ప్రభు త్వమే మరోవైపు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోంది.
అంగన్‌వాడీలపై అదనపు భారం
నూతన ప్రొటోకాల్ ప్రకారం పోషకాహార లోపాన్ని అనేక కేటగిరీలు విభజిం చారు. పిల్లలు ఏ కేటగిరీకి చెందుతారో అంగన్‌వాడీలే నిర్ణయించాలి. దీనివల్ల వారిపై మరింత పనిభారం పడుతుంది. అసలు అంగన్‌వాడీ కేంద్రాలలోనే సరైన సౌకర్యాలు లేవు. 21% కేంద్రాలలో మరుగుదొడ్డి లేదు. పిల్లలు ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. కేవలం 87.5% కేంద్రాలకు మాత్రమే తాగునీటి సౌకర్యం ఉంది. మిగిలిన కేంద్రాలలో అపరిశుభ్రమైన నీటితోనే పిల్లలకు వంట చేసి పెడుతున్నారు. మరుగుదొడ్లు, తాగునీరు లేని అంగన్‌వాడీ కేంద్రాలు తల్లులకు, సమాజానికి ఏ విధంగా వాటి ప్రాధాన్యతపై బోధించగలవు? పిల్లలకు చదువు చెప్పడం, వండి వార్చడం వంటి పనులకే అంగన్‌వాడీ కార్యకర్తలు పరిమితం కావడం లేదు. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
చిరుధాన్యాల వినియోగం మంచిదేనా?
అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న చిరుధాన్యాల ఆహారంలో అమినో యాసిడ్లు పూర్తి స్థాయిలో ఉండవు. పైగా ఆ ఆహారంలో ఉండే అధిక పీచు పదార్థం కారణంగా పిల్లలకు ఉదర సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారానికి ఒక రోజు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందించాలని ప్రొటోకాల్ చెబుతోంది. అలవాటు లేని ఆహారాన్ని అందించడం వల్ల పిల్లలకు పోషకాహారం అందే సంగతి ఏమో కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తడం మాత్రం ఖాయం.
పోషకాహారం లోపిస్తే…
పోషకాహారం లోపిస్తే పిల్లల్లో అనేక అనారోగ్య సమస్యలు కన్పిస్తాయి. రక్తహీనత, రేచీకటి, మానసిక వైకల్యం, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, ఉదర సమస్యలు వంటివి చిన్నారుల్ని పట్టి పీడిస్తుంటాయి. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పోషకాహార లోపం కలిగిన చిన్నారులను ఆధార్ ఆధారంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలకు ఈ పథకం అందు బాటులో లేకుండా పోతోంది.