కారెక్కుతున్న కాంగ్రెస్‌ నేతలు

కారెక్కుతున్న కాంగ్రెస్‌ నేతలు– టిక్కెట్‌ దక్కకపోవడంతో ఫిరాయింపులు
– పదవులు, రూ.కోట్లకు అమ్ముడుపోతున్న వైనం!
– ఆపరేషన్‌ చేపట్టిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టిక్కెట్‌ దక్కని కాంగ్రెస్‌ నేతలు ఒక్కొక్కరిగా కారెక్కుతున్నారు. సుదీర్ఘకాలంగా ఒకే పార్టీలో ఉన్న నాయకులు సైతం ఆ పార్టీని వీడుతున్నారు. ఆయా నేతల పార్టీ ఫిరాయింపు బాధ్యతను చేపట్టిన బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆపరేషన్‌ను సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. పదవులు, రూ.కోట్ల ఆఫర్‌ ప్రకటిస్తుండటం, కేటీఆర్‌ నేరుగా వారితో మాట్లాడుతుండటం.. కోరిన కోర్కెలకు సుముఖత వ్యక్తం చేస్తుండటంతో హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి కారు ఎక్కుతున్నారనే చర్చ సాగుతోంది.
ఆపరేషన్‌ సక్సెస్‌..
కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ బాధ్యతలు చూస్తున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇతర సెగ్మెంట్లలోనూ తనదైన రీతిలో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్‌ అసమ్మతి నేతలను కారు ఎక్కించటంలో తనదైన చతురత ప్రదర్శిస్తున్నారు. ఎంపీ వద్దిరాజు ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో సీఎం కేసీఆర్‌ జిల్లా నేతల కృషిని అభినందించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రవిచంద్రకు ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. దానిని ఉపయోగించుకొని మాజీ మంత్రి, టీపీసీసీ ముఖ్య నేత సంభాని చంద్రశేఖర్‌ సహా ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నాయకులను కారెక్కించటంలో వద్దిరాజు నేర్పరితనం ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఎడవల్లి కృష్ణ, కోటూరి మానవతారారు, డాక్టర్‌ రాంచందర్‌ నాయక్‌, మడత వెంకట్‌ గౌడ్‌కు కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి శుక్రవారం తీసుకున్నారు. అంతకుముందు వీరందరినీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. పార్టీలోకి ఆహ్వానిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కారెక్కారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధాన అనుచరురాలు.. ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి, పొంగులేటి ముఖ్య అనుచరుడు కొండూరి సుధాకర్‌ శనివారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

స్వప్రయోజనాలతోనే…!
స్వప్రయోజనాలతోనే నేతలు పార్టీ వీడుతున్నట్టు సోషల్‌ మీడియాలో పోస్టులు వెలుబడుతున్నాయి. రూ. కోట్లు, పదవులు ఆశచూపడంతోనే పార్టీ మారారనే చర్చ సాగుతోంది. కొండూరు సుధాకర్‌ ఉద్యోగ విరమణకు ఏడాది సమయం ఉండగా రిజైన్‌ చేశారు. తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఎక్స్‌టెన్షన్‌ చేస్తామనే హామీ మేరకు పార్టీ వీడినట్టు ప్రచారం సాగుతోంది. దీన్ని ఆయన భార్య కొండూరు రత్నకుమారి ఖండించారు. సత్తుపల్లి నుంచి టికెట్టు పొందిన మట్టా రాగమయి ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు. మిగతా నేతలు కూడా ఇదే పంతంతో ఉన్నారు.
టిక్కెట్లు రాకపోవడంతోనే..!
నియోజకవర్గ సర్వ తోముఖాబి óవృద్ధి కోసమే పార్టీ మారినట్టు చెబుతున్నా వ్యక్తిగత ప్రయో జనాల కోసమే నేతలు ఫిరాయింపులకు పాల్పడుతున్నట్టు చర్చ సాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సున్నం నాగమణికి అశ్వారావుపేట కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని, సత్తుపల్లి అసెంబ్లీ టికెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండూరి సుధాకర్‌ పేరును పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏఐసీసీ పరిశీలన దాకా తీసుకెళ్లారు. కానీ ఈ ఇద్దరు నేతలు తమ అనుచరులకు టిక్కెట్‌ ఇప్పించు కోలేకపోయారు. నేతలు తమను వాడుకుని వదిలేశారని ఆరోపిస్తూ.. ఈ ఇద్దరు బీఆర్‌ఎస్‌లో చేరారు. అధికారంలో ఉన్నా లేకున్నా సుదీర ్ఘకాలంగా కాంగ్రెస్‌ కోసం పాటు పడుతున్న తమను పార్టీ నిర్లక్ష్యం చేయడంపై సంభాని చంద్రశేఖర్‌, ఎడవల్లి కృష్ణ, మానవతారారు నిరాశకు లోనయ్యారు.
పార్టీ అంతర్గత సర్వేలో సంబంధిత నేతలు వెనుక పడినట్టు కాంగ్రెస్‌ నేతలు చెబు తున్నారు. ఈ సర్వేలో వెనుకబడినా తమ వర్గం నాయకులు ఒకరిద్దరికి టిక్కెట్లు ఇప్పించిన భట్టి, పొంగులేటి తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని ఫిరాయింపు నేతలు ఆరోపిస్తున్నారు. తోడళ్లులైన కొత్త గూడెం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వర్లు, ఎడవల్లి కృష్ణ మధ్య సత్సంబంధాలు లేనప్పటికీ వారిద్దర్నీ ఒక తాటి మీదకు తేవడంలో ఎంపీ వద్దిరాజు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. మొదట్లో పొంగులేటి పోటీ చేస్తారని భావించిన కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఎడవల్లి ఆశలు నీరుగారడంతోనే పార్టీ వీడారనే చర్చ సాగుతోంది.