గాడిద, సన్నాసి, దున్నపోతు, దూలం పెరిగినట్టు పెరిగినా దూడకున్న తెలివిలేదు, వెధవ, లిల్లీపుట్ (పత్రికా బాషలో రాయలేని మరెన్నో) ఇవన్ని బూతు పురాణం పోటీలకు పంపిన పదాలు కాదు. ఎవరో సాదాసీదా వ్యక్తులు మాట్లాడిన మాటలు అంత కన్నా కావు. సాక్షాత్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పదేండ్లు మంత్రులుగా అధికారం వెలగబెట్టిన కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధుల నోటి నుంచి జాలువారిన ‘ఆణిముత్యాలు’. కొందరైతే ఓ అడుగు ముందుకేసీ సినీ సెలబ్రెటీలతో అక్రమ సంబంధాలను అంటగట్టే స్ధాయికి దిగజారుతున్నారు. సిద్దాంతాలు, విలువలకు తిలోదకాలిచ్చి, అధికారం, పదవీ, డబ్బే ప్రధానంగా తెలంగాణలో రాజకీయ క్రీడ సాగుతోంది. మనం ఎటువైపు వెళుతున్నామనే ఒకింత భయం కూడా కలుగుతోంది. బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉండే ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు రాజ్యాంగానికి లోబడి మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలి. వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలున్నా అది ప్రజా బాహుళ్యంలోకి వెళ్లే సందర్భంలో చట్టాలను, బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే సమాజం వారిని అనుసరిస్తుంది. వారి అడుగుల్లో అడుగులేస్తుంది. వారు తప్పటడుగేస్తే సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సీఎంతో పాటు మంత్రులు, ప్రతిపక్షాలు సంయమనం పాటించాలి. భావోద్వేగాలకు లోనై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వెంటనే నాలిక్కర్చుకుని సారీ అంటే చెల్లుబాటు కాదు. జనం మనకు ఓట్లేసి గెలిపించింది బూతులు వల్లేవేయడానికి కాదు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడించేందుకు అనే విషయాన్ని గమనించాలి. ఒక్క అధికార పక్షమనే కాదు అన్ని పక్షాలూ పార్లమెంటరీ భాషను వాడటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు దోహద పడాలి.
– ఊరగొండ మల్లేశం