ఎక్కడకి పోతున్నాం!

 Editorial‘గురుఃబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరా!’ అని కదా మన పూర్వీకులు బోధించారు. మరిప్పుడు ఏం జరుగుతోంది! ధర్మాన్ని, భక్తిని, సంప్రదాయాన్ని గౌరవిస్తాము అని చెప్పేవారు వ్యవహరించే తీరుచూస్తే అసహ్యమేయడమే కాదు ఎటుపోతున్నాం మనం? అనే భయం కలుగుతోంది. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను పక్కన పెట్టి, కనీసం పెద్దలనే మర్యాద కూడా లేని ఒక మౌఢ్య సంస్కతిలోకి ఈడ్చుకు పోవటాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇది భారతీయ సంప్రదాయం అని గొప్పలకుపోయే వాగాడంబరపు మూకల మూర్ఖచేష్టల భాగోతం. ఎక్కడా ఇలాంటి వైపరీత్యాలను చూడము. ఒక గురువుతోని శిష్యుని కాళ్లు పట్టించే శిక్షకు ఒడిగడ్టటాన్ని. కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సినంత నేరం ఘోరం ఆ గురువుగారు ఏం చేశాడు! కొట్టాడా, తిట్టాడా, అవమాన పరిచాడా! సాధారణంగా బడిలో ఉపాధ్యాయులు చేసే పనే చేశాడు. ఎందుకు చదవలేదని నిలదీశాడు. నిలుచోబెట్టాడు. అడిగాడు. అంతే! ఇది ఎక్కడైనా జరుగుతుంది. కాకుంటే, ఆ పిల్లవాడు అయ్యప్పమాల వేసుకుని ఉన్నాడు. మాల వేసుకుని తరగతి గదికొచ్చేది చదువుకోసమే కదా! లేదంటే అక్కడ కూడా అయ్యప్పను కొలవడానికా! మాలధారణ చేసినవాడికి చదువు చెప్పడం, చదువు రాకపోతే నిలబెట్టడం నేరమా?
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణితం బోధిస్తూ ఒక విద్యార్థిని నిలబెట్టాడు. దీన్ని సాకుగా తీసుకుని మాలవేసుకున్న విద్యార్థిని నిలబెడతారా అని, ఆ ఉపాధ్యాయుడు దళితు డైనందున అతనిపై భక్తి ముసుగులో దాడిచేసి కక్షపూరితంగా బహిరంగంగా విద్యార్థి కాళ్లు మొక్కించడం, దుర్భాషలాడటం అత్యంత హేయమైన చర్య. ధర్మరక్షకులుగా చెప్పుకుంటూ గూండాయిజానికి పాల్పడడం దుర్మార్గం. ఇది గురు శిష్యం సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే దాడి. అంతేకాదు, దళితవర్గాల ఉన్నతిని, ఆత్మగౌరవాన్ని సహించలేని వారి వికృత చేష్ట. భక్తి ముసుగులో అల్లరిమూకలు దేశవ్యాపితంగానే ప్రజల మధ్య విద్వేషాలను, విభజనలను సృష్టించి, విధ్వంసాలకు పాల్పడుతు న్నారు. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఈ విష సంస్కృతికి బీజాలు వేస్తున్నారు. వీటిని చిన్న చిన్న ఘటనలుగానే చూస్తే, ముందు ముందు ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్ట నట్టే లెక్క. ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసు కుంటే, వీరి కుసంస్కార పరంపర మనకర్థమవుతుంది. అధికారంలో ఉన్నవాళ్లెవరూ ఇలాంటి వాటిని ఖండించక పోవటాన్ని మనం గమనించాలి. క్రమక్రమంగా రాజ్యాంగపు ప్రజాస్వామిక విలువలపై జరుగుతున్న దాడి విస్తరించడం కనపడుతుంది.
గురువులమీదే కాదు, భావ వ్యక్తీకరణలపైనా, పుస్తక రచనలపైనా, పుస్తక విక్రయాలపైనా, రచయితల, కవులపైనా తీవ్రమైన దాడులకు తెగబడుతున్న సంఘటనలు మనఇంటి ముందుకూ వచ్చేశాయి. నాడు పన్సారే, కల్బుర్గీ, గౌరీలంకేశ్‌లను హతమార్చారు. ఇప్పుడు ఏం రాయాలో, ఏం రాయవద్దో నిర్దేశిస్తూ హెచ్చరికలకు దిగుతున్నారు. ఈ మౌఢ్యం, మూర్ఖత్వం చైతన్యయుతమైన తెలంగాణకు పాకిందని ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ మధ్య బుక్‌ఫెయిర్‌లోని ఒక స్టాల్‌లో ‘తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే!’ పుస్తకం, దాన్ని ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మరాఠీ, ఇంగ్లీష్‌ రచయిత కె. జమనాదాస్‌ 1991లో రాశాడు. ఆ పుస్తకం హిందువులకు వ్యతిరేకమయిందని, దీన్ని అమ్మటం నేరమని పెద్ద గలాటా చేసి స్టాల్‌ నిర్వాహకుడు ‘వీక్షణం’ సంపాదకులు వేణుగోపాల్‌పై దాడికి పూనుకోవడం, తర్వాత సామాజిక మాధ్యమంలో బెదిరింపులకు, తిట్లకు ఎగబడటం అత్యంత దారుణమైన విషయం. వైష్ణవాలయాలు శైవాలయాలుగా, శైవాలయాలు వైష్ణవాలయాలుగా, పాలకుల మతాచారాలను బట్టి మారిన చరిత్ర చదువరులకు తెలుసు. ధనాగారాలుగా ఉన్న ఆలయాలను వాటికోసం ధ్వంసం మొనర్చడమూ చరిత్రలో చూస్తాము. భిన్నమైన అభిప్రాయాల మధ్య వాదనలు, చర్చలు చేయడం సంప్రదాయంలో ఉంది. ఎవరివాదం వారికుంటుంది. కానీ నేటి ప్రజాస్వామిక వ్యవస్థలో నాదే చలామణి కావాలని దాడులకు తెగ బడటాన్ని ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించకూడదు. ఇవి మత దురహంకారుల దుశ్చర్యలు. అంతకుముందు వరంగల్‌లో రచయితల చర్చాగోష్టిపైనా దాడిచేసి బెదిరించిన ఘటనా జరిగింది. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవటం ఈ పదేండ్ల నుండి పెరగటమే కాక విస్తరిస్తోంది.
అంతేకాదు, మొన్న స్వయానా మహారాష్ట్ర మంత్రి నితీష్‌రాణే బహిరంగసభలో మాట్లాడుతూ ‘కేరళ రాష్ట్రం మినీ పాకిస్థాన్‌’ అని అభివర్ణించడం పూర్తిగా విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం చేసినవి. లౌకికవాదానికి, మత సామరస్యానికి నెలవుగా ఉన్న కేరళపై ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలు చేయడం ఉన్మాద, విద్వేష శక్తులకు అలవాటైపోయింది. తెలంగాణ నేలపైకీ పాకుతున్న ఈ ఉన్మాదాన్ని చైతన్యయుతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది.