‘క్రీడ అంటే స్నేహం, క్రీడ అంటే ఆరోగ్యం, క్రీడ అంటే విద్య, క్రీడే జీవితం, క్రీడలు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తాయి’ అంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మాజీ అధ్యక్షుడు జువాన్ ఆంటోనియో సమరాంచ్ పైన చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ భువిపై నివసించే మానవులందరికీ ఇవి వర్తిస్తాయి. వ్యక్తుల మధ్య, దేశాల మధ్య స్నేహ సౌబ్రాతృత్వాల వృద్ధి క్రీడలు ద్వారానే సాధ్యం. ఏ దేశంలో అయితే ఆరోగ్యవంతమైన సామర్థ్యం కలిగిన జనాభా ఉంటుందో ఆ దేశం సర్వతోముఖాభివృద్ది చెందుతుంది. అయితే ఈ ఆరోగ్యం క్రీడలు, వ్యాయామం ద్వారానే పరిపూర్ణం అవుతుంది. విద్యలో పరిపక్వత సాధించలంటే మానసిక పరిపక్వత కావాలి. క్రీడలు ద్వారానే అది మెరుగవుతుంది. అందుకే క్రీడే జీవితం అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మన దేశంలో క్రీడల పరిస్థితి గూర్చి వ్యాసం…
పిల్లలు నడక ప్రారంభమైన నాటి నుంచి అందుబాటులో ఉండే వస్తువులతో, తమ వయసు పిల్లలతో ఆటలు ఆడటానికి ఉత్సహంగా ఉంటారు. తమ చుట్టూ పిల్లలు ఉండి, వారితో ఆట పాటల్లో పాల్గొన్న పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. బృందంతో కలసి ఆడుకోవడం, నాయకత్వం వహించడం, గెలుపు కోసం కృషి చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో సహజసిద్ధంగానే పరిణతిని పెంచుతాయి. ఏకాకిగా ఎదిగిన పిల్లల్లో ఈ మానసిక పరిణితి కనిపించదు. జీవితంలో చాలా వాటిని డబ్బుతో కొనగలం కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనలేం. అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ దానిని కాపాడుకోవాలంటే ఆరోగ్యంతో ఆటలాడకుండా పచ్చిక మైదానంలో ఆటలు ఆడవలసిందే. ఆటలు అలవాటుగా మారాల్సిందే. అప్పుడే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే వారు. పిల్లల శారీరక, మానసిక శ్రేయస్సు కోసం క్రీడల్లో పాల్గొనడం చాలా అవసరమని అప్పటి ప్రజలు అర్థం చేసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్, విలువిద్య, కత్తిసాము, బరువులు ఎత్తడం మొదలైనవి చాలా గౌరవించబడ్డాయి. కానీ రాను రాను ఈ క్రీడా సంస్కృతి దేశ వ్యాప్తంగా క్షీణించే దిశగా వెళ్లడం విచారించదగ్గ విషయం. క్రీడలు ఆవిర్భావం వాటి పురోగతి తెలుసుకోవాలంటే క్రీడలకు గల చారిత్రక ఆధారాలను పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
క్రీడల వల్ల లాభాలు
ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు వినోదం అందించడం లోనూ, బుద్ధి వికాసం కలిగించడంలోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడతాయి. బడిలో ఆటల వల్ల పిల్లల్లో క్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందుతాయి.
సానుకూల దృక్పథం: క్రీడలు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది.
మానసిక ఆరోగ్యం: క్రీడలు శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నిపుణులు తేల్చి చెప్పారు. క్రీడల వల్ల ఏకాగ్రత, మానసిక సంయమనం, ప్రతికూల పరిస్థితులను స్థిమితంగా ఎదుర్కోగల శక్తి ఏర్పడతాయని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి.
నాయకత్వ లక్షణాలు వృద్ధి: క్రీడాకారులు ఒక బృందంగా కలసి ఆడటం వలన వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి.
ఊబకాయాన్ని తరిమేయవచ్చు: ఈ రోజు పది మంది పిల్లల్ని పరిశీలిస్తే వారిలో ఒకరో ఇద్దరో ఊబకాయులుగా ఉన్నారు. అయితే తరచూ క్రీడలు ఆడటం వల్ల ఈ స్థూలకాయం రాదు.. ఫలితంగా డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
గుండెకు భరోసా: క్రీడల వల్ల గుండె ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటుంది. గుండె కండరాల దారుఢ్యానికి దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలకు గుండె నుంచి సక్రమంగా రక్త సరఫరా జరుగుతుంది. గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు చాలా అరుదు.
అదుపులో రక్తపోటు: ఆహార నియమాలతో పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మెరుగైన రోగనిరోధక శక్తి: క్రీడలు ఆడేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా రుతువులు మారినప్పుడల్లా వచ్చే జలుబు, దగ్గు, చిన్నా చితకా ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి.
ఒత్తిడిని తరిమేస్తాయి: క్రీడలు ఆడని వారితో క్రీడలు ఆడేవారిని పోల్చి చూస్తే క్రీడలు ఆడే వారే సదా ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం అధికంగా ఉంటుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి.
హార్మోన్ల విడుదలకు సహకరిస్తాయి: మెదడు సహజమైన ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనాలు లేదా హార్మోన్లు క్రీడలు ఆడే వారికి చాలా ఎక్కువగా విడుదల అవుతాయి. ఫలితంగా వారు సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తారు.
మెరుగైన సామాజిక సంబంధాలు: క్రీడల్లో చురుకుగా పాల్గొనే విద్యార్థులు ఇతర విద్యార్థులతో సమాజంలోని విభిన్న వర్గాల వారితో బలమైన బంధాన్ని పెంపొందించుకుంటారు.
సర్దుబాటు తత్వం అలవాటవుతుంది: క్రీడలలో గెలుపోటములు సహజం. ప్రతీ సారి విజయం లభిస్తుందని చెప్పలేం. అయితే ఓటమిని కూడా స్వీకరించే దృక్పధం, సర్దుబాటుతత్వం క్రీడల ద్వారానే లభిస్తుంది.
ఉద్వేగాల అదుపు: క్రీడల్లో పాల్గొనటం వల్ల శరీరంలో కోపతాపాల్లాంటి ఉద్వేగాలు బయటకు వెళ్లిపోతాయి.
క్రీడలు వల్ల ఇన్ని ప్రయోజనాలు కనిపిస్తున్నప్పటికి ఆచరణలో మాత్రం ఇటు ప్రజలు కానీ అటు ప్రభుత్వాలు కానీ వీటి అభివృద్ధికి దృష్టి సారించింది తక్కువే అని చెప్పాలి. కారణమేమంటే సమకాలీన సమాజంలో పనులు, ఆలోచనలు యాంత్రీకరణ రెడీమేడ్ అయిపోయాయి. ఆలోచనాశక్తి, శారీరక శ్రమ కుంటుపడ్డాయి. దాంతో మనిషి భావి జీవితం ప్రమాదంలో పడుతోందని అనేక పరిశోధనలలో వెల్లడైంది. అయినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా తల్లిదండ్రులు శారీరక శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మానేశారు. వారి పిల్లల విద్యా నైపుణ్యం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు. పిల్లలు మార్కులు ప్రాతిపదికన చదువే పరమావధిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలల్లో పచ్చటి మైదానాలు లేకపోయినా పరవాలేదు నిరంతరం అభ్యసనం ఉంటే చాలు అనే నిర్ణయానికి వచ్చేసారు. కేవలం తరగతి గదులు ఉంటే అది పాఠశాల అనిపించుకోదు. తరగతి గదులతో పాటు సువిశాలమైన క్రీడా మైదానం ఉన్నప్పుడే అది పాఠశాల అవుతుంది. ఈ నిబంధన నేటి తరం పాఠశాలలకు వర్తించదు. ఎందుకంటే నేడు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్ధ్థలలో అధిక భాగం బహుళ అంతస్తుల భవనాల్లో, గాలి వెలుతురు లేని ఇరుకు గదుల్లో విద్యనభ్యసించే విద్యార్థులే అధికులు.
పాఠశాల లేదా కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలంటే కచ్చితంగా మైదానం ఉండి తీరాలి. కానీ వాస్తవంలో ఈ నిబంధన కాగితాలకే పరిమితమయ్యింది. క్రీడలను ప్రోత్సహించడమే మా ధ్యేయం అని చెప్పుకొనే ప్రభుత్వాలు క్రీడా సౌకర్యాలు చూపని విద్యా సంస్ధలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. పైగా వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ేయడం ప్రభుత్వ ఖజానాకు భారంా నేటి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడానికి మించిన విషాదం మరొకటి లేదనే చెప్పవచ్చు. దీని కారణంగా బాల్యంలో ఊబకాయంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు మనకు తరచూ కనిపిస్తూ ఉన్నారు. ఆటలు, పాటలు వద్దు మా పిల్లలకు చదువే ముద్దు అంటూ పిల్లల బాల్యాన్ని నిలువునా చిదిమేస్తున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో క్రీడలు ఆడేవారి కన్నా క్రీడలు చూడటానికి ఇష్టపడే వారు ఎక్కువై పోయారు.
ప్రధానంగా నేటి తరం పిల్లలు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపడం వల్ల క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. నిత్యం ఏదో ఒక వాహనంలో బడికి బయలుదేరడం, సాయంకాలం మళ్లీ వాహనంలోనే ఇంటికి రావడం.. వచ్చీరాగానే టీవీ, కంప్యూటర్, ఫోన్ ఆటలతో బిజీ.. ఇదీ నేటి పిల్లల దైనందిన జీవితం. పిల్లల శరీరానికి వ్యాయామం లభించే అవకాశమే లేదు. పిల్లల మానసిక ఎదుగుదలకు, వికాసానికి విద్య ఎంత అవసరమో, వారి శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి ఆటల ద్వారా లభించే వ్యాయామమూ అంతే అవసరం. పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉండాలి. విద్యకు సంబంధించిన పరికరాలతో పాటు, క్రీడల కోసం సామాగ్రిని ఉంచడం అవసరం. విద్యతో పాటు క్రీడలలో కూడా పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. అందుకోసం ప్రతి పాఠశాలలోనూ ఆటస్థలం ఉండాలి. పిల్లలకు శారీరక వ్యాయామం లేకపోతే 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అయిదు వందల మిలియన్ల కొత్త దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే పిల్లలకు శారీరక శ్రమ కలిగేలా ఆడించాలని చెబుతున్నారు నిపుణులు. ఇటీవల కాలంలో భారతదేశంలో 12-15 ఏండ్లు గల పిల్లలకు కూడా డయాబెటీస్ రావడం ఆందోళన కలిగించే అంశం. ఇంతకు ముందు 50-60 ఏండ్ల వారికి గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు 35-40 ఏండ్లకే గుండెపోటు వస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడమే దీనికి కారణం.
విస్తుపోయే నిజాలు
వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది అర్జున అవార్డీల బృందంతో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో భారత క్రీడారంగం వెనుకబాటుకు విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయి. 130 కోట్ల పైబడి ఉన్న భారత జనాభాలో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా తేలింది. అంతకన్నా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉంది. మొత్తం మీద దేశ జనాభాలో 3.27 శాతం మంది మాత్రమే క్రీడల గురించి తెలుసుకోడానికి ఆసక్తిచూపుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది.
డబ్ల్యుహెచ్‌ఓ సూచన
గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా 2030 నాటికి కౌమారదశలో ఉన్నవారిలో శారీరక స్తబ్దతను 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికలో చేర్చబడింది. ఇతర అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు దీనికి సహకరించాలని పిలుపునిచ్చింది. బోట్స్వానా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఈ నాలుగు ఆఫ్రికన్ దేశాలలో జరిపిన ఈ అధ్యయనాల ప్రకారం నిపుణుల సూచనల మేరకు డబ్ల్యుహెచ్‌ఓ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు… పిల్లలు శారీరక శ్రమలో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పి, ప్రోత్సహించాలి. పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు బోధనేతర కార్యక్రమాలు, క్రీడలు తప్పనిసరిగా నిర్వహించాలి. సురక్షితమైన పచ్చని ప్రదేశాలు, ఆట స్థలాలు, క్రీడా సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇప్పటికీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమేనని, ఈ విషయంలో ప్రభుత్వాలు గురుతర బాధ్యత వహించాలి’ అని ప్రకటించింది.
భారత్ కృషి
వ్యాయామ విద్య ప్రాధాన్యతను మన దేశంలో స్వాతంత్య్రం లభించిన తొలినాళ్ళలోనే గుర్తించి దాని ద్వారానే భావితరాన్ని బలోపేతం చేయాలని 1948లో డాక్టర్ తారాచంద్ కమిటీ సూచన చేసింది. ఆ తర్వాత కుంజ్రు, సీడీ దేశముఖ్ సంఘాలూ క్రీడల ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. తాజాగా 2005 జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం, ఆ తరవాతి విద్యాహక్కు చట్టమూ ఆటపాటలతో కూడిన చదువులకే మద్దతు పలికాయి. అయినప్పటికీ ఆ సూచనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే ఈ రోజుకు కూడా దేశవ్యాప్తంగా సుమారు నలభైమూడు శాతం సర్కారీ బడుల్లో ఆటస్థలాలే లేవని పార్లమెంటరీ స్థాయిసంఘం రెండేండ్ల కిందట తేటతెల్లం చేసింది.
ఉమ్మడి జాబితా
క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో ఓ స్పష్టమైన క్రీడావిధానం అంటూ లేకపోడం భారత క్రీడారంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అదీచాలదన్నట్లు ఏడాది నుంచి ఎనిమిదేండ్ల పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విలమవుతున్నాయని మాజీ క్రీడాదిగ్గజాలు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రీడా సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలనే సంకల్పంతో 2012, ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది.
జాతీయ క్రీడా దినోత్సవం
భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే. ధ్యాన్‌చంద్ ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. మధ్యప్రదేశ్‌లోని ధ్యాన్‌చంద్ నగరంలో పెరిగారు. ఆయనకు చిన్నతనం నుంచే హాకీ అంటే చాలా ఇష్టం. హాకీ స్టిక్ అతని చేతిలో మంత్రదండగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్ చాతుర్యం, పాసింగ్‌లో అసాధారణ నైపుణ్యం, ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‌చంద్‌ను హాకీ మాంత్రికుడిగా చేశాయి. ప్రపంచ హాకీలో ‘ది విజార్డ్’, ‘మెజిషియన్’ గా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడు. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ఈయనకే దక్కింది. క్రికెట్‌కు అంతగా వైభవం లేని రోజుల్లో హాకీ ద్వారా ఇండియా పేరుప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటిచెప్పారు. మన దేశంలో హాకీ క్రీడకు ఆద్యుడిగా ధ్యాన్‌చంద్‌ను అభివర్ణిస్తారు. హాకీతో పాటు ఆర్మీ అధికారిగా అతడు దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. అతడి జయంతి రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా 2012లో ప్రకటించింది. అప్పటి నుండి ఆగస్ట్ 29వ తేదీని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకోవడం మొదలైంది. వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతోనే స్పోర్ట్స్ డే రోజున ప్రభుత్వాలు క్రీడలకు సంబంధించిన పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. అయితే హాకీ క్రీడకు వన్నెతెచ్చిన ధ్యాన్‌చంద్‌కు ఇప్పటివరకు భారత రత్న అవార్డు మాత్రం దక్కక పోవడం శోచనీయం. జాతీయ క్రీడా దినోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా జరుపుతూ ఉన్నప్పటికీ ఆచరణలో ఆశించిన మార్పు కనిపించక పోవడం చేత క్రీడా పరిశోధకురాలు కనిష్క పాండే భారతదేశంలో క్రీడలను ప్రాథమిక హక్కుగా మార్చేందుకు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేశారు.
క్రీడలు ప్రాథమిక హక్కు
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై 2018 ఆగస్టులో సుప్రీంకోర్టు కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది. కోర్టు 2019 ఏప్రిల్‌లో శంకర్‌నారాయణన్‌ను అమికస్‌గా నియమించింది. క్రీడలకు బదులుగా ‘భౌతిక అక్షరాస్యత’ అనే విస్తృత పదాన్ని స్వీకరించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా రక్షించబడిన ప్రాథమిక హక్కుగా గుర్తించాలని ఆయన సూచించారు. ప్రతి పాఠశాల తప్పని సరిగా రోజులో కనీసం 90 నిమిషాలు ‘ఉచిత ఆటలకు’ అంకితమివ్వాలని కోరారు. అలాగే ఢిల్లీ డైలాగ్ కమీషన్ (ణణజ) ‘ఆడే హక్కు’ పిల్లల హక్కుగా పరిగణించాలని ‘క్రీడలకు మార్కులు’ వంటి పథకాలను తేవాలని, రాష్ట్ర క్రీడల బిల్లును రూపొందించాలని కూడా సూచనలు చేసింది. అయితే ఈ సూచనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ పరిస్ధితులలో క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాలనే దృఢ సంకల్పంతో కేంద్రం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రూపొందించింది.
ఖేలో ఇండియా
క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో పదేండ్ల నుంచి 18 ఏండ్ల వయసున్న ప్రతిభావంతులైన బాలలు, యువతీయువకులను గుర్తించి, ఎంపిక చేసిన క్రీడలతో పాటు చదువులోనూ రాటుదేలేలా చేయటమే ప్రధానలక్ష్యంగా 2017-18లో ఖేలో ఇండియా అనే వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గతంలో ఉన్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, పట్టణ ప్రాంతాలలో మౌలిక క్రీడాసదుపాయల కల్పన పథకం, క్రీడారంగంలో జాతీయ ప్రతిభాన్వేషణ పథకాలను మిళితం చేయడం ద్వారా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పథకం అమలు కోసం 1756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. క్రీడారంగంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి చదువుకు ఆటంకం కలగని విధంగా క్రీడల్లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి, దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారు. అధునాతన శిక్షణ సదుపాయాలతో పాటు అత్యాధునిక రీతిలో తీర్చి దిద్దే శిక్షకులు సైతం ఈ కేంద్రాలలో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఆటలకు అరకొర నిధులే..
భారతదేశంలో క్రీడాభివృద్ధి సాధనలో వెనుకబడి ఉండటానికి గల కారణాలలో ప్రభుత్వాలు క్రీడా రంగానికి కేటాయించే కేటాయింపులు అరకొరగా ఉండటమే. గతేడాది క్రీడా రంగానికి బడ్జెట్‌లో 3,396.80 కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్‌లో 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. అంటే తాజా బడ్జెట్లో పెరిగింది కేవలం రూ.45.36 కోట్లు మాత్రమే. అలాగే కేంద్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి రూ.900 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే అదనంగా ఇచ్చింది రూ.20 కోట్లే. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)కు రూ.340 కోట్లు, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ‘టాప్స్’కు రూ. 822.60 కోట్లు, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి రూ. 22.30 కోట్లు, నేషనల్ డోప్ టెస్టింగ్ లేబోరేటరీ (ఎన్‌డీటీఎల్)కు రూ. 22 కోట్లు కేటాయింపులు చేశారు. ఇలా ఎటూ చాలని ఈ నిధులతో క్రీడలలో అద్భుత లక్ష్యాలు సాధించడం అనేది సాధ్యపడే విషయం కాదు. కంటితుడుపు కేటాయింపులతో క్రీడారంగంలో అత్యుత్తమ ఫలితాలతో పాటు, పతకాలపంట పండించడం అసాధ్యమని ప్రభుత్వాలు, అధినేతలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ వెనుకంజ
77 ఏండ్ల స్వతంత్ర భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించింది. అంతేకాదు అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని విఖ్యాత బహుళజాతి కంపెనీల చూపంతా ఇప్పుడు భారత్ మార్కెట్ వైపే. అయితే.. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. క్రీడాపరంగా భారత్ ప్రగతి చూస్తే ఎక్కడవేసిన గొంగళి అక్కడే అని చెప్పక తప్పదు. తాజాగా పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం ముగిసింది. ఒక రజతం, అయిదు కాంస్య పతకాలతో విశ్వక్రీడల్లో భారత బృందం తమ పోరాటాన్ని ముగించింది. ఈసారి స్వర్ణ కాంతులు లేకుండానే అథ్లెట్లు వెనుదిరిగారు. కనీసం రెండంకెల పతకాలైన సాధిస్తుందన్న అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన టీమిండియా అర డజన్ పతకాలకే పరిమితమైపోయారు. టోక్యో వేదికగా జరిగిన గత ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం ఏడు పతకాలు వచ్చాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే టీమిండియా చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈసారి కూడా ఆ రికార్డు బద్దలు కాలేదు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో ఒక పతకం తక్కువగానే భారత పతక ప్రయాణం ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆటల్లో అసలు భారత్‌కు పతకమే దక్కలేదు. బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లలో క్రీడాభిమానుల అంచనాలు నెరవేరలేదు. దీంతో భారత్ కాస్త నిరాశగానే పారిస్ నుంచి వెనుదిరిగింది. కాకపోతే నీరజ్ సంచలనం, హాకీలో భారత జట్టు 52 ఏండ్ల రికార్డు బద్దలు కొడుతూ కాంస్యం దక్కించుకోవడం, మనూ భాకర్ రెండు పతకాలు గెలవడం వంటి మధుర స్మృతులు భారత్ తమ వెంట తీసుకు వచ్చింది.
భారత్ కంటే అతి తక్కువ జనాభా కలిగిన దేశాలు కూడా బంగారు పతకాలు సాధించాయి. పతకాల ఖాతా తెరిచిన 84 దేశాల్లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో భారత్ వైఫల్యానికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెట్ గురించి తప్ప, ఒలింపిక్స్‌లో ఉన్న క్రీడల గురించి పెద్దగా తెలియకపోవడం కూడా భారత వైఫల్యానికి ప్రధాన కారణమనే అభిప్రాయముంది. ఒలింపిక్స్‌లో ఎక్కువ మెడల్స్ అందించే అథ్లెటిక్స్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం, క్రికెటర్లకు ఉన్న క్రేజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అథ్లెట్లకు లేకపోవడం భారత్ వైఫల్యానికి దారితీస్తోంది. అమెరికా, జపాన్ దేశాలు భారత్ కంటే చిన్నవి. కానీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో మాత్రం దూసుకెళుతున్నాయి. చదువు – సంస్కారం వలె చదువు – క్రీడలను కూడా భావించాలి. మైదానం మొఖం చూపించకుండా ఇరుకు గదుల్లో కుక్కేసి బాల్యాన్ని చిదిమెసే అధికారం ఎవ్వరికీ లేదు. విద్యా సంస్ధలు క్రీడల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయగలిగితే చిన్నారుల విలువైన బాల్యాన్ని కాపాడినవాళ్ల మవుతాం. అలా కాకుండా ఆగస్టు 15, జనవరి 26, క్రీడా దినోత్సవం నాడు ఎదో మమ అని నాలుగు ఆటలు ఆడించి తిరిగి తరగతి గదుల్లో ఇరికించే పరిస్ధితులు ఉన్నంత కాలం మేలిమి క్రీడా సంస్కృతిని ఆశించలేం.
– రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578