ఆయన కారెక్కుతారా?

పొత్తు పొడిచినట్టే. ఇగ చూసుకో..ఆ రెండు పార్టీల కలయికతో రాష్ట్ర రాజకీయాలే మారిపోతాయి అన్నంత లెవల్‌లో బీఆర్‌ఎస్‌, బీఎస్‌పీ పొత్తు గురించి కేసీఆర్‌, ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. అంతలోనే ఏమైందో ఏమోగానీ బీఎస్‌పీ అధినేత్రి మాయవతి తుస్సుమనించారు. ‘దేశంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తాం…ఏ కూటమికి దగ్గరగా ఉండబోం’ అని సెలవిచ్చారు. ఆమె ఆదేశంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌పై పిడుగుపడినట్టైంది. బీఆర్‌ఎస్‌, బీఎస్‌పీ పార్టీల మధ్య పొత్తు కుదిరితే, పొత్తులో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అంతా బాగానే ఉంది కానీ అధ్యక్షురాలి నిర్ణయంతో అయ్యో ఆర్‌ఎస్‌పీ అని అంటున్నారు. చట్టసభల్లో అడుగు పెట్టాలనే ఆయన కల కలగానే మిగిలిపోయిందంటూ నెటిజన్లు సెటైర్‌ వేస్తున్నారు. మాయవతి అనుమతి తీసుకుని ఆయన కేసీఆర్‌తో చర్చలు జరిపారా? లేదా? అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమతి తీసుకుంటే ఆమె వెంటనే ఎందుకు రివర్స్‌ అయ్యారు. దాని వెనుక ఏ పార్టీ ఉంది? దీని వల్ల వారికొచ్చే ప్రయోజనాలేంటి అన్న చర్చలు జరుగు తున్నాయి. ఎందుకంటే పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై అనేక విమర్శలు చేసిన ఆయన…అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం పట్ల బహుజన అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు బహుజన మేధావులు, కార్యకర్తల విమర్శలు.. మరోవైపు బీఆర్‌ఎస్‌ వ్యతిరేకులు కూడా బీఎస్‌పీని ఓ ఆట ఆడుకున్నారు. ఆయన బీఎస్‌పీలో ఉంటారా? లేక కారెక్కుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బలి పశువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– గుడిగ రఘు