ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంతో సాహసోపేతంగా తీసుకున్న ‘హైడ్రా’ ఏర్పాటు నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. హైడ్రా ఏజెన్సీ ఏర్పాటు ద్వారా ఆయన తన స్థాయికి మించిన నిర్ణయంతో పులి మీద స్వారీ చేస్తున్నరన్నది మాత్రం వాస్తవం. ఇప్పటివరకు ఎలాంటి తడబాటు లేకుండా సాగిపోతున్న తొమ్మిది నెలల పాలనలో ‘హైడ్రా’ అనేది మున్ముందు రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుందా? లేక సాఫీగా సాగిపోతుందా? అన్నది తేలాల్సివుంది. ఎందుకంటే కూల్చివేతల పర్వం సంపన్నుల నుండి సామాన్యుల వరకు రాగలిగితే రేవంత్ ప్రభుత్వంపై ఒక్కసారిగా రాజకీయ ఎదురుదాడి ప్రారంభం కావచ్చు! విపక్షాల నుండే కాక స్వపక్షం నుండి కూడా అది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం వున్నది. ప్రస్తుతానికి హైడ్రా చేపట్టిన కూల్చివేతలైతే రేవంత్ సర్కార్ను మరోమెట్టు ఎక్కించిందనే చెప్పాలి. అయితే అది ఎక్కువ కాలం ఇలాగే ఉంటుందా? అనే అనుమానం కూడా వస్తోంది. ఎందుకంటే హైడ్రా అడుగులు వెనక్కి పడొద్దనేది ప్రజల అభిప్రాయం. ఇది సుదీర్ఘకాలం ఇలాగే కొనసాగాల్సిన అవసరమైతే కనిపిస్తున్నది.
అడిగేవారు లేకపోవడం, అధికారపక్ష నేతలు అండదండలతో కబ్జాలకు గురైన చెరువులు, ఖాళీ స్థలాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. హైడ్రా చర్యలు చేపడితే హైదరాబాదులో ఇరవై శాతం భవనాలు, మామూలు గృహ నిర్మాణాలు కుప్పలు కుప్పలుగా నేలమట్టం కావాల్సిందే. ఎందుకంటే జంట నగరాల పరిధిలో సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి చెరువులను, కుంటలను ఆరు దశాబ్దాలుగా అదేపనిగా కబ్జా చేసిన సంపన్నులు, రియల్టర్లు ఎవరికి తగ్గ స్థాయిలో ఇష్టారీతినా నిర్మాణాలు చేసుకున్నారు. పేదలకు నిలువ నీడ లేని కారణంగా, ప్రభుత్వ స్థలాలున్నా వారికి ఇవ్వపోవడంతో వారి స్తోమతను బట్టి ఇండ్లను నిర్మించుకున్నారు. ప్రస్తుతానికి బడా బాబుల నిర్మాణాలను కూల్చి వేస్తుంటే శభాష్ అంటున్న పలువురు, రేపు సామాన్యుల నిర్మాణాలను సైతం హైడ్రా నిబంధనల మేరకు కూల్చివేతలు చేపట్టాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అందుకే దీనిపై రేవంత్ సర్కార్ ఒక స్పష్టతతో ముందుకు సాగాలి. పేదలకు పునరావాసం కల్పించాలి. అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించాలి. నిబంధనలు సవరించి పేదల ఇండ్లను మినహాయించాలి. చిన్నా,పెద్దా అందరూ సమానమేనని, ముందుకుసాగితే, కూల్చివేతలు సామాన్యుల వద్దకు వస్తే విపక్షాలతో పాటు అధికార పక్షం నుండి కూడా ముఖ్యమంత్రి తీవ్ర ఎదురుదాడిని ఎదుర్కోక తప్పదు. ఒకవేళ ఒత్తిళ్ల కు తలొగ్గి హైడ్రాను అప్పటికప్పుడు పక్కన పెడితే సంపన్నులను బ్లాక్ మెయిల్ చేసేందుకు రేవంత్ సర్కారు పనిచేసి పక్కకు జరిగిందన్న అపవాదు వస్తుంది. అలా కాకుండా, ముఖ్యమంత్రి ఏర్పరచు కున్న లక్ష్యం వైపు ముందుకు సాగితే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యే అవకాశాలూ లేకపోలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి ఒకరిద్దరు ఫిర్యాదు చేస్తే, ఇది క్రమంగా పెరిగితే సీఎం వెనక్కి తగ్గుతారా? లేదంటే ముందుకే సాగుతారా అనే అనుమానం కూడా ప్రజల్లో ఉన్నది.
ఇదిలా ఉంటే మొదట్లో హైడ్రా ఏర్పాటుతో హర్షం వ్యక్తం చేసిన అనేకుల్లో ప్రస్తుతం ఎన్నో అనుమానాలు,సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమ వుతున్నాయి స్థానిక సంస్థలు అనుమతులిస్తేనే నిర్మాణాలు జరిగాయని, ఎలాంటి చట్టబద్ధతలేని హైడ్రా ఏజెన్సీ అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చేస్తే, అవి స్థానిక సంస్థల అధికారాలకు భంగం వాటిల్టినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైడ్రా పుట్టు పూర్వోత్తరాల గురించి పలు ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ రంగాలో పనిచేయడం, కొంత హైదరాబాద్లోని చెరువులు కుంటల ధ్వంసం, అక్రమ నిర్మాణాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఉంది. అదే ఆయన అదే ఆయుధంగా మలుచుకుని హైడ్రా ఏర్పాటుకు శ్రీకారం చుట్టారనేది పలువురి అభిప్రాయం. ఇది ప్రజల జీవన శైలిని మారుస్తుందా? ఆక్రమ ణలు దీంతో ఆగుతాయా? ఆలోచించాల్సిన అంశమే. హైదరాబాద్లో హైడ్రా సక్సెస్ అయితే జిల్లాల్లో కూడా అమలుచేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పాలనలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ, అందరిని కలుపుకుని సూచనలు, సలహాలు స్వీకరిస్తూ హైడ్రాను ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి మార్క్ పాలనవుతుంది. అప్పుడే భవిష్యత్తులో పర్యావరణానికి, ప్రకృతికి పెద్దపీట వేసిన సీఎంగా రేవంత్ చరిత్ర సృష్టిస్తారు! లేదంటే సంపన్నుల ఒత్తిళ్లకు తలొగ్గి హైడ్రాను ఆపితే గనుక అభాసుపాలుకాక తప్పదు! ఏం జరగనుందో మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
– సట్ల మురళీకృష్ణ, 9441174565