ఎటు తిరిగేనో?

Where do you turn?– కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 171/9
– జడేజా, అశ్విన్‌, సుందర్‌ మాయ
– శుభ్‌మన్‌ గిల్‌, పంత్‌ అర్థ సెంచరీలు
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 263/10
భారత్‌, న్యూజిలాండ్‌ మూడో టెస్టు రెండో రోజు
అటు, ఇటు.. ఎటు? ముంబయి వాంఖడె టెస్టు ఏ వైపు టర్న్‌ తీసుకుంటుందనే ఉత్కంఠ ఎక్కువైంది. తొలి రోజు నుంచే స్పిన్‌ మాయ మొదలు కావటంతో నేడు తుది ఫలితం ఖాయంగా తేలనుంది. జడేజా, అశ్విన్‌, సుందర్‌ త్రయం మాయజాలంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగుల వద్ద నిలిచింది. ప్రస్తుతం కివీస్‌ 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ పిచ్‌పై 150 పరుగుల లక్ష్యం సైతం కష్టసాధ్యమే.. దీంతో ఛేదనలో టీమ్‌ ఇండియా బ్యాటర్ల ప్రదర్శనపై ఫోకస్‌ నెలకొంది. గిల్‌ (90), పంత్‌ (60) అర్థ సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ విలువైన ఆధిక్యం దక్కించుకుంది.
నవతెలంగాణ-ముంబయి
వాంఖడె టెస్టు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. స్పిన్‌ మాయజాలంతో మూడో రోజే టెస్టు మ్యాచ్‌లో ఫలితం తేలనుంది. శుభ్‌మన్‌ గిల్‌ (90, 146 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), రిషబ్‌ పంత్‌ (60, 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. 28 పరుగుల విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది. వాషింగ్టన్‌ సుందర్‌ (38 నాటౌట్‌, 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (30) రాణించారు. స్పిన్‌ త్రయం రవీంద్ర జడేజా (4/52), అశ్విన్‌ (3/63), సుందర్‌ (1/30) మెరవటంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 171/9తో పోరాడుతోంది. విల్‌ యంగ్‌ (51, 100 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (26), డెవాన్‌ కాన్వే (22), డార్లీ మిచెల్‌ (21) రాణించారు. న్యూజిలాండ్‌ ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి వికెట్‌ను మరో పది పరుగులు జోడించినా.. నాల్గో ఇన్నింగ్స్‌లో భారత్‌ లక్ష్యఛేదన కష్టసాధ్యమే కానుంది.
గిల్‌, పంత్‌ అర్థ సెంచరీలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. స్పిన్‌ను అనుకూలించిన పిచ్‌పై సోధి, ఫిలిప్స్‌, అజాజ్‌ పటేల్‌ మాయ చేసినా మనోళ్లు విలువైన ఆధిక్యం దక్కించుకున్నారు. 28 పరుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్‌పై పైచేయి సాధించారు. యువ బ్యాటర్లు ఇద్దరూ అర్థ సెంచరీలు సాధించటంతో ఇది సాధ్యపడింది. శుభ్‌మన్‌ గిల్‌ (90), రిషబ్‌ పంత్‌ (60) కివీస్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. గిల్‌ 66 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించగా.. పంత్‌ తనదైన శైలిలో ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 36 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు వేగంగా 96 పరుగులు జోడించింది. లోయర్‌ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా (14), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0), అశ్విన్‌ (6) మళ్లీ నిరాశపరిచారు. వాషింగ్టన్‌ సుందర్‌ (38) నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో వీర విహారం చేశాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో పైచేయి సాధించింది. కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ (5/103) ఐదు వికెట్ల ప్రదర్శనతో మాయ చేశాడు. హెన్రీ, ఫిలిప్స్‌, సోధి తలా ఓ వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి, ఆకాశ్‌ దీప్‌ రనౌట్‌గా నిష్క్రమించారు.
జడేజా, అశ్విన్‌ మాయజాలం
భారత స్పిన్‌ త్రయం మాయ చేసింది. 43.3 ఓవర్లలోనే న్యూజిలాండ్‌ 9 వికెట్లను కుప్పకూల్చింది. విల్‌ యంగ్‌ (51, 100 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో చెలరేగాడు. కానీ ఇతర బ్యాటర్లు ఎవరూ భారత స్పిన్నర్లను ఎదుర్కొలేకపోయారు. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (22), డార్లీ మిచెల్‌ (21), గ్లెన్‌ ఫిలిప్స్‌ (26) విలువైన పరుగులు జోడించారు. కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ (1), రచిన్‌ రవీంద్ర (4), టామ్‌ బ్లండెల్‌ (4), ఇశ్‌ సోధి (8) తేలిపోయారు. టీ విరామ సమయానికి 26/1తో నిలిచిన న్యూజిలాండ్‌.. చివరి సెషన్లో ఏకంగా 8 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో న్యూజిలాండ్‌ వేగంగా పరుగులు పిండుకుంది. 3.93 రన్‌రేట్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. రవీంద్ర జడేజా (4/52), అశ్విన్‌ (3/63), సుందర్‌ (1/30) మాయ చేసినా.. ఎక్స్‌ట్రాల రూపంలో భారత్‌ 17 పరుగులు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 171/9తో ఆడుతుంది. అజాజ్‌ పటేల్‌ (7 నాటౌట్‌) అజేయంగా క్రీజులో ఉండగా.. విలియం ఓరౌర్క్‌ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌ లోటు అనంతరం న్యూజిలాండ్‌ 143 పరుగుల ముందంజలో నిలిచింది.

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌, భారత్‌-ఏ మధ్య జరగాల్సిన మూడో రోజుల వార్మప్‌ మ్యాచ్‌ రద్దు చేసినట్టు తెలుస్తోంది. భారత్‌, ఆసీస్‌ పెర్త్‌లో తొలి టెస్టులో తలపడనుండగా.. పెర్త్‌ వేదికగా మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌కు బీసీసీఐ షెడ్యూల్‌ విడుదల చేసింది. వార్మప్‌ మ్యాచ్‌ స్థానంలో మూడు రోజుల పాటు పిచ్‌పై సాధన చేసేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపినట్టు సమాచారం.

స్కోరు వివరాలు :
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 235/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) అజాజ్‌ 30, రోహిత్‌ (సి) లేథమ్‌ (బి) హెన్రీ 18, గిల్‌ (సి) మిచెల్‌ (బి) అజాజ్‌ 90, సిరాజ్‌ (ఎల్బీ) అజాజ్‌ 0, కోహ్లి (రనౌట్‌) 4, పంత్‌ (ఎల్బీ) సోధి 60, జడేజా (సి) మిచెల్‌ (బి) ఫిలిప్స్‌ 14, సర్ఫరాజ్‌ (సి) బ్లండెల్‌ (బి) అజాజ్‌ 0, వాషింగ్టన్‌ నాటౌట్‌ 38, అశ్విన్‌ (సి) మిచెల్‌ (బి) అజాజ్‌ 6, ఆకాశ్‌ దీప్‌ (రనౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం : (59.4 ఓవర్లలో ఆలౌట్‌) 263.
వికెట్ల పతనం: 1-25, 2-78, 3-78, 4-84, 5-180, 6-203, 7-204, 8-227, 9-247, 10-263.
బౌలింగ్‌: మాట్‌ హెన్రీ 8-1-26-1, ఓరౌర్క్‌ 2-1-5-0, అజాజ్‌ 21.4-3-103-5, ఫిలిప్స్‌ 20-0-84-1, రచిన్‌ 1-0-8-0, సోధి 7-0-36-1.
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లేథమ్‌ (బి) ఆకాశ్‌ 1, కాన్వే (సి) గిల్‌ (బి) సుందర్‌ 22, యంగ్‌ (సి,బి) అశ్విన్‌ 51, రచిన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 4, డార్లీ మిచెల్‌ (సి) అశ్విన్‌ (బి) జడేజా 21, బ్లండెల్‌ (బి) జడేజా 4, ఫిలిప్స్‌ (బి) అశ్విన్‌ 26, సోధి (సి) కోహ్లి (బి) జడేజా 8, హెన్రీ (బి) జడేజా 10, అజాజ్‌ నాటౌట్‌ 7, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (43.3 ఓవర్లలో 9 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1-2, 2-39, 3-44, 4-94, 5-100, 6-131, 7-148, 8-150, 9-171.
బౌలింగ్‌: ఆకాశ్‌ 5-0-10-1, సుందర్‌ 10-0-30-1, అశ్విన్‌ 16-0-63-3, జడేజా 12.3-2-52-4.