హామీలు నెరవేర్చని కిషన్‌ రెడ్డి ఎక్కడ..?

హామీలు నెరవేర్చని కిషన్‌ రెడ్డి ఎక్కడ..?– అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ పనులు ఎందుకు పూర్తి కాలేదు..?
– ఒకరు దేవుళ్ల పేరు చెబుతారు..ఇంకొకరు పార్టీలు మారుతారు : బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌
నవతెలంగాణ-ఓయూ
ఐదేండ్లలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎంపీ కిషన్‌ రెడ్డి చేసిందేమిటని బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌ ప్రశ్నించారు. హామీలు నెరవేర్చని కిషన్‌ రెడ్డి ఎక్కడ..? అని నిలదీశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌ డివిజన్‌లోని రాఘవ గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌ మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని, పట్టుబట్టి, కష్టపడి ఎంపీ ఎన్నికల్లో గెలుపును సాధించాలని అన్నారు. ప్రతి కార్యకర్తకూ తాను అండగా ఉంటానన్నారు. ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే వారిలో ఒకరు నిత్యం పార్టీలు మారతారు.. ఇంకొకరు దేవుళ్ల పేరు చెబుతారన్నారు.. కానీ ప్రజలకు వారేం చేశారో చెప్పట్లేదన్నారు. ఐదేండ్లలో కేంద్రం నుంచి రూ.25 కోట్లు రావాల్సి ఉండగా.. వాటిని కిషన్‌రెడ్డి ఖర్చు పెట్టకపోవడంతో వృథా అయ్యాయని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి అడ్డగుట్ట ఎమ్మార్వో కార్యాలయంలో రేకుల షెడ్డు మాత్రం ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. అదే తాను తన సొంత నిధులతో 200 బోర్లు వేయించానని తెలిపారు. దానం నాగేందర్‌ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్‌ అవుతారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు ఓయూ విద్యార్థి నాయకుడు ఎల్చల మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో విద్యార్థులకు అండగా ఉండి, పోలీసుల దెబ్బలు తమపై పడకుండా ఆపిన నాయకుడు పద్మారావు గౌడ్‌కు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్ళు ఢిల్లీ గుప్పిట్లో ఉంటారని, అదే పద్మారావు గౌడ్‌ అయితే తెలంగాణ గళం, బలం పార్లమెంట్‌లో వినిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, లక్ష్మి ప్రసన్న, బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మేడే రాజీవ్‌సాగర్‌, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రామేశ్వర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.