న్యాయమా ఎక్కడున్నావు?
కోట్లాది కోట్ల నోట్లలలోనా?
పదవుల పలుకుబడిలోనా?
అధికారుల అడ్డాలోనా?
నిజాయితీకి ఉరివేయడంలోనా?
అల్పులను అణిచివేయటంలోనా ?
ధర్మ శాసనం గర్భగుడికే పరిమితమైయిందా?
సమాధి నుండే సమస్యలకు
పరిష్కారం చెబుతుందా?
కళ్ళతో పాటు చెవులను కప్పేసుకుందా
అబద్దాలను అందంగా చెక్కే
సాక్షాలనే నమ్ముతుందా ?
ఆధారాలన్నీ ఉన్న
అన్యాయం ముందు నెగ్గలేకపోయిందా ?
సంతలో అమ్ముడు సర్కయిందా?
కౌరవసభలో ద్రౌపదిలా అబాసపాలయ్యిందా ?
రాజ్యాంగంలో రహస్యంగా మిగిలిపోయిందా?
ఈ పద్మవ్యూహాని ఛేదించేందుకు
ఎందరు అభిమన్యులు బలి కావాలి?
న్యాయానికి అన్యాయానికి
జరుగుతున్న కురుక్షేత్రంలో
ఎందరు పాండవులు బలిదానం కావాలి?
న్యాయం బ్రతికి ఉంది అనే భ్రమలో
న్యాయదేవత గెలిపిస్తుందన్న ఆశతో
న్యాయని ఆశ్రయిస్తున్న అభాగ్యులు!
అన్యాయానికి ఉన్న శక్తి సామర్థ్యాలు
అవినీతిలో ఆజ్యం పోసుకొని
పురివిప్పి వికటహసం చేస్తున్నాయని
కొన్ని కబంధహస్తాలలో
ఊపిరాడక సమాధి కాపడ్డాయని
తెలిసేసరికి జీవితం ముగిసిపోతుంది!
-జ్యోతి మువ్వల
9008083344