దాన ధర్మాలకు ధనం ఎక్కడిది?

Where is the money for charity?పరిశ్రమలకు ‘ఎక్కువ డబ్బు’ ఎలా వస్తుందో తెలుసుకోవడం, ప్రపంచంలో ప్రారంభమైంది. మార్క్సు రచనల వల్ల, కొత్త సత్య సిద్ధాంతం పుట్టుకొచ్చింది.
టాటాలకు వున్నది ఒక్క పరిశ్రమే కాదు సుమా! అనేక డజన్ల పరిశ్రమలలో ఒకటి స్టీల్‌ ఫ్యాక్టరీ. దానికి కిందటి యాడాది 2 లక్షల 30 వేల కోట్లు ‘నికర లాభం’ వచ్చిందని ఒక వార్త! ‘నికర’ అంటే, అన్ని ఖర్చులూ పోగా, మిగిలినది అని. ‘ఖర్చులు’ అంటే, ఏవేవో చూశాం కదా? (1) కొత్త సరుకు కోసం కావలిసిన సాధనాల్ని కొన్న ఖర్చు. (2) కొత్త సరుకు కోసం కొత్త శ్రమలు చేయవలిసిన శ్రామికులకు ఇచ్చే జీతాల ఖర్చు.
‘కొత్త సరుకు’ కోసం వచ్చివున్న ‘సాధనాల్ని’ వుపయోగిస్తూ, కొత్త సరుకుని తయారు చేసే శ్రామికులు శ్రమలు చేస్తే, కొత్త సరుకు తయారవు తుంది.
ఇక అప్పుడు దాన్ని అమ్మాలి! దానికి ‘అమ్మే ధర’ని నిర్ణయించాలి! పరిశ్రమదారుడిదే ఆ హక్కు. జరిగిన 2 ఖర్చులతోనే కొత్త సరుకు ధరని నిర్ణయమైతే, హక్కు సంగతి సమస్య కాదు.
అమ్మేధరని నిర్ణయించడానికి సాధనాల ఖర్చు యధాతధంగానే చేరుతుంది. ఇది అత్యవసరం! ఈ ఖర్చు సవ్యంగా వెనక్కి వస్తేనే, కొత్త సరుకుకి అమ్మకం జరిగాక పునరుత్పత్తి జరగడానికి అభ్యంతరం వుండదు. సాధనాల ఖర్చు లెక్క తప్పదు.
రెండో ఖర్చు కూడా సరుకుని అమ్మే ధరలోకి చేరాలి!
2 ఖర్చులూ కలిసి ‘పెట్టుబడి’ అవుతాయి! పారిశ్రామికవేత్త పెట్టే పెట్టుబడి ఇదే!
అయితే, ‘జీతాల్ని’ కలపడంలో, సరుకు తయారీ పనిలో, ఏ పనిలోనూ వేలు పెట్టని పరిశ్రమదారుడి జీతాన్నీ కలుపుతారు మరి! ఒక పరిశ్రమదారుడైన రతన్‌ టాటాకి-అంటే, కొత్త సరుకు కోసం అవసరమైన ఏ పనీ చెయ్యని పరిశ్రమదారుడైన వ్యక్తికి – యాడాదికి జీతం, ‘3వందల కోట్లు’ అని పత్రికల వార్త! 12 నెలలకి 300 కోట్ల జీతం! ఈ జీతం ఎందుకూ? పరిశ్రమ యజమాని కదా, అందుకూ! (‘గీక్స్‌ ఫర్‌ గీక్స్‌’ అనే వెబ్‌ సైట్‌ ప్రకారం రతన్‌ టాటా జీతం యాడాదికి 820 కోట్లు!)
‘కొత్త సరుకు’ని అమ్మే ధర కోసం జీతాలన్నిటినీ కలపడంలో, పరిశ్రమ ఉద్యోగులైన డైరెక్టర్లూ, పైస్తాయి మేనేజర్లూ వంటి వారి పెద్ద జీతాలూ, పరిశ్రమదారుడి భారీ జీతమూ వంటివి అన్నీ, జీతాల 2వ ఖర్చుగానే కలుస్తాయి!
అంతే కాదు, సాధనాల కోసమూ, మొత్తం జీతాల కోసమూ పెట్టే డబ్బు, అంతా కలిసి ‘పెట్టుబడి’ అవుతుందని పరిశ్రమ లెక్క కదా? ఆ పెట్టుబడికి, ప్రారంభంనించీ, ధరతో అమ్మడం జరిగే వరకూ ‘వడ్డీ’ రావాలి!
ఇంకా, అంతే కాదు, ‘పరిశ్రమ’ అనేది, పరిశ్రమదారుడి స్వంత పనిస్తలం మీద వున్నా, ఆ స్తలానికి కౌలు (అద్దె) కూడా రావాలి! ఆ స్తలాన్ని ఇతర్లకి అద్దెకి ఇస్తే కౌలు రాదా? అందుకే, స్వంత స్తలానికి కూడా కౌలు!
ఇంకా అంతే కాదు. పరిశ్రమకి ఏమీ రావొద్దా? దానికి ‘లాభం’ రావాలి!
కౌలూ, వడ్డీ, లాభం, అనే 3 విషయాల్నీ కలిపి, ‘లాభం’ అనే ఒకే మాటతో అనవచ్చు! అంటే, ‘లాభం’ అనే మాటలో వున్న 3 విషయాల్నీ, వాళ్ళు ”మా ఆదాయాలు, మా హక్కులు!” అంటారు. (మార్క్సు సిద్ధాంతం ప్రకారం, ఇవి శ్రమ దోపిడీ ఆదాయాలు!)
ఈ రకంగా, కొత్త సరుకుని అమ్మే ధర, (1) సాధనాల ఖర్చు. (2) యజమానుల అబద్దపు జీతాల తో కలిసి, శ్రామికుల నిజమైన జీతాల ఖర్చూ. (3) కౌలూ, వడ్డీ, లాభం అనే 3 దోపిడీ ఆదాయాలూ-ఇవన్నీ కలిసి ఏర్పడేదే సరుకు ధర!
కొత్త సరుకు ఆ పెట్టుబడిదారీ ధరతోనే అమ్మకం అవుతుంది! ఎందుకంటే, ఇదే మరి సత్యం! రహస్య సత్యం! అమ్మకం ధరకి అవసర మైనంతగా, కొత్త సరుకు తయారీ కోసం శ్రామికులు చేసిన శ్రమల వల్లనే ఆ ధర ఏర్పడిందనేది అసలు నిజం!
ఒక సరుకు తయారవడానికి ఎంత శ్రమ జరగడం అవసరమో, అంత శ్రమా జరగకపోతే, సరుకు తయారీ పూర్తి అవుతుందా? ఒక చొక్కాని కుట్టే శ్రమ మధ్యలో ఆగిపోతే, చొక్కా తయారవు తుందా? ఏ సరుకు తయారీ అయినా అలాగే మధ్యలోనే ఆగిపోదా? సరుకు తయారీకి తగినన్ని సాధనాలు వున్నాయా, లేదా అనేది అవసరం అయినట్టే, తగినంత ‘మొత్తం శ్రమ’ జరగడం కూడా అవసరమే! సరుకు తయారీకి కావలసిన శ్రమ అంతా, శ్రామికుల ద్వారానే జరిగిందన్న మాట! సరుకు తయారీలో, పరిశ్రమదారుడి జీతాల లెక్క గానీ, పరిశ్రమ డైరెక్టర్లూ, మేనేజర్లూ వంటి పైస్తాయి ఉద్యోగుల జీతాల మొత్తం లెక్కలు గానీ, సరుకు ధర నిర్ణయంలోకి చేరవు! చేరదగ్గవి కావు! చేరదగ్గవి వుంటే, అంతవరకే చేరతాయి!
ఇదంతా శ్రామికులకు తెలీదు. వారికి జీతాల్లో 2 రూపాయిలు పెంచితే సంతృప్తీ, సంతోషాలూనూ!
‘అమ్మే ధర’ని తను తప్పుగా ఏర్పర్చుతున్నట్టు పరిశ్రమదారుడికి తెలుసా? మరీ ప్రారంభంలో, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియదేమోగానీ, రతన్‌ టాటాకీ, మరో టాటాకీ, తెలియదనే అర్ధానికి రాగలమా? రాకూడదు! ఎంత ధర పెడితే, అంత ధరతోటీ సరుకుకి అమ్మకం జరిగి, ఆ లెక్కకంతటికీ డబ్బు వస్తోంది కదా? అదే, పరిశ్రమదారుడు తన లెక్క సరైనదని నమ్మడానికి ఆధారం!
ఒక 10 గంటల పనిదినంలో జరిగే, 3 విషయాల గురించీ ఇప్పుడు ఒక బొమ్మని చూడండి.
ధరలోకి చేరేది సాధనాల ఖర్చు, శ్రామికుల జీతాల ఖర్చూ అంతే! లాభం సంగతి ఏమిటి? లాభం శ్రమ దోపిడీయే! శ్రామికుల అదనపు శ్రమ విలువ అది.
ఇది, ఒక పనిదినం సంగతి కాదు. నిత్యం! నిత్యం! అనునిత్యం! వారాలూ, నెలలూ, సంవత్స రాలూ! పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో, నిత్యం జరిగేది ఇదే!
ఒక్క పనిదినంలో వచ్చే లాభం కొన్ని వేలు కావచ్చు. నెల్లాళ్ళలో వచ్చేది, 1 లక్ష కావచ్చు. సంవత్సరంలో?- ఒక కోటి!
10, 20, 30 సంవత్సరాల్లో? శతకోటి అవదా? వెయ్యి అయినా, శతకోటి అయినా, అంతకాలం డ్యూటీలతో రాత్రింబవళ్ళూ శ్రమలు చేసిన శ్రామికుల, అదనపు శ్రమ విలువ అది! లాభం అనేది శ్రమ దోపిడీ!
శ్రామికుడి శ్రమ మొత్తానికి వున్న విలువని శ్రామికుడికి ఇవ్వకుండా, పనిదినం లో కొన్ని గంటల శ్రమ విలువని యజమాని ‘లాభం’ పేరుతో స్వాధీనం చేసుకోవడం యజమాని హక్కా? అది, ‘శ్రమ విలువ’ లో భాగాన్ని దోచడం కాదా?
శ్రామికుల శ్రమలతోనే సరుకులు తయారవ ుతాయి! ఇది నిజం. ఆ శ్రమ విలువలో కొంత భాగమే, తక్కువ గంటల శ్రమ విలువే రావడం అయితే, ఆ మనిషి, పని దినంలో, ఎక్కువ గంటలు పనిచెయ్యడం ఎందుకు? 10 గంటల పనిదినంలో చేసిన 10 గంటల శ్రమనించీ, 5 గంటల శ్రమ విలువని మాత్రమే, ఆ మనిషికి జీతంగా వస్తే, ఆ 5 గంటల శ్రమ విలువతోనే ఆ వ్యక్తి జీవించగలుగుతాడు కదా? ఇక 10 గంటల శ్రమ చెయ్యవలిసిన బాధ్యత ఆ వ్యక్తికి ఎందుకు?
శ్రామికుల శ్రమ, పని దినంలో మొదటి గంట నించీ సాధనాల్ని వాడుకోవడంతో ప్రారంభమై, పని దినం అంతా, చిట్టచివరిదాకా, 10 గంటలో, 12 గంటలో, 18 గంటలో, ఎన్ని గంటలైనా, జరుగు తుంది!
అదే, స్టీలు ఫ్యాక్టరీ అయితే, అక్కడ జరగ వలిసిన పనులు, అగ్నిలో కాలడమే! (టాటా స్టీల్‌ ఫ్యాక్టరీలలో, కొలిముల దగ్గిర 1160 డిగ్రీల వేడి వుంటుందనీ, ఒరిస్సాలో వున్న ఫ్యాక్టరీలో 2023 జూన్‌ లో, కొలిమి దగ్గిర ఒక ఆవిరి పైపు పేలి, 19 మంది తీవ్రంగా గాయపడ్డారనీ, వారిలో ఒక కార్మికుడు చనిపో యాడని అప్పటి పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు, గూగుల్‌ లోకి వెళ్ళి వెతికితే దొరికాయి. ఈ వార్త 2023 ది. కానీ, అంతకు 10 ఏళ్ళ ముందు, 2013లో, ఒరిస్సాలోనే టాటా స్టీల్‌ ఫ్యాక్టరీలోనే జరిగిన ఇంకో పేలుడులో, కాంట్రాక్టు కార్మికులు 15మంది దాకా తీవ్రంగా గాయపడ్డరనే వార్త కూడా కనిపించింది. చూడండి, దానశీలురైన టాటాల ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్‌ కార్మికులు!)
(ఇంకావుంది)
రంగనాయకమ్మ