నారీ శక్తి ఎక్కడ..?

Where is the energy?– కార్పొరేట్‌ ఉచ్చులో ఎస్‌హెచ్‌జీలు
– నిధుల కేటాయింపులో సర్కారు నిర్లక్ష్యం
– ఖర్చూ అంతంతే
– కేటాయింపుల్లోనూ కోతే
న్యూఢిల్లీ: మహిళలు సంపన్నులుగా మారేందుకు మధ్యంతర బడ్జెట్‌ దోహదపడుతుం దంటూ ఊదరకొట్టిన ప్రభుత్వం… వారి కనీస అవసరాలను తీర్చడంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోడీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయాలలో మహిళా శక్తి ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. గత దశాబ్ద కాలంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవే త్తలను ప్రోత్సహించి వారికి సాధికారత కల్పించామని, వారి జీవితాలను సుఖవంతం చేశామని, వారు గౌరవప్రదంగా జీవించేలా చూశామని వివరించారు.
లక్‌పతి దీదీ…
‘నారీ శక్తి’ విషయంలో ప్రభుత్వం చెప్పుకుంటున్న విజయాలలో ఒకటి కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడం. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన-నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్స్‌ మిషన్‌ (డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కార్యక్రమం కింద స్వయం సహాయక బృందాల ద్వారా ఒక్కో మహిళ తన కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల ఆదాయాన్ని అందిస్తుందని, దీనివల్ల కోటి మంది మహిళలు లక్షాధికారులవుతారని ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేట్‌ మీడియాలో ఎంతో ప్రాచుర్యం లభించిన ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2023 ఆగస్ట్‌ 15న ప్రారంభించారు.
మహిళలకు వివిధ విభాగాలలో శిక్షణ అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో వ్యాపార దిగ్గజాలైన పతంజలి, ఫ్లిప్‌కార్ట్‌, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వంటి కంపెనీలను భాగస్వాములను చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ థర్డ్‌ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకొని ఆయా సంస్థల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయించడం ద్వారా మహిళలకు సాయపడుతుందని చెబుతున్నారు.
నమో డ్రోన్‌ దీదీ…
అగ్రీ బిజినెస్‌ను, మహిళలను ‘నమో డ్రోన్‌ దీదీ’ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేసే మరో పథకాన్ని 2023 నవంబరులో ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్‌లో దీనిని రూ.500 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద డిజిటల్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో మహిళలను భాగస్వాముల్ని చేస్తారు. పదిహేను వేల మహిళా గ్రూపులకు కిసాన్‌ డ్రోన్లు అందజేస్తారు. వీటిని వారు రైతులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే నమో డ్రోన్‌ దీదీ, లక్‌పతి దీదీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలను కార్పొరేట్‌ సంస్థల ఉచ్చులోకి లాగుతున్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చేస్తున్న ఈ బడా సంస్థలు మోడీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటాయన్న విషయాన్ని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రచారం ఘనం…కేటాయింపు స్వల్పం
మహిళలను సంపన్నులుగా మార్చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆర్థిక మంత్రి తన మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో ఏకరువు పెట్టారు. అయితే అదే సమయంలో వారి కనీస అవసరాలను పట్టించుకోలేదు. పైగా ఫలితమే ముఖ్యం తప్ప కేటాయింపులు కావని వ్యాఖ్యానించారు. కేటాయింపులు, విజయాలపై ప్రభుత్వం చేస్తున్న వాదనలు ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించవు. ఎందుకంటే ఈ పథకాలపై గతంలో ప్రభుత్వం చేసిన వ్యయాన్ని గమనిస్తే దాని వాదనల్లో డొల్లతనం బయటపడుతుంది. ఉదాహరణకు పీఎం ఆవాస్‌ యోజన (గ్రామీణ) పథకం కింద మహిళల గౌరవాన్ని గృహాల ఉమ్మడి యాజమాన్యంతో ఆర్థిక మంత్రి ముడిపెట్టారు. అయితే 2023-24లో ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్‌ను పరిశీలిస్తే సవరించిన అంచనాలు బడ్జెట్‌ అంచనాలలో సగం మాత్రమే ఉన్నాయి. అంటే దీనర్థం ఈ పథకానికి పెట్టిన ఖర్చు చాలా తక్కువ.
అదే విధంగా హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని తీసుకుంటే దానిని మహిళలకు అనుకూలమైనదిగా ప్రచారం చేశారు. కానీ 2022-23లో దీనికి పెట్టిన వాస్తవ ఖర్చు అంతకుముందు సంవత్సరంలో చేసిన వ్యయం కంటే 16% తక్కువ. 2024-25లో బడ్జెటరీ అంచనాలు మరింత తగ్గిపోయాయి. ఇక స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ)కు కేటాయించిన బడ్జెట్‌లో పెట్టిన వాస్తవ ఖర్చు 60-70% దాటలేదు. కేటాయింపులు మాత్రం ప్రతి సంవత్సరం ఘనంగానే ఉంటున్నాయి.
కేటాయింపుల్లో కోత…
మహిళల అభ్యున్నతికి అత్యవసరమైన పథకాలపై ప్రభుత్వ వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. కేటాయింపుల్లో కోతలు విధిస్తున్నారు. పౌష్టికాహారం (ఆహార సబ్సిడీ, పీఎం పోషణ్‌), విద్య (స్కాలర్‌షిప్పులు), వితంతు పెన్షన్‌, గ్రామీణ ఉపాధి హమీ పథకం ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఈ పథకాల నిర్వహణ భారాన్ని క్రమేపీ రాష్ట్రాలపై మోపుతున్నారు. కేంద్రం నుండి మాత్రం ఎలాంటి మద్దతు లభించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత నుండి కేంద్రం వైదొలుగుతోంది. పైగా మహిళలు తమంతట తామే సాధికారత సాధించాలని సుద్దులు చెబుతోంది.
మహిళల అభ్యున్నతికి కేటాయింపులేవి?
మరోవైపు మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, హింసను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మోడీ సర్కారు మధ్యంతర బడ్జెట్‌లో ఈ నిర్లక్ష్యం కన్పిస్తోంది. మోడీ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఈ పదేండ్ల కాలంలో బడ్జెట్‌లో మహిళలకు కేటాయించింది 5-6% మాత్రమే. మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు బడ్జెటరీ వ్యయంలో కేటాయించింది కేవలం 0.5% మాత్రమే. మహిళలపై హింస పెరిగిపోతుంటే బాధితులకు మద్దతు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా ఉంటోంది. మహిళల రక్షణ, సాధికారత కోసం ఉద్దేశించిన పథకాలన్నింటినీ కలిపి మిషన్‌ శక్తి పేరిట కార్యక్రమం చేపట్టినా మొత్తం బడ్జెటరీ వ్యయంలో దానికి కేటాయించిన నిధులు 0.1% కూడా లేకపోవడం శోచనీయం. నిర్భయ నిధిలో 70% మొత్తాన్ని ఖర్చు చేయలేదు. గృహ హింస, లైంగిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం ఉదాశీనంగానే వ్యవహరిస్తోంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల నయా సరళీకరణ విధానాలు మత భావాల వ్యాప్తికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే మహిళా ఉద్యమ ప్రతిఘటనను బలహీనపరిచే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.