బీజేపీకి ఓట్లడిగే అర్హతెక్కడిది..?

Where is the right to vote for BJP?– దళితుల గురించి కాంగ్రెస్‌ ఆమాత్రం ఆలోచించలేదు
– బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
– మాయ మాటలు నమ్మి ఆగం కావొద్దు
– అన్ని కులాలు, మతాలు కలిసి ముందుకు సాగాలి : ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి/కోరుట్ల/ఆర్మూర్‌
మోడీ ప్రభుత్వం అన్నింటినీ ప్రయివేటు పరం చేస్తోందని, రాషా్టనికి రావాల్సిన రూ.25వేల కోట్ల నిధులు ఇవ్వలేదని, 33 జిల్లాల్లో ఒక్క మెడికల్‌ కళాశాల, నవోదయ స్కూల్‌ ఇవ్వలేదని, ఇక ఏం ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ.. దళితుల అభివృద్ధి గురించి ఆలోచించి ఉంటే వారికి ఈ పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోద్దని, ఆయా పార్టీల చరిత్ర చూసి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ముధోల్‌, కోరుట్ల, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.
భైంసా అంటేనే అన్ని అబద్ధాలు చెప్పారని, ఇక్కడ హిందూ, ముస్లింలు ఏండ్లుగా కలిసి బతుకుతున్నారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు గడిచిపోయినా ఎన్నికలు రాగానే అబద్దాలు, అబండాలు సహజమైపోయాయని, ప్రజాస్వామానికి ఇంకా పరిణతి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతుండగా.. 3 గంటలు కరెంటు చాలు అని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, ఇది సరైన పద్దతేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్న మహారాష్ట్ర రైతులు ఇక్కడ బోర్లు వేసి అక్కడ పంటలు పండిస్తున్నారు. అక్కడి కంటే ఇక్కడి రోడ్ల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గతంలో ఆగమాగం ఉండేదని, వ్యవసాయ స్థిరీకరణ చేయాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్‌ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని, ఈ పోర్టల్‌ లేకపోతే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని చెప్పారు.
గతంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు ద్వారా 4వేల ఎకరాలకు నీరందించేవారని, ఇప్పుడు 12వేల ఎకరాలకు సాగునీరందుతోందని తెలిపారు. రైతుబంధు సాయంతో రైతులు అప్పులు తీర్చుకుంటున్నారని, కాంగ్రెస్‌ హయాంలో ఎరువులు, విత్తనాలు పోలీస్‌స్టేషన్‌లో లభించేవని, ఇప్పుడా పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూ, కరువు లేకుండా కులం, మతం అన్న భేదం లేకుండా అందరూ సమానంగా బతుకుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి ముధోల్‌ ఎమ్మెల్యేగా విఠల్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ దామోదర్‌రావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ ఎంపీ గోడం నగేష్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, మాజీ జడ్పీ చైర్మెన్‌ లోలం శ్యాంసుందర్‌, డా.రమాదేవి పాల్గొన్నారు.
బీడీ కార్మికుల పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
బీడీ కార్మికులకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్‌ ఇవ్వడం లేదని, తెలంగాణ మాత్రమే పెన్షన్‌ ఇస్తున్నట్టు తెలిపారు. గత పాలనలో కోరుట్ల, సిరిసిల్ల, పోచంపల్లిలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికులకు సబ్సిడీలు ఇస్తూ వారికి భరోసా కల్పించామని గుర్తు చేశారు.
ధరణి ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నామని, ధరణి లేకుంటే అవి ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. ధరణి ఉండాలంటే బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి తాము 24 గంటల కరెంట్‌ అందిస్తుంటే, కాంగ్రెస్‌ వాళ్ళు 3 గంటలు సరిపోతుందని అంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌ అయిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీటి ఇబ్బంది లేకుండా బీఆర్‌ఎస్‌ చేసిందని తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సీఎం అభ్యర్థించారు.
కాంగ్రెస్‌ ఇవ్వదు.. ఇస్తే కండ్లమంట
దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం మేలు చేసిందని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదంటున్న ఇలాంటి పార్టీ మనకు అవసరమా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందు, వచ్చాక చేసిన అభివృద్ధి ప్రజలకు కండ్లముందే కనబడుతుందని, నా బావ చెప్పిండు.. బంధువు చెప్పిండని కాకుండా.. ఆలోచన చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ఆదాయం పెరిగేకొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పారు. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టిందన్న కేసీఆర్‌.. ఆర్మూర్‌ నియోజకవర్గ అభ్యర్థి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలకు మేలు చేసేది బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వమే అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మస్త్రాన్ని సంధించాలంటూ పిలుపునిచ్చారు.