ప్రేమను వాళ్ళెక్కడ నేర్చుకోవాలి?

ఈ యుద్ధం ఎప్పటిది?
తరాల నెత్తురుతో
తడిసిన ఆ నేలనే అడగాలి
ఈ రక్త దాహం ఎవరిది!? ఈ యుద్ధం ఎప్పటిది?
తరాల నెత్తురుతో
తడిసిన ఆ నేలనే అడగాలి
ఈ రక్త దాహం ఎవరిది!?

గొంగళి పురుగులు తినేస్తున్న ఆకులా
చిద్రమవుతున్న ఆ దేశ పటాన్ని
అడిగి చూడు!
దురాక్రమణ ఎవరిదో?
పుట్టి పెరిగిన నేలకోసం
పుట్టెడు ద్ణుఖం ఎవరిదో?

సొంత ఇళ్ళ నుండే గెంటేయబడుతూ
నడిచే వీధులు నిషేధించబడుతూ
మాతృ దేశంలోనే స్వేచ్ఛను కోల్పోతూ
తరాల శాంతి కలలు కాలి బూడిదవుతూ…

నాదీ అనుకోడానికి
ఏదీ మిగిల్చని అమానుష దాడిలో
అమాయక ప్రజలు
లోకపు మాలిన్యం అంటని పసిపిల్లలు
నెత్తుటి ముద్దలవుతున్నారు కదా!
శిధిల శవాలవుతున్నారు కదా!

తెల్లని వస్త్రంలో చుట్టబడి
వాళ్ళేదో నిద్ర పోతున్నట్టు
చూసీ చూడనట్టు
తెలిసీ తెలియనట్టు
నటించే ఈ ప్రపంచాన్ని వాళ్ళేమనుకోవాలి?

రాకాసి మేఘాల నుండి రాలి పడుతున్న
బాంబుల వర్షంలో వాళ్ళెక్కడ తలదాచుకోవాలి?

ప్రేమను
శాంతిని
వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి?
– రహీమొద్దీన్‌, 9010851085