– మతతత్వ బీజేపీని ఓడించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ – సిటీబ్యూరో
మన దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చిందే కాని, సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య గుర్తు చేశారు. పాలకవర్గాలు ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తున్నారని, దీన్ని వామపక్షాలతో కలిసి అడ్డుకోవాలని సూచించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఈసీఐఎల్ కమలానగర్‌లోని జిల్లా ఆఫీసులో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించగా.. నాగయ్య హాజరై మాట్లాడారు వామపక్షాలతో కలిసి మతతత్వ బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫాసిస్టు విధానాలను వంట పట్టించుకుని బీజేపీ దేశంలో నిరంకుశ పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ఎలక్షన్స్ కూడా విభిన్నంగా జరుగుతున్నాయని, గత పార్లమెంటు సమావేశాల్లో 146 మంది సభ్యులను సస్పెండ్ చేసి అనేక చట్టాలను ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకి అనుకూలంగా అనేక చట్టాల్లో సవరణలు చేశారని విమర్శించారు. ఉపా లాంటి చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు. రాజకీయ కక్షతో అరెస్టయిన వాళ్లలో 95 శాతం మందికి బెయిల్ రావట్లేదని, రాజద్రోహం కింద అరెస్టులు చేయటం, మీడియా మీద దాడి చేయటం బీజేపీకే చెల్లిందని దుయ్యబట్టారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారని న్యూస్ క్లిక్ ఎడిటర్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టి, ఇంతవరకు బెయిల్ రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కుల మీద దాడి చేయడం, రాష్ట్రానికి రావలసిన నిధులను ఇవ్వకుండా ఉండటం, వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కులగొట్టడం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దగాకోరు రాజకీయాలని విమర్శించారు. సీబీఐ, ఈడీ లాంటి రాజ్యాంగ సంస్థలని ప్రయోగిస్తూ, వారి పార్టీలోకి చేరేలా చేసి, తర్వాత కేసులు లేకుండా చేస్తున్నారని, చేరని వారిని కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహాలోనే ఢిల్లీ సీఎంని, జార్ఖండ్ సీఎంను జైల్లో పెట్టారని గుర్తుచేశారు. ఎలక్ట్రోల్ బాండ్లని చట్టం చేసి దాని ద్వారా రూ.8వేల కోట్లు పార్టీ ఫండ్‌గా జమ చేసుకున్నది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కలగజేసుకుని ఈ విధానం తప్పు.. ఎవరైతే బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చారో.. వారి వివరాలు బహిరంగపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎస్‌బీఐని ఆదేశించినా ఇప్పటివరకు బయటపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో అధ్యక్ష తరహా పాలన తీసుకురావటానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు. లౌకిక విధానాలకు తూట్లు పొడుస్తున్నదన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేయడం, సిఏఏని అమలు చేయటం, గిరిజన భూములను సంపన్న వర్గాలకు అప్పచెప్పటం, మైనార్టీ, దళితుల మీద దాడి చేయటం ఇవన్నీ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాలను ప్రజలకు చెప్పి ఎన్‌డీఏను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని జిల్లా ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె. చంద్రశేఖర్, కోమటి రవి, చింతల యాదయ్య, వినోద, జిల్లా కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ఫ్రాక్షన్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.