– తెలంగాణలో మోడీ హవా లేదు బీఆర్‌ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్
– కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమైంది : మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ
నవతెలంగాణ-ఓయూ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇంత వరకు అమలుకాలేదని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి పద్మారావు గౌడ్ అన్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఎన్నికల ప్రచార కార్యాచరణపై ఆదివారం అయన నివాసంలో చర్చించారు. ఈ సందర్భంగా వారంతా పద్మారావుగౌడ్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ అభ్యర్ధిగా తనపై నమ్మకంతో తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్ అంటే గ్రేటర్‌లో గుర్తుపట్టని వారు ఉండరని, స్వయం కృషితో పైకి రావడం, ప్రజలకు సేవ చేయడంతో ఆ పేరు వచ్చిందన్నారు. తాము ప్రజలే తమ కుటుంబంగా భావించామని, ఎప్పుడూ ప్రజలనే నమ్ముకున్నామని తెలిపారు. సికింద్రాబాద్ అంతా అద్భుతమైన అభివృద్ది జరిగిందని, కొన్ని సార్లు గెలుపు-ఓటములు తప్పవని, మళ్ళీ రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. గల్లీలీడర్లు లేనిది ఢిల్లీ ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణలో మోడీ హవా లేదని తెలిపారు. మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 420హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమయ్యిందని విమర్శించారు. మరో రెండు రోజుల్లో తెలంగాణ భవన్‌లో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్, అంబర్‌పేట ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ యువనేత ముఠా జైసింహ, యువ నేత రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత రమేష్, సుంకు రాం చందర్, కరాటే రాజు, నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు పద్మారావును కలిసి ఘనంగా సన్మానించారు.