– అన్ని రాజకీయ పార్టీల జెండాలు ఇక్కడే తయారీ నేత కార్మికులకు చేతినిండా పని
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిరిసిల్ల జెండా ఎగరాల్సిందే. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యాన్ని మెచ్చిన రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయి రాజకీయ పార్టీలు తమ ప్రచార జెండాలు, కండువాలు, ఇతర వస్త్ర సామాగ్రి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇస్తారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిరిసిల్ల నేతన్నలకు మెండుగా ఉపాధి లభిస్తోంది. వివిధ పొలిటికల్ పార్టీల జెండాలు, కండువాలు సిరిసిల్లలో ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ వస్తున్నాయి. తమ పనితనంతో నేతలను మెప్పిస్తున్నారు.
నవతెలంగాణ – సిరిసిల్ల
తెల్లని వస్త్రాన్ని ఉత్పత్తి చేసి దానిపై వివిధ పార్టీల నాయకుల ఫొటోలు, గుర్తులు, పార్టీలకు సంబంధించిన కలర్స్‌తో పూర్తి స్థాయి జెండాలు, కండువాలు తయారవుతున్నాయి. అతి తక్కువ ధరలకే ఎన్నికల ప్రచార సామాగ్రిని సరఫరా చేస్తూ జాతీయ స్థాయి పార్టీల చూపు సిరిసిల్ల వైపు చూసేలా చేస్తున్నారు నేతన్నలు. ఇప్పటికే పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుండటంతోపాటు వారికి కావాల్సిన ధరలో మన్నికతో అందిస్తున్నారు. అదే సమయంలో నేత కార్మికులకు ఎలక్షన్ సందడితో చేతినిండా పని దొరుకుతోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల ఆర్డర్‌లు సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటికే అందాయి. అందుకనుగుణంగా ఉత్పత్తి ప్రారంభించారు. పార్టీ జెండా తయారీకి మీటరున్నర వస్త్రం, కండువా తయారీకి మీటర్ వస్త్రాన్ని వాడుతున్నారు. వివిధ పార్టీల ఆర్డర్‌లను బట్టి జెండాలను, కండువాలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ 5లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చింది. వైసీపీ 5లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చింది. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆర్డర్లు ఇచ్చాయి. ప్రస్తుతానికి జెండాలు, కండువాలు తయారు చేస్తున్నారు. జెండారు తయారు చేసే నేతన్నలు రూ.9 చొప్పున మీటరు వస్త్రాన్ని కోనుగోలు చేస్తారు. దీనికి ప్రింటింగ్ కోసం రూ.8 ఖర్చవుతుంది. ఒక జెండా తయారీకి రూ.17 ఖర్చవుతుంది. ఉత్పత్తిదారులు ఈ జెండాలను రూ.19 నుంచి రూ.20కు విక్రయిస్తున్నారు.
నేత కార్మికులకు ఉపాధి..
ప్రస్తుతం జెండాల ఉత్పత్తిలో సిరిసిల్లలో దాదాపు 500మంది నేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండా కట్ చేస్తే ఒక్కో జెండాకు 25పైసలు, కుట్టిస్తే 40పైసల చొప్పున ఇస్తారు. జెండాల తయారీ కార్ఖానాలో స్థానికులు రోజూ ఉపాధి పొందుతున్నారు. ప్రతి ఎలక్షన్ టైంలో సిరిసిల్లలో పలు పార్టీల జెండాలను తయారు చేసేందుకు సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్‌లు ఇస్తారు.
అన్ని జిల్లాలకు సిరిసిల్ల నుంచే..
సిరిసిల్లలో తయారైన పార్టీల జెండాలను అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన ప్రింటింగ్ వ్యాపారులు ఎమ్యెల్యే అభ్యర్థుల ఆర్డర్‌లు తీసుకుని సిరిసిల్లలో ఇస్తుంటారు. ఇక్కడ జెండాలను తయారు చేయించుకుని ఎమ్యెల్యే అభ్యర్థులకు అందజేస్తారు. ఇలా మధ్యవర్తులతో కూడా కొన్ని ఆర్డర్లు లభిస్తాయి.