ఫైలు కదిలేనా? జీతాలందేనా?

Is the file moving? Salaries?– ఉపాధి ఉద్యోగులకు మూడు నెలలుగా అందని జీతాలు
– సమస్య తీవ్రతను పట్టించుకోని ఉన్నతాధికారులు
– కుటుంబాలు గడవక ఉద్యోగుల ఇబ్బందులు
– పర్మినెంట్‌ చేస్తారనే చిన్న ఆశతో బాధలను భరిస్తున్న వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలకే కాదు ఉద్యోగులకూ సర్కారు వేతనాలివ్వడం లేదు. ఒకటికాదు.. రెండు కాదు..మూడు నెలలు నుంచి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. నెలలో ఒకటెండ్రు రోజులు కాస్త లేటుగా పడితేనే కిందామీద అయ్యే ఈ రోజుల్లో మూడు నెలలు జీతాలు రావడట్లేదంటేనే వారు పడుతున్న వ్యథలు అన్నీఇన్నీ కావు. జీతాలు అందకున్నా..అప్పులు చేసుకుని మరీ బతుకులు వెళ్లదీస్తున్నారు. 18 ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమను రాష్ట్ర సర్కారు ఎప్పటికైనా పర్మినెంట్‌ చేయకపోతుందా? అనే చిన్న ఆశతో వారు బాధలన్నింటినీ పంటికింద భరిస్తూ కుటుంబ బాధ్యతలను నెట్టుకొస్తున్నారు. జీతాల ఫైలు ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వద్ద పెండింగ్‌లో ఉంది. ‘డిప్యూటీ సీఎం సారూ..ఈనెలనైనా జీతాలు వేయించండి’ అనుకుంటూ కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఉపాధి హామీ చట్టం 2005 ఆగస్టు 23న ప్రారంభ మైంది. ఆ చట్ట పరిధిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 3,974 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 392 మంది అడిషనల్‌ పోగ్రా మ్‌ ఆఫీసర్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీలు 289 మంది, టెక్నికల్‌ అసిస్టెంట్లు 2028 మంది, ఏఏలు 870 మంది, అడిషనల్‌ డీఆర్‌పీలు 8 మంది, సీడీ సీఎల్‌ఆర్‌ 17 మంది, జేఈ(సివిల్‌)లు 60 మంది, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్స్‌ 26 మంది, పీవోలు 23 మంది, ఇతర విభాగాలకు చెందిన వారు 261 మంది ఉన్నా రు. వీరికి తోడుగా 7,500కిపైగా ఫీల్డు అసిస్టెంట్లున్నారు. వీరంతా ఉపాధి హామీ కూలీలతో పనులను చేయించడం లో, బిల్లింగ్‌ చేయడంలో, కూలీలకు వేతనాలు అందించడం లో జరిగే అన్ని ప్రక్రియల్లోనూ పాలు పంచుకుంటారు. ఉపాధి హామీ పనులను క్రమం తప్పకుండా చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు ఎక్కువ నిధులను రప్పించడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. వీరు 18 ఏండ్ల ఆరు నెలల నుంచి అదే పనిచేస్తున్నారు. వీరు ఉపాధి హామీ పనులు, హరితహారం, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మల్బరీ తోటల పర్యవేక్షణ, నర్సరీల నిర్వహణ, ఇలా 220 రకాల పనులను పర్యవేక్షిస్తున్నారు. 16 శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంత పనిచేస్తున్న వీరికి జీతాలు మాత్రం సకాలంలో అందడం లేదు. డిసెంబర్‌ నుంచి వేతనాలు రాలేదు. డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి, ఇలా మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చిలోనూ పక్షం రోజులు పూర్తయిపోయాయి. జీతమైతే ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నద న్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ‘మూడు నెలల నుంచి జీతం లేక అప్పులు తెచ్చి మరీ ఈఎమ్‌ఐ లు కడుతున్నాను. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ ఇలా కాలేదు. ప్రతి నెలా జీతం వచ్చేది’ అని రాష్ట్ర కేంద్రంలో పనిచేసే ఓ ఉద్యోగి వాపోయాడు. వారు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల సరుకులు తెచ్చుకునేందుకు, ఇంటి అద్దెలు కట్టేందుకు అప్పులు చేసుకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. వేతనాల గురించి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించు కోని పరిస్థితి. వేతనాలకు సంబంధించిన రూ.121 కోట్ల ఫైలు సీతక్క సంతకంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖకు పంపింది. అక్కడ నుంచి ఆ ఫైలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క దగ్గర పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది.
18 ఏండ్ల నుంచి చేస్తున్నా పర్మినెంట్‌ ఏది?
గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 కంటే ముందు నుంచి పలుశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేసింది. వీరిని మాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో దీన్ని అస్త్రంగా చేసుకున్నది. ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న వారిని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర్మినెంట్‌ చేస్తా మనీ, పేస్కేలు అమలు చేస్తామని హామీనిచ్చింది. ఆ చట్టం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పర్మి నెంట్‌ ఫైలు ప్రస్తుతం ఉన్నతస్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం పెడితే పర్మినెంట్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ ఫైలు ఎంత వేగంగా ముందుకు కదులుతుంది? ఎప్పటిలోగా వారు పర్మినెంట్‌ అవుతారనే విషయంపై వేచిచూడాల్సిందే.