సహాయ బీసీ వెల్ఫేర్ అధికారులపై చర్యలు శూన్యమేనా..?

– దొంగకే  తాళం చేతులు ఇచ్చిన వైనం
– విజిలెన్స్ అధికారులతో వెంటనే  విచారణ చేపట్టాలి
– చేతులు మారిన రూపాయల రికవరీ ఎప్పుడు?
– బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ 
 నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో వర్కర్ల నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడి, వర్కర్ల నుండి లక్షల రూపాయలను వసూలు చేసిన ఏబిసిడబ్ల్యూఓ లను  తక్షణమే సస్పెండ్ చేయాలని, విషయంపై విజిలెన్స్ అధికారులచే  విచారణ చేయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఆకారపు నరేష్, కంభంపాటి శంకర్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.నిరుపేధ కుటుంబాల కు అండగా నిలవాల్సిన   బీసీ వెల్ఫేర్ అధికారులు వర్కర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా,  పార్ట్ టైం వర్కర్ల నుండి కూడా ముక్కు పిండి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. బాధితులంతా  ఒక్కొక్కరిగా తమ గోడును వెల్లడిస్తున్నారని ఆవేదన చెందారు. ఒక్కొక్క  వర్కర్ నుండి లక్షకు పైగా  వసూలు చేశారని, ఆ డబ్బులను ఏబిసిడబ్ల్యూఓల తో పాటు ఏజెన్సీ నిర్వాహకుడు తీసుకున్నాడని, అయినా కూడ అధికారులు నేటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఏబిసిడబ్ల్యూఓల   పై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని, దొంగకే తాళం చేతులు ఇచ్చిన చందంగా  అలాంటి వారికి ఉన్నతమైన బాధ్యతలను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. తక్షణమే వారిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అక్రమాలలో ఆ శాఖలో ఓ ప్రధాన విభాగానికి  చెందిన  ఉద్యోగి పాత్ర కూడా ఇందులో ఉందని  ఆరోపించారు. సోమవారం కమిషనర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో వర్కర్ల నియామకంలో జరిగిన అవినీతి అక్రమాలపై  జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో  విచారణ చేయించి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని,  అందుకు కారకులైన ఏబిసిడబ్ల్యూఓ ను  తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, కోరే రమేష్, స్పందన, అంజలి తదితరులు పాల్గొన్నారు.