– మూడేండ్లుగా ఉపాధి కూలీల నిరీక్షణ
– మార్గదర్శకాలు రాలేదంటున్న అధికారులు
నవతెలంగాణ-మల్హర్‌రావు
ఉన్న ఊరిలోనే నిరుపేదలకు పనులు కల్పించే ఉద్దేశంతో యూపీఏ హయాంలో కమ్యూనిస్టుల పోరాటంతో వచ్చిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం రోజు రోజుకూ నిర్వీర్యమవుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కొత్త కొత్త నిబంధనలు పెట్టడమే కాకుండా.. చట్టానికి నిధుల కేటాయింపులో భారీగా కోతలు విధించింది. అందులో భాగంగానే వేసవి భత్యం చెల్లింపు ఆగిపోయింది. వ్యవసాయ పనులు పూర్తైన తరువాత అంటే వేసవిలో ఉపాధి పనులు జోరుగా సాగుతుంటాయి. అయితే ఏటా అమలు చేసే వేసవి భత్యం విషయంపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలూ రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. మూడేండ్లుగా ఆ ఊసే లేకపోవడంతో ఉపాధి కూలీలు డోలాయమానంలో పడ్డారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని 15 గ్రామాల్లో ఉపాధి పనులు సాగుతున్నాయి. రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతోంది. మండల ఏపీఓ హరీష్ ఆధ్వర్యంలో కూలీలను పర్యవేక్షణ చేస్తున్నారు. మండలంలో ఉపాధిహామీలో మొత్తం 8,441 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. వీరిలో 11,078మంది సభ్యులుగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో(2023-24) 4178 కుటుంబాలు (11078మంది కూలీలు) హాజరు కాగా, 19,6789 పని దినాలు చేశారు. ఒక్కొక్క కూలికి నిత్యం రూ.190.08 నుంచి రూ.200 వరకు చెల్లిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉపాధి పనులు ఎక్కువగా జరుగుతాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో పూర్తిస్థాయిలో పనులు చేయలేని పరిస్థితిలో వేసవి భత్యం అమలు చేసేవారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి, ఏప్రిల్‌లో 25శాతం, మేలో 30 శాతం, జూన్‌లో 25 శాతం అందించేవారు.
ఈ లెక్కన వేసవి భత్యం, ఫిబ్రవరికి సంబంధించి రూ.2,21,560, మార్చికి సంబంధించి రూ.276960, ఏప్రిల్‌కు సంబంధించి రూ.2,76,960, మేకి సంబంధించి రూ.3,32,340, జూన్‌లో రూ.2,76,960, మొత్తంగా సుమారు రూ.కోటి 3లక్షల పైచిలుకు వేసవి భత్యం చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే, మండలంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేసవి భత్యం మొత్తం కూలీలు(13,756మంది)కు ఫిబ్రవరిలో రూ.2,75120, మార్చిలో రూ.3,43900, ఏప్రిల్‌లో రూ.3,43,900, మేలో రూ.4,12680, జూన్‌లో రూ.3,43900 ఉండగా.. మొత్తం రూ.కోటి 6లక్షలకు పైగా బకాయి ఉంది. మూడేండ్లకు గాను మొత్తం రూ.2కోట్లకు పైచిలుకు వేసవి భత్యం చెల్లించాల్సి ఉందని ఉపాధి కూలీలు పేర్కొంటున్నారు. ఒక్క మల్హర్‌రావు మండలంలోనే రెండు కోట్ల రూపాయల పెండింగ్ ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటాయన్నది ప్రశ్న. ఈ ఏడాది మార్చి 3వ వారం పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు.
పనుల వద్ద అరకొర సౌకర్యాలే..!
ఏటా వేసవిలో ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు అందని ద్రాక్షగా మారాయి. సమావేశాల్లో చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యం. మండుటెండలో పనులు చేసి వడదెబ్బకు గురైనవారు లేకపోలేదు. ఉపాధి పనులు జరిగే చోట నీడ, నీళ్లు ఏర్పాటు చేయాలి. చలువ పందిళ్లు, మంచినీటి వసతి తప్పకుండా ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించకుంటే మంచినీటి భత్యం కింద రూ.5 అదనంగా చెల్లించాలి. పని ప్రదేశంలో ఓఆర్‌ఏస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. పని చేస్తున్న సమయంలో కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి.
కూలీలు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించాల్సి ఉంది. కానీ, ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి టీసీఎస్ సాప్ట్‌వేర్‌లోనే కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి. కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యానికి సంబంధించి ఎలాంటి ఆప్షన్ లేదు. దీంతో ఈసారి అమలవుతుందా ? లేదా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు భత్యం లేకపోతే కూలీలు నష్టపోయే పరిస్థితి ఉంది.
ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. చట్టం నిర్వీర్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
మూడేండ్లుగా భత్యం లేదు
– కొమురయ్య, తాడిచెర్ల
ప్రతి సంవత్సరం ఉపాది కూలి పని చేసేవారికి వేసవిలో అదనపు భత్యం ఇచ్చేవారు. మూడేండ్లుగా ఆ ఊసే లేదు. ఇదెక్కడి అన్యాయం అని అధికారులను అడిగితే పై నుంచి ఆదేశాలు రాలేదంటున్నారు.
వసతులు కల్పించాలి
ఉపాధి పనులు చేసే చోట సౌకర్యాలు కల్పిం చడం లేదు.అధికారులు పర్య వేక్షణకు వచ్చినప్పుడు వారికి చెప్పినా ఏర్పాటు చేయడంలేదు. ఎండలు ముదరకముందే ఏర్పాట్లు చేయాలి.లేకుంటే వడ దెబ్బకు కూలీలు తట్టుకోలేరు.
– అక్కల బాపు, ప్రజా సంఘాల నాయకుడు