
snapsindia
– నీళ్లు, ప్రాజెక్టుల చుట్టూ రాష్ట్ర రాజకీయం
– పోటాపోటీగా సందర్శనలు
– జనాన్ని నమ్మించేందుకు పాట్లు
– ‘నవతెలంగాణ’ వాస్తవాల విశ్లేషణ
రాష్ట్ర రాజకీయం నీళ్లు, ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తప్పు మీదంటే…కాదు మీదంటూ ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. పోటీలు పడి ప్రాజెక్టుల సందర్శన పేరుతో ఎవరి బలం వారు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆటలో అరటిపండు లాగా వీళ్లిద్దరి మధ్య బీజేపీ ‘దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి’ అంటూ బంతిని తన కోర్టులోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. మంచో చెడో… ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో, కేంద్ర అనుమతులు లేకుండా రూ.లక్ష కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంటే, మోడీ సర్కారు పదేండ్లు నిద్ర నటించింది. ఇప్పుడే మేల్కొన్నట్టు… అసలు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదమే తెలుపలేదంటూ ‘కొంగ జపం’ లోంచి ఇప్పుడే మెలుకొచ్చినట్టు చెప్పుకొస్తున్నది. గడచిన పదేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని ‘కాగ్’ ఆక్షేపణలు చేస్తూనే ఉంది. మోడీ సర్కారు శ్రవణ దోషం పాటిస్తూనే ఉంది. అసలు ఈ ప్రాజెక్టుల కథ ఏంటి? కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వాదనల్లో బలమేంటి? ఈ రెంటినీ ఒకే చోట…వేర్వేరుగా పాఠకుల ముందు ఉంచే ప్రయత్నాన్ని ‘నవతెలంగాణ’ చేస్తుంది.
ఇదీ ప్రాణహిత-చేవెళ్ల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38,600 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత- చేెవేళ్ళ పథకాన్ని చేపట్టారు. 180 టిఎంసీల నీటిని ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలోని 16.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలన్నది లక్ష్యం.
– కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నియంత్రణలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్) సంస్థ ద్వారా సర్వే చేశారు. దీనిలో ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేశారు.
– తుమ్మిడిహట్టి నుంచి 116 కిలోమీటర్ల దూరంలోని గోదావరి నదిపై ఎల్లంపల్లి వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందనీ, మొత్తం 180 టీఎంసీల నీరు సాగుకు లభిస్తుందని సర్వేలో అంచనా వేశారు.
– తుమ్మిడిహట్టికి ముందు పెన్‌గంగా, వార్ద, వెన్‌గంగా నదులు కలిసిన తరువాత ప్రాణహిత నదిగా పేరు మారింది. ఈ మూడు నదులు కలిసిన చోట ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలి.
– ఈ డిజైన్ వల్ల కేవలం 1,250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుంది. 152 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాలని అంచనా వేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనితో ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్ల ఎత్తుకు తగ్గించుకోవడం జరిగింది.
– తుమ్మిడిహట్టి బ్యారేజ్‌లో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.
– తుమ్మిడిహట్టి నుంచి కజ్రాల్లీ 15 కి.మీ దూరంలో ఉంది. అక్కడి నుంచి సుర్గపల్లే 28.5 కి.మీ దూరానికి లిఫ్ట్ చేయాలి. ఈ ప్రాజెక్టు కింద 20,500 ఎకరాలు సాగు అవుతుంది.
– ఇక్కడి నుంచి 71.5 కి.మీ., దగ్గర మైలారం ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. దీని కింద 36 వేల ఎకరాలు సాగు అవుతుంది.
– అక్కడి నుంచి 116 కి.మీ., దగ్గర కాల్వ తీయడం ద్వారా ఎల్లంపల్లిలో తుమ్మిడిహట్టి నీరు కలుస్తుంది.
– ఎల్లంపల్లి 148 మీటర్ల ఎత్తులో ఉంది. అందువల్ల తుమ్మిడిహట్టి నుంచి పెద్దగా నీటిని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు.
– ఈ ప్రాంతం అంతా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించింది.
– ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహట్టి – ఎల్లంపల్లి కాల్వను విస్త్రుత పర్చడం ద్వారా మరో లక్ష ఎకరాలకు అదనంగా నీరు ఇవ్వవచ్చు.
– అలా మొత్తం 1.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సౌకర్యం కలుగుతుంది.
బీఆర్‌ఎస్ సర్కార్ రీ డిజైన్
తుమ్మిడిహట్టి- ఎల్లంపల్ల్లి ప్రాజెక్ట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ చేసింది. తుమ్మిడిహట్టి వద్ద 180 టీఎంసీల నీటి లభ్యత లేదనీ, మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్లకే అంగీకరిస్తున్నదనీ, తుమ్మిడిహట్టి ఎగువన 60 టీఎంసీల మిగులు జలాల్ని మహారాష్ట్ర వాడుకుంటున్నందున ప్రాణహిత 4చేవేళ్ల పథకానికి నీటి లభ్యత ఉండదనే అభిప్రాయానికి వచ్చింది.
– వ్యాప్కో సంస్థ ద్వారా తుమ్మిడిహట్టి వద్ద సర్వే చేయించి నీటి లభ్యత లేనందున రీ డిజైన్‌లో ఆ ప్రాంతాన్ని మార్చాలని నిర్ణయించారు.
– కానీ 2015లో ఐదుగురు ఇంజనీర్ల బృందం (1.అనంతరాములు, 2, వెంకట్రామారావు, 3. చంద్రమౌళి, 4.దామోదర్‌రెడ్డి, 5.శ్యాంప్రసాద్‌రెడ్డి)తో కూడిన కమిటీ, ప్రాణహిత-చేవెళ్ళ లిఫ్ట్ పనులు చేపట్టాలనీ, రీ-డిజైన్ ద్వారా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కడితే రూ.24 వేల కోట్ల అదనపు వ్యయం అవుతుందని నివేదిక ఇచ్చారు.
– ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టులోని మిడ్‌మానేర్ వరకు రూ.15,634 కోట్లు మాత్రమే వ్యయం అవుతాయని, మేడిగడ్డను ఎంచుకుంటే రూ.8,366 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని సలహా ఇచ్చారు.
– ఏరియల్ సర్వే, టోపోస్టడీ నిర్వహించి మహారాష్ట్రలోని పట్టా భూముల్ని నివారించడానికి మేడిగడ్డ వద్ద 105 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) డిజైన్ మాత్రమే సాధ్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
– పైగా భూమిలోపల నిర్మాణాలు చేయాల్సి వస్తుందనీ, తాడిచెర్ల బొగ్గు బ్లాకులతో పాటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల మీదుగా పనులు చేపట్టాల్సి ఉంటుందనీ ఇంజినీర్ల కమిటీ పేర్కొంది.
– కమిటీ నివేదిక స్పష్టంగా ఇచ్చినప్పటికీ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టికి బదులు మేడిగడ్డనే ఎంచుకుంది.
– గోదావరి నదికి ప్రాణహిత వచ్చి కలిసిన తరువాత మేడిగడ్డ వద్ద నీటి లభ్యత అదనంగా ఉంటుందని మేడిగడ్డను ఎంచుకున్నారు.
– మేడిగడ్డకు ఎల్లంపల్లి 108 కి.మీ. దూరంలో ఉంటుంది.
– మేడిగడ్డ ప్రాజెక్టును గోదావరి నదిపై వంద మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు.
– దానికి ముందు 46.5 కి.మీ., దూరంలో గోదావరిపై 121 మీటర్ల ఎత్తులో అన్నారం బ్యారేజీని నిర్మించారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు
– అన్నారం నుంచి 31.60 కి.మీ., దూరంలో 132 మీటర్ల ఎత్తులో సుందిళ్ల బ్యారేజీని 8.80 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు.
– సుందిళ్ల నుంచి 31 కి.మీ., దూరంలో 148 మీటర్ల ఎత్తులో 20.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు.
– మేడిగడ్డ నుంచి అన్నారంకు, అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పంపుల ద్వారా నీటిని సరఫరా చేయాలి.
– ఈ నాలుగు ప్రాజెక్టులు గోదావరి నదిపై ఉంటాయి. ఈ విధంగా రీ-డిజైన్ చేసి ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు.
ఆ తర్వాత..
పై మూడు ఎత్తిపోతలకు 4,800 మెగవాట్ల విద్యుత్ కావాలి. 2021, 2022లోనూ వచ్చిన గోదావరి వరదల్లో ఇక్కడ నీటిని నిల్వ పెట్టలేకపోయారు. మొత్తం కాల్వలో 175 టీఎంసీల నీటిని మాత్రమే లిప్ట్ చేశారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్‌లో 18 నుంచి 21 నెంబర్ పియర్స్ మూడడుగుల లోతుకు కుంగిపోయాయి. దీనితో మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా తెలంగాణ నుంచి మహరాష్ట్రకు వెళ్లే రహదారిని మూసేశారు. అదే సమయంలో అన్నారం బ్యారేజీకి బుంగ పడి ప్రాజెక్టు వెనుకకు పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో సరిగ్గా పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు బ్యారేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనితో కేంద్రం జోక్యం సీఆర్‌పీఎఫ్ బలగాల్ని మోహరించి, డ్యాం పటిష్టతపై ‘డ్యాం సేఫ్టీ అథారిటీ’కి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం పగుళ్ళు మరింత విస్తరించాయి. అక్కడి నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల ప్రాజెక్టుల రాజకీయం, మధ్యలో బీజేపీ ఆరంగేట్రంను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ప్రజలపైనే భారాలు
సారంపల్లి మల్లారెడ్డి సాగునీటిరంగ నిపుణులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర రైతాంగానికి నీరు కావాలి. ప్రజలకు తాగునీరు కావాలి. ప్రభుత్వాల నిర్ణయాలు దానికి తగినట్టు ఉండాలి. శాస్త్రీయత లేకుండా ప్రాజెక్టులు కడితే ప్రజలపైనే అంతిమంగా ఆర్థిక భారాలు పడతాయి. రీ డిజైనింగ్ వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఒక్క ఎకరాకు సాగునీటి వ్యయం రూ.46,364 కి చేరింది. రాజకీయపార్టీలు ఈ అంశంలో ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఫలితంగా వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. ‘కాళేశ్వరం’పై ‘కాగ్’ పదేండ్లుగా మొత్తుకుంటూనే ఉంది. పట్టించుకున్న నాధుడులేడు. అప్పుడే కాగ్ నివేదికను విశ్లేషించుకొని ఉంటే, పరిస్థితులు మరోలా ఉండేవి. ప్రజలపై ఆర్థిక భారాలు ఉండేవి కావు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతలకే 4,800 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.