బహుళ యాజమాన్యం,విరుద్ధ ప్రయోజనాలపై కొరడా

– 57 క్లబ్‌లకు ఎన్నికల్లో ఓటు, పోటీ చేసే అవకాశం రద్దు
– హెచ్‌సీఏ ఏక సభ్య కమిటీ సంచలన నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో క్రికెట్‌ కుంటుపడేందుకు ప్రధాన జాడ్యం బహుళ క్లబ్‌లపై ఆధిపత్యం. సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావు ఈ కీలక సమస్యకు పరిష్కారం చూపించారు. కొందరు వ్యక్తులే అధిక సంఖ్యలో క్లబ్‌లను ఆధీనంలో ఉంచుకుని ఎన్నికలను, అపెక్స్‌ కౌన్సిల్‌ను ప్రభావితం చేస్తున్నారని ఏకసభ్య కమిటీ నిర్ధారణకు వచ్చింది. బహుళ క్లబ్‌లపై యాజమాన్య హక్కులు వదులుకోవాలని ఆదేశిస్తూ.. రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు వీలు లేకుండా 57 క్లబ్‌లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతూ ఆదేశించింది.
సుమారు ఐదు నెలల సుదీర్ఘ కసరత్తు అనంతరం జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) దశ, దిశను మార్చివేసే నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌ క్రికెట్‌లో నెలకొన్న సంస్థాగత సమస్యలకు పరిష్కారం చూపుతూ.. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీకి అప్పగించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఎవరు వినియోగించుకోవాలి, ఎవరు పోటీ చేయాలనే అంశంలో జస్టిస్‌ లావు నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. బహుళ యాజమాన్యం, విరుద్ధ ప్రయోజనాల రీత్యా 57 క్లబ్‌లను ఓ పర్యాయం లేదా మూడేండ్ల పాటు ఎన్నికల ప్రక్రియకు దూరం చేస్తూ ఏకసభ్య కమిటీ తుది ఆదేశాలు జారీ చేసింది.
రూల్స్‌కు విరుద్ధం
జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ నివేదిక ప్రకారం బీసీసీఐలో రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు గుర్తింపు అందించే ప్రక్రియలో ప్రత్యేకించి ఎటువంటి నిబంధనలు లేవు. హెచ్‌సీఏలోనూ అదే తీరు. పాలకమండలి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇష్టారీతిన క్లబ్‌లకు అనుబంధ గుర్తింపు కల్పించారు. ఈ విషయంలో ఎటువంటి నిబంధనలు పాటించలేదు. ఈ క్రమంలో కొందరు వ్యక్తుల చేతుల్లోనే అధిక శాతం క్లబ్‌లు ఉన్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో ప్రతిష్టంభనకు, అపెక్స్‌ కౌన్సిల్‌లో అంతర్గత ఆధిపత్య పోరాటానికి దారితీస్తుంది. బహుళ యాజమాన్యంపై సుమారు 80 క్లబ్‌లకు నోటీసులు జారీ చేయగా.. అందులో 57 క్లబ్‌లు బహుళ యాజమాన్యంలో మగ్గుతున్నాయని ఏకసభ్య కమిటీ తేల్చింది. పురుషోత్తం అగర్వాల్‌, విజయానంద్‌, అర్షద్‌ అయూబ్‌, శేషు నారాయణ, జాన్‌ మనోజ్‌ సహా పలువురు వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల ద్వారా ఒకటి కంటే ఎక్కువ క్లబ్‌లపై అజమాయిషీ కలిగి ఉన్నారని ఏకసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఏ క్లబ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు, కుటుంబ సభ్యులు ఇతర క్లబ్‌లో ఎటువంటి భాగస్వామ్యం కలిగి ఉండకూడదని.. బహుళ క్లబ్‌ల యాజమాన్యాన్ని హెచ్‌సీఏ నిషేధించిందని నివేదికలో తెలిపారు. బహుళ క్లబ్‌ల యాజమాన్యంపై అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు రూపొందించిన పలు నిబంధనలను ఈ సందర్భంగా జస్టిస్‌ నాగేశ్వరరావు నివేదికలో ఉటంకించారు.
అవినితీకి ఆస్కారం
ఒకే వ్యక్తి లేదా కుటుంబం బహుళ క్లబ్‌లను నడిపిస్తున్నప్పుడు అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒకే వ్యక్తి ఆధీనంలోని రెండు క్లబ్‌ల నడుమ మ్యాచ్‌లో నమోదయ్యే గణాంకాలు, తుది ఫలితం ‘ఫెయిర్‌ ప్లే’కు అనుగుణంగా ఉండకపోవచ్చు. వ్యక్తిగత ప్రదర్శన, అంతిమ ఫలితం ఆ వ్యక్తుల ఇష్టాయిష్టాలకు లోబడే అవకాశం ఉందని నివేదికలో ఏకసభ్య కమిటీ పేర్కొంది. 57 క్లబ్‌లను రానున్న ఎన్నికల ప్రక్రియకు దూరం చేసినా.. ఆ క్లబ్‌లకు ఆడుతున్న క్రికెటర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆ క్లబ్‌లు యధావిధిగా జట్లను పంపించవచ్చని జస్టిస్‌ నాగేశ్వర రావు స్పష్టం చేశారు.
బుమ్రాకు సారథ్యం
ఐర్లాండ్‌ టూర్‌కు టీ20 జట్టు ఎంపిక
ముంబయి : స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా ఐర్లాండ్‌తో టీ20ల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకుని ఎన్‌సీఏలో పూర్తి స్థాయి బౌలింగ్‌ సాధన చేస్తున్న బుమ్రా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సెలక్షన్‌ కమిటీ టీ20 జట్టును సోమవారం ప్రకటించింది. తెలుగు తేజం తిలక్‌ వర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
టీ20 జట్టు : బుమ్రా (కెప్టెన్‌), గైక్వాడ్‌, జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌, జితేశ్‌ శర్మ, శివం దూబె, వాషింగ్టన్‌, షాబాజ్‌ , బిష్ణోరు, ప్రసిద్‌ కృష్ణ, అర్షదీప్‌ , ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌.
సిరీస్‌ దక్కేనా?
భారత్‌, విండీస్‌ మూడో వన్డే నేడు
టారౌబ : భారత్‌, విండీస్‌ సిరీస్‌ సమరానికి సై అంటున్నాయి. తొలి వన్డేలో భారత్‌ నెగ్గగా, రెండో వన్డేలో విండీస్‌ పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో నెగ్గిన సిరీస్‌ దక్కించుకోవాలని ఇరు జట్లు ఎదురు చూస్తున్నాయి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు నేడు బరిలోకి దిగనుండటంతో భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తుంది. రెండో వన్డేలో విజయంతో కరీబియన్‌ కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 2019 తర్వాత భారత్‌పై ఓ వన్డే విజయం సాధించిన విండీస్‌.. సిరీస్‌ విజయంతో సరికొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌, విండీస్‌ మూడో వన్డే రాత్రి 7 నుంచి డిడిస్పోర్ట్స్‌, జియో సినిమాలో ప్రసారం.