వైట్‌ కాలర్‌ కరప్షన్‌

పని చేయడానికి లంచం అడగడమే అవినీతి కాదు… జీతం తీసుకుంటూ సక్రమంగా పని చేయకపోవడం కూడా అవినీతే అంటాడు…అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త హెన్రీఫోర్ట్‌. వందేండ్ల క్రితం చెప్పిన ఈ మాట బ్యూరోక్రసికే కాదు, వ్యవస్థలు, వారిని మేనేజ్‌ చేసే వర్గాలకు కూడా వర్తిసుంది. కాంట్రాక్ట్‌లు పొంది, వాటికి డబ్బులు తీసుకుంటూ పని సక్రమంగా చేయక పోవడం నుంచి మొదలుకుని కంపెనీలు పెట్టి పన్నులు ఎగ్గొట్టే వారు, వారి అవినీతి, అక్రమాలకు అండంగా ఉండే ఉద్యోగస్వామ్యం, రాజకీయ నాయకులు, పార్టీలు కూడా…అవినీతి పరులే! తమ ద్వారా లబ్ది పొందిన వారి నుంచి నేరుగా డబ్బులు తీసుకోకుండా నీకు ‘ఇది నాకు..అదినీకు’ అనే (క్విడ్‌ కో ఫ్రో)విధానంతో ఆస్తులు, షేర్ల రూపంలో ప్రతిఫలం పొందడం గత కొన్నేండ్లుగా ఈ దేశంలో జరుగుతోంది. అయితే సర్కార్లు మారినప్పుడల్లా ప్రత్యర్థులు, వారి పార్టీలు విచారణ ఎదుర్కొంటున్న సంఘటనలు కోకొల్లలు. ప్రతికార రాజకీయాలకు అవకాశం లేకుండా పార్టీలు డబ్బులు పోగేసుకునేందుకు పుట్టిందే ఎలక్టోరల్‌ బాండ్లు. అధికార బీజేపీ నుంచి మొదలుకుని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు చిన్నాచితక పార్టీలు సైతం అవకాశం ఉన్న ప్రతి చోట నుంచి నిధులు సమీకరించుకున్నాయి. 2017లో ఈ బాండ్లు ప్రవేశ పెట్టినప్పటి నుంచి 15 ఫిబ్రవరి 2024 వరకు దాదాపు రూ.20 వేల కోట్లను బాండ్ల రూపంలో సేకరిం చాయి. ఈ వైట్‌ కాలర్‌ కరప్షన్‌ నేడు దేశంలో పెద్ద రాజకీయ దుమారానికి తెరతీసింది. ఈ విధానం దేశంలో అవినీతికి లైసెన్స్‌ ఇచ్చినట్టవుతుందని కన్నెర్రజేసిన సుప్రీంకోర్టు కొరఢా ఝులిపిం చింది. ఫలితంగా ఎలక్టోరల్‌ బాండ్ల వివాదం దేశ రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగా లను కుదిపేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశ అభివృద్ధికైనా, ఆర్థిక పతనానికైనా ప్రధాన కారణంగా అవినీతి నిలుస్తోంది. ఈ జాడ్యంపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 180 దేశాల్లో మొదటి స్థానంలో సోమాలియా నిలవగా, ఇండియా 93వ స్థానంలో ఉంది. 2022లో 85వ స్థానంలో ఉన్న భారత్‌, ఈ ఏడాది మరింత ముందుకు ఎగబాకింది. వ్యవస్థలను నడిపేవారు…నడిపించే వారు…పునర్నిర్మించే వారందరూ ఈ ఛట్రంలో బందిలై పోయారు. ఇప్పటికైనా మేల్కొనకుంటే భవిష్యత్‌లో దేశం అవినీతిలో టాప్‌గా నిలుస్తుంది… తస్మాత్‌ జాగ్రత్త!
– ఊరగొండ మల్లేశం