మెరిసేదంతా బంగారం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. పాలకుల విధానాలు, వారు చెప్పే మాటలకు ఇది సరిగ్గా సరిపోతుంది. గత పదేండ్ల బీఆర్‌ఎస్ ఏలుబడి అయినా.. ఇప్పటి పాలన అయినా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా చెప్పాలంటే దశాబ్దకాలంగా దేశాన్ని ఏలుతూ మొన్నటి బడ్జెట్‌లో తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వని మోడీ సర్కార్‌కు పైసామెత నూటికి రెండొందలపాళ్లు అతుకుతుంది.
‘బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు.. అది మన విలువల, ఆశల వ్యక్తీకరణ కూడా…’ 2024 -25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా విత్తమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్య ఇది. నిజమే… ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని తెలం గాణ ప్రజలు భావించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే స్వరాష్ట్రం ఏర్పాటైంది. పదేండ్ల కాలం గడిచిపోయింది. మరి నిజంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. నియామకాలకు సంబంధించి అనేకానేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకోవటంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గులాబీ పార్టీని ఇంటికి సాగనంపింది. నీళ్ల విషయంలో జరిగిన గోల్‌మాల్ అంతా కాళేశ్వరం నుంచి అసెంబ్లీ దాకా వరదై తాకింది. ఇప్పుడు మనం బడ్జెట్ ఊపులో ఉన్నాం కాబట్టి… నిధుల గురించి లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసర ముంది. బడ్జెట్‌ను ప్రతిపాదించిన ప్రభుత్వ విధానాలను, దాంట్లో ఏమీ లేదంటూ కొట్టిపారేసిన ప్రతిపక్ష నేతల తీరునూ ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉంది.
గత పదేండ్ల కాలంలో ఉన్నతాధికారులు చెప్పినా వినకుండా మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ ఊదరగొట్టిన గులాబీ బాస్ ఆఖరికి సుమారుగా ఏడు లక్షల కోట్ల అప్పును మన నెత్తిన పెట్టిపోయారు. వాటికి వడ్డీల రూపంలో నెలకు మరో రూ.18 వేల కోట్లను అంటగట్టారు. సుమారు రూ.40 వేల కోట్ల మేర వివిధ రంగాలు, శాఖలకు బకాయిలు పేరుకుపోతే… వాటి గురించి కిమ్మనకుండా ‘మీ సావు మీరు చావండం’టూ ‘కారు’ దిగి నెమ్మదిగా జారుకున్నారు. ఇప్పుడదే ‘కారు సారు…’ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ‘ఠాఠ్.. బడ్జెట్ లేదు, గిడ్జెట్ లేదు.. ఇదంతా పొలిటికల్ స్పీచ్, ఒట్టి గ్యాస్, అంతా ట్రాష్…’ అంటూ శాసనసభ మీడియా పాయింట్ వేదికగా ఒంటికాలి మీద శివాలెత్తారు. ఒకవైపు ఆర్థిక మంత్రి సభలో పద్దును ప్రతిపాదిస్తుండగానే, ఆయన చదవటం పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా మాజీ సీఎం ఈ విధంగా ‘మీడియా పాయింటెక్కటం’ చూసి రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. గతంలో ఇదే తరహాలో అప్పటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. వారిని అడుగు కూడా ముందుకు కదలనీయకుండా ఆపేశారు. ఈ నియమాలన్నీ ఈనాటి ప్రతిపక్ష నేతకు తెల్వదా..? ఇవన్నీ ఒక ఎత్తయితే బడ్జెట్‌ను చీల్చి చెండాడుతాం, విశ్వరూపం చూపిస్తాం, ప్రళయ గర్జన చేస్తామంటూ సినిమాల్లో బాలయ్యబాబులా డైలాగులు కొట్టటం మరీ విడ్డూరం. సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ నాయకుడిగా, పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా బడ్జెట్‌లోని అంశాలను శాస్త్రీయంగా, సహేతుకంగా, అర్థవంతంగా వివరించి, ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టాల్సిన పెద్ద మనిషి బాహుబలి డైలాగులు కొడితే ఏం లాభం? ఇక్కడ కావాల్సింది విశ్వరూపాలు, ప్రళయ గర్జనలు కాదు.. అర్థవంతమైన చర్చలు, సమస్యలకు పరిష్కారాలు.
ఇక పద్దును ప్రవేశపెట్టిన సర్కారేమీ తక్కువేం తినలేదు. వివిధ రంగాలకు కేటాయింపులు భారీగానే ఉన్నా, ఖర్చు ఏ మేరకు ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ వర్గ, ప్రజాసంఘాలు తమ తమ రంగాలకు కేటాయింపుల పట్ల పెదవి విరవడమే కాదు, ఆందోళనలకు పిలుపునివ్వటం గమనార్హం. ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం, రైతుబంధు(భరోసా)ను పెంచుతాం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకూ ఆర్థిక సాయమందిస్తాం, పింఛన్లను రూ.4వేలకు పెంచుతామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గట్టిగానే మాటలు చెప్పింది. కానీ భట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో మాత్రం ఆయా అంశాలకు కేటాయింపులు సరిగా లేకపోవటం గమనార్హం. పైగా అప్పులు, వాటికి వడ్డీలు, పేరుకు పోయిన బకాయిలు, కొత్త పథకాలకు నిధుల గురించి అడిగితే…’ఏం చెయ్య మంటారు మరి..?’ అంటూ ఉప ముఖ్యమంత్రి ఉసూరుమంటూ సమాధాన మివ్వటం ఆశ్చర్యకరమే. పదేండ్ల తెలంగాణ ఆర్థిక స్థితి గతులు, రుణ భారాల గురించి తెలుసుకోకుండానే కాంగ్రెస్ నేతలు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చారని భావించాలా? అంటూ జనం బుగ్గలు నొక్కుకుంటున్నారు.
గులాబీ, హస్తం పార్టీల తీరిలా ఉంటే…ఢిల్లీ గద్దెనెక్కిన కమలనాథుల రీతి మరీ దుర్మార్గంగా ఉంది. ‘చిన్నప్పుడు చింతకాయలమ్మి బతికినోడు, పెద్దయ్యాక ఆ కాయలేంటి వంకరటింకరగా ఉన్నాయంటూ’ వంకలు పెట్టాడంట. ఆ తరహాలో దేశాన్ని అప్పుల ఊబిలో దింపి, జనంపై ఆర్థిక భారాలు మోపి, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టి, వాటి సంగతే మరిచిన బీజేపీ నేతలు బండి సంజరు, కిషన్‌రెడ్డి, ఏలేటి మహేశ్వరరెడ్డి రాష్ట్ర బడ్జెట్‌పై విశ్లేషణలు చేస్తూ విరుచుకుపడటం గురివింద చందంగా ఉంది. అందుకే సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పినట్టు ‘నేతా నహీ.. నీతి బదలావో…’ అంటే నేతలను కాదు, వారి విధానాలను మార్చాలి. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి రక్షణకు సీపీఐ(ఎం) సన్నద్ధమవడం దాంట్లో భాగమే.