గోస వినేదెవరు..?

Who listens to Gosa..?– సమస్యల్ని పట్టించుకునే నాథుడేడి?
– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకే పరిమితం
– విమర్శల్లో కానరాని సహేతుకత
– మతం, సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం పైనే బీజేపీ గురి
ప్రజల సమస్యలను గాలికొదిలేసి …. ఎన్నికలే ఎజెండాగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిర్దిష్టమైన, సహేతుక విమర్శలను పక్కన పెట్టి ఆయా పార్టీల నేతలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలు, నిధులు, ప్రాజెక్టులకు జాతీయ హౌదా, విభజన హమీల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న వివక్షతను రెండు పార్టీలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లలేక పోయాయి. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కీచులాడుకుంటుంటే.. మతాన్ని, భావోద్వేగాలను, సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బీజేపీ బలపడేందకు ప్రయత్నిస్తోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ మధ్య నెలకొన్న వైరం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. చేసిన పనులు, చేస్తున్న పనులు, చేయాల్సిన పనుల గురించి కాకుండా వ్యక్తిగత విమర్శలకు ఆ రెండు పార్టీల నేతలు పదును పెడుతున్నారు. బీఆర్‌ఎస,్‌ కాంగ్రెస్‌ లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సూటిపోటి మాటలు, ఘాటైన విమర్శల నేపథ్యంలో ఉద్వేగ భరితమైన వాతావరణం నెలకొంది. కొందరైతే ఏకంగా బూతుపురాణం అందుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పీసీసీ అధ్యక్షులు కూడా అయిన సీఎం రేవంత్‌ రెడ్డిలు ఒకరి పై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రెండు పార్టీలకు చెందిన ప్రధాన నాయకులే పదునైన పరుష పదజాలాన్ని వాడుతుండటంతో ఎమ్మెల్యేలు సైతం వారినే అనుసరిస్తున్నారు. రానున్న కాషాయ ప్రమాదాన్ని పక్కన పెట్టి ఇరు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేండ్లు గడుస్తున్నప్పటికీ విభజన హామీలు పూర్తిగా అమలు కాలేదు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలు, ప్రాజెక్టులకు జాతీయ హౌదా, వివిధ పథకాల కేటాయింపులకు కేంద్రం మొండి చేయి చూపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధుల వరదను పారిస్తున్న మోడీ సర్కార్‌ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్షతను ప్రదర్శిసోంది. వీటిని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో ఇరు పార్టీలు ఘోర వైఫల్యం చెందాయి. పార్లమెంట్‌ ఎన్నికలు లౌకిక, ప్రజాస్వామికవాదులకు పెను సవాల్‌ విసరనున్నాయి. గతం కంటే ఎక్కువ ఓటింగ్‌ శాతంతో పాటు సీట్లను సాధించాలనే పట్టుదలతో బీజేపీ పావులు కదుపుతోంది.
రాష్ట్రానికి ప్రమాదకంం
బీజేపీ బలపడితే రాష్ట్రానికి ప్రమాదకరమని ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్చ, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాతావరణం కూడా హరించుకు పోతుందనే భయం వినిపిస్తోంది. ప్రశ్నించే గొంతుకలపై పోలీసులను ఆయుధంగా వాడుకుని ప్రజా ఉద్యమాలను అణచివేస్తారు. అలాంటి తరుణంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మద్య నడుస్తున్న యుద్దం బీజేపీకి లబ్ది చేకూరుతుందనే భయం వెంటాడుతోంది. మత ఘర్షణలు రెచ్చగొట్టి, హిందూ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటోంది. అదిలాబాద్‌ లాంటి మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం మతం పేరిట ప్రజలను విభజిస్తోంది. ఈ వాతావరణం తెలంగాణ భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారనుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న కీలక తరుణంలో ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బీజేపీ ఫాసిస్టు అనుకూల శక్తులు బలపడకుండా అడ్డుకోవాలని మేధావులు పిలుపు నిస్తుండటం గమనార్హం.