”బాటేంగెతో కటేంగే” ”ఏక్ హైతో సేఫ్ హై” ఈ రెండు నినాదాలు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందు నుంచి చాలా పాపులర్‌గా వినిపించాయి. వీటి అర్థం ఏమంటే ”విభజిస్తే విధ్వంసం” మరియు ”ఒకటిగా ఉంటే సురక్షితం”. ఈ నినాదాలను భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున రాజకీయ ఉపన్యాసాలుగా మార్చుకున్నది. వారి సోషల్ మీడియా మొత్తంలో కూడా ఇదే ప్రచారం హోరెత్తింది.. అసలీ నినాదాలు ఎందుకు వచ్చాయి? కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ, అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఈ దేశంలో 2021 నుంచి జరగాల్సిన జనాభా లెక్కలు జరగడం లేదని అందులో ముఖ్యంగా దాదాపు తొంబై ఏళ్ల కింద జరిగిన బీసీ కులగణన జరపాలని పట్టుబట్టారు. దీనిపై సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. పవన్ కె వర్మ వంటి పార్లమెంటేరియన్లు, అనేకమంది ప్రముఖులు కూడా ఈ కుల గణన జరపడంద్వారా సంక్షేమ కార్యక్రమాలకు సరైన దిశానిర్దేశాన్ని నిర్ణయించుకోవచ్చని కూడా సూచనలు చేశారు. దీంతో కులగణన జరపడం తప్పదేమో అన్న పరిస్థితి దాపురించడంతో, పైన తెలిపిన పెద్దలు ఈ నినాదాలను ఎత్తుకున్నారు. తద్వారా ”కులగణన అనేది విభజనతో సమానం అది విధ్వంసానికి దారితీస్తోంది” అంటూ ఒకటిగా ఉంటేనే ఐక్యంగా ఉంటామన్న ముక్తాయింపు పలుకుతూ ప్రచారాన్ని హౌరెత్తించారు. ఎవరిని వారుగా గుర్తించడమే విభజన వాదమైతే ఫలానా వాళ్లు మా వాళ్లే కాదు అనే ద్వేషభావన మరి దేని కిందికి వస్తుంది? మతం పేరు మీద దేశాన్ని పూర్తిగా రెండుగా చీల్చిన వాళ్ళే విభజన వాదాన్ని గురించి మాట్లాడటం విడ్డూరం. కేవలం మత విద్వేషంతోటే అధికారాన్ని చేపట్టిన సమూహం ఇప్పుడు కులగణన ప్రక్రియను ఒక విభజన వాదంగా చూపి ఒకటిగా ఉంటేనే ఐక్యంగా ఉంటామనే నినాదాన్ని ఇవ్వడం కేవలం రాజకీయ ప్రయోజనానికి ఏర్పడే చిల్లును పూడ్చుకోవడానికి జరిపే ప్రయత్నమే! సమాజంలో కులాలుగా ఏర్పడటానికి ఇప్పుడున్న వారెవ్వరూ కారణం కాదు, అది అనాది వాస్తవం. కానీ వాటి పర్యవసానాలను కొనసాగిస్తున్నది నేటి తరమే కదా! కులం ద్వారా సంక్రమిస్తున్న ఆస్తిపాస్తులనూ, అవకాశాలనూ అనుభవించడం ఒక ఎత్తయితే అనాది కాలంలో జరిగిన అన్యాయాన్ని పూడ్చే బాధ్యత మరచిపోతే ఎలా?
కుల గణన వద్దంటున్నారు గానీ కుల నిర్మూలన గురించి మాత్రం పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. కులం సృష్టించిన విధ్వంసాన్ని గానీ, అది ఇంకా ఇంకా చేస్తున్న అరాచకాన్ని గానీ ఈ సాంప్రదాయ వాదులెవ్వరూ ప్రస్తావించరు. కులాన్ని త్యజించండి అని మాత్రం చెప్పరు! మత ఐక్యత కోరుకునే వారు కనీసం మాట వరసకైనా ”మనమంతా హిందువులం మనకెందుకీ కులాలు” అని ఒక్కరైనా ఒక్కమాట చెప్పరు! ఇదిగో నేను కులాన్ని త్యజించానని అధికార పార్టీకి చెందిన ఒక్క నాయకుడైనా చెప్పరే! మాల మాదిగల ఇళ్ళన్నీ ఊరవతల, మురికి నీరు పారే పల్లపు వైపు విసిరేయబడ్డ వాస్తవాన్ని తెలిసి కూడా సవరించడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? పట్టణ ప్రాంతాల్లో కులం పేరు కారణంగా అద్దెకు ఇళ్ళు దొరకని ఉదంతాలెన్నో! చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి మేదరి వంటి అనేక బీసీ కులాలదీ ఇదే పరిస్థితి. నాతో జరిగిన ఒక సంభాషణలో ఈ కుల వ్యవస్థను సమర్థించే కొందరు చెప్పేదేమంటే ”సామాజిక సమస్యలకు అది సమాధానమిస్తుంది, తటస్థ స్థితి ఏర్పడినప్పుడు అగ్రకులం వ్యక్తి చెప్పింది పాటించడం ద్వారా సమస్యలు సమసిపోతాయి” అని. అంతటితో ఆగకుండా ”అంతెందుకు ఈ కుల వ్యవస్థ ఒక ఆఫీసులోని ఉద్యోగుల హైరార్కీ (పదవుల/హౌదాల క్రమం) అనుకోండి, క్రింది వారు పై వారి మాట విన్నట్టే) అంటూ మరో సమర్దన కూడా చేస్తారు. దానికి సమాధానంగా ”ఆఫీసుల్లో పదోన్నతులుంటాయి, అటెండరు కూడా ఆఫీసరౌతాడు, అలాంటి వెసులుబాటు ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో ఉన్నదా?” అంటూ ప్రశ్నిస్తే.. నోట్లో వెలక్కాయ పడ్డట్లు తికమక పడి పుట్టుకతో వచ్చిన కులాన్ని ఎవరూ కాదనగూడదు అని మరో సెంటిమెంటు విసురుతారు. ”కులముగాదు తన గుణమతనిని ప్రముఖుణ్ణి జేయు” అన్న కవుల మాటలు ఏ మాత్రం చెవినెక్కించుకోకుండా ఇంకా అవే ఆలోచనలతో సాగుతోందీ సమాజం! తృణమూల్ కాంగ్రెస్ పార్లమె ంటు సభ్యురాలు మహువా మొయిత్రా గారన్నట్టు ఇప్పుడు మతం పేర ఏకం చేసిన వాళ్ళే ఆ పని పూర్తైన మరుక్షణం కులం పేర ప్రజలను వేరు చేసే కుంపటి సిద్ధంగా ఉంచారు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్‌లోని ఒక న్యాయమూర్తి ”ఈ దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాల ప్రకారం పాలన జరిగితే తప్పేంటి (హిందువులు మెజారిటీ గాబట్టి వారికి అనూకూలంగా ఉండాలన్నది నీగూఢార్థం)” అనగానే అందరూ చంకలు గుద్దుకున్నారు. అలా మెజారిటీ ప్రకారం పరిపాలన సబబే అనుకుంటే ఒక గ్రామంలో ఫలానా కులం ఎక్కువ సంఖ్యలో ఉందనుకోండి.. అప్పుడు ఆ గ్రామానికి సదరు కులం పేర్లు పెడదామా? అక్కడి పరిపాలనంతా ఆ కులం వాళ్ళతోనే చేయిద్దామా? మాజీ డీజీపీ శ్రీ అరవిందరావ్ గారు నవంబరు 23న ఆంధ్రజ్యోతిలో ఓ వ్యాసం రాస్తూ ”ఇప్పుడిప్పుడే కులం ఆనవాళ్ళు చెరిగి పోతున్నాయి, మళ్ళీ కుల గణన చేసి విభజనకు అవకాశమివ్వద్దు” అని అభిప్రాయపడ్డారు. పోలీసు కేసుల్లో కుల ప్రస్తావన లేకుండానే ఎఫ్‌ఐఅర్‌లు రిజిష్టర్ అవుతున్నాయా? పెళ్ళిళ్ళు కుల ప్రస్తావన లేకుండానే జరుగుతున్నాయా? ఈ కులం కుంపటిలో కాలిపోతున్న ప్రేమ పెళ్ళిళ్ళు వీరికి కనపడటం లేదా ఏంటి?
కనీసం గుర్తించండి ప్లీజ్
”అగాధం ఎంత లోతుందో తెలియాలంటే కనీసం తొంగి చూసే ధైర్యమన్నా చేయాలి” అని కవి అలిసెట్టి ప్రభాకర్ అంటారు. ”ఆ అగాధంలోకి మేము వోర చూపైనా వేయము కానీ ఆ అగాధంలోంచే మీరు మాకు అండగా నిలవడానికి, మనమంత ఒక్కటే అని నినదించాలి” అన్నది నేటి పాలకుల నినాదం. 2016లో డీమానిటైజేషన్, 2017లో జీఎస్టీ, 2019లో కరోనా – ఈ మూడింటి ప్రభావాల వల్ల గత్యంతరం లేక వివక్షకు ఆలవాల మైన అదే కుల వృత్తుల్లోకి చేరుకుంటున్న వారి సంఖ్య పెరిగిందట. ప్రముఖ యూట్యూబర్ తులసి చందు కులప్రస్తావన గురించి చెబుతూ గూగుల్‌లో ఈ దేశంలోని కులం పేరు సర్చ్ చేస్తే అనేక కులాల స్థితిగతులను తెలిపే ఇమేజెస్ కనిపిస్తాయి. వాటిని బట్టి ఏ కులము ఏ మేర అభివృద్ధి చెంది ఉన్నదో, దళితులు ఆదివాసీలు ముఖ్యంగా ఎస్సీల స్థితిగతులు అత్యంత దయనీయంగా గూగుల్‌లో దర్శనమిస్తాయి. గూగుల్‌ను అడగకపోయినా మనకు కులాల యొక్క స్థాయి అర్థం కావాలంటే పెళ్ళిళ్లు పేరంటాలకు హాజరయ్యే మనుషులు ధరించే దుస్తులను బట్టి కూడా వారు ఏ కులానికి చెందిన వారో చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక ప్రభుత్వ పాఠశాలలు కుల ముఖచిత్రానికి అద్దం పడతాయి. ఒక్క సారి దర్శించంది.
మీ పదవులకేమీ ఢోకా వుండదు
బీసీ కుల గణన వొద్దనడానికి ప్రధాన కారణం కులాల వారిగా పదవుల పంపకాలు చేస్తే కష్టమౌతుందని! ఎందుకంటే పది శాతం కూడా లేని కులాలు తొంబై శాతం రాజకీయ మరియు పరిపాలనా పదవుల్లో వున్నారు. అందుకే కాబోలు ఓ ముసలి బీసీ నాయకుడికి పక్క రాష్ట్ర కోటాలోంచి రాజ్యసభ సభ్యత్వాన్ని కిరీటంగా ఇచ్చి ఢిల్లీ పెద్దలు నోరు మూయించినట్టున్నారు! కింది కులాల్లో పోరాటాలు ఊపందుకుంటే ఇలాంటి తాయిలాలతో సరిపెడతారు. కులం ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నదని తెలిసినా మత ఏకీకరణ కోసం జరుగుతున్న దుష్ప్రచారాలను భూజానేసుకుంటున్నది ఈ బీసీిలే! మనుషులందరికీ మైలను రుద్దే మతపరమైన ఏకీకరణకు మాములు జనమంతా బలిగావడం గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్లే! భారతదేశంలోని మత విద్వేషాలు రాజకీయ ప్రయోజనాలకోసం రెచ్చగొట్టబడుతున్నవి మాత్రమే. విద్వేషాలే లేవని భావించమనే ఈ కులం ప్రభావమే, అనాది అసమానతలకూ, నేటి వివక్షకూ ప్రత్యక్ష సాక్ష్యం. పదవుల వేటలో కింది కులాల వల్ల పెద్ద ప్రమాదం లేదు ఎందుకంటే వారికి ప్రహరీ నిర్మాణానికి రాళ్ళెత్తడం తప్ప పదవులను ఇడిసి పట్టుకునే చాణక్యత లేదు. కానీ కులగణన చేయడం ద్వారా సామాజిక ముఖచిత్రపు వాస్తవ కోణం తెలుస్తుంది. సరిదిద్దాలన్న ఆలోచన ఎవరికైనా, ఏనాడైనా ఏర్పడితే అది ఉపయోగపడుతుంది.
జి. తిరుపతయ్య
9951300016