ఎవరిది వికలత్వం!

Whose disability!‘అపజయాలు కలిగిన చోటే, గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుందీ’ అని ఒక గొప్ప మనోధైర్యాన్ని బలహీన, సామర్థ్యరహితుల్లో నింపుతుంది పాట. పాటే కాదు, కొందరు వైకల్యాలనధిగమించి సాధారణ బలవంతులు చేయలేని పనులనూ చేసి చరిత్రనూ సృష్టించారు. వారందరూ ఎప్పటికీ ప్రేరణనిస్తూనే ఉంటారు. రెండు చేతులూ లేకుండానే గొప్ప చిత్రకారులుగా వెలుగొందిన వారిని చూసే వున్నాము. కలాన్ని చేత పట్టుకుని రాయలేకపోయిన సిరిసిల్ల రాజేశ్వరి కవితలు కాళ్లతోనే రాసి ఎన్నో అవార్డులు గెలుచుకోలేదూ! శరీరంలో ఏదో ఒక అంగం పుట్టుకతోకానీ మధ్యలోకానీ బలహీనంగానో, అసలు లేకుండానో బతుకుతున్నవాళ్లు లక్షలాదిమంది ఉన్నారు. వారు మరింత పట్టుదలతో, సాకల్యవంతులకంటే కూడా రాణిస్తున్న వాళ్లు కోకొల్లలు. మానసిక దృఢత్వంతోనే ఇవన్నీ సాధ్యమవు తుంటాయి. అందుకనే కవి, చెమటనీరు చిందగా మార్పులేనిదీ, మారిపోనిదీ ఏదీలేదని చైతన్యాన్ని అందిస్తాడు.
అట్లా వైకల్యాలను అధిగమించి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్లు ఎంతోమందిని మనం ఉదహరించుకోవచ్చు. భక్త కవి సూరదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు మన దేశంలోనే గొప్ప కళాకారులు. కాలు లేకుండానే అద్భుతమైన నృత్యంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుధాచంద్రన్‌ (మయూరి సినిమా), రెండు కాళ్లు లేని జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రిగా దేశమంతా పర్యటించిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రపంచానికే గొప్ప శాస్త్రాన్ని తన పరిశోధన ద్వారా అందించిన స్టీఫెన్‌ హాకిన్స్‌ తొంబై శాతమూ వైకల్యంతో జీవించినవారే కదా! ప్రఖ్యాత సిద్ధాంతవేత్త ఆంటోనియోగ్రాంసీ, విశ్వకవి బైరాన్‌, ఇలా ఎందరినైనా వివరిస్తూపోవచ్చు. అంతెందుకు, మన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రపంచ విషయాల నుండి బస్తీ అంశాల వరకూ విశ్లేషణ చేసి సాకల్యంగా చెప్పడంలో దిట్ట కదా! సమ్మెట ఉమాదేవి రాసిన ‘నికోలస్‌ జేమ్స్‌ వుయిచిచ్‌ విజయగాధ’ చదివినా గానీ, స్వర్ణకిలారి వెలుగులోకి తెచ్చిన ఏడెండ్ల చిరుప్రాయంలోనే ఇండియన్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ‘ఎడ్కండ్‌ థామస్‌ క్లింట్‌’ చిత్రాలను చూసిన ఎంతో ప్రేరణ. ఇంతమంది ఇన్నిరకాలుగా తమ సామర్థ్యాలను నిరూపించుకుంటుంటే, వికలాంగులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉద్యోగాలకు పనికిరారని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ వాదించడం, వ్యాఖ్యానించడం అర్థరహితం, అవివేకమే అవుతుంది. మహారాష్ట్రలోని పూజాఖేద్కర్‌ అనే ఒక ఐఏఎస్‌ అధికారిణి, తన ఎంపిక సమయంలో వికలాంగురాలని, ఓబీసీ సర్టిఫికెట్లు తప్పుడివి సమర్పించిందనే సంఘటనను ఆధారం చేసుకుని మొత్తం అంగవైకల్యం కలిగిన వారిని కించపరిచే విధంగా, అవమానించడం దుర్మార్గం. ఆ పదవులకు వారు సరిపోయేదీ, సరిపోనిదీ నిర్ణయించడం ఆమె పని కాదు. పోనీ ఏ ఆధారంగా అలా వ్యాఖ్యానిస్తున్నదో కూడా తెలుపలేదు. ఉద్యోగులను నియమించే వ్యవస్థా, ప్రభుత్వమూ అనుమతించగా ఈమెకున్న ఇబ్బంది ఏమిటి? అసలు ఆ విధంగా ఒక నిర్ధారణకు ఎలా వస్తారు? ఇది కేవలం నోటి దురుసుతనం తప్ప మరేమీ కాదు. అంగవైకల్యం, రంగు, మతం, కులం, లింగ, ప్రాంత భేదాలతో మనుషులను అవమానించే చేష్టలు, మాటలు అమానవీయమైనవి. పరస్పర గౌరవాలతో బతకాల్సిన ఆధునిక వ్యవస్థలో ఇలాంటి ఆలోచనలకే తావుండకూడదు. ఎవరి సామర్థ్యాల మేరకు వారా పనులు సాగిస్తారు. అంగవైకల్యంతోనే ఎవరెస్టుపైకి ఎక్కిన కౌశిక్‌లా మీరెక్కగలరా? అని అడిగితే ఏం చెబుతారు!
అందుకనే ఆ ఐఏఎస్‌ అధికారిణి వ్యాఖ్యలకు, ఎంతోమంది ఐఏఎస్‌లకు శిక్షణనిస్తున్న బాలలత బాధపడ్డారు. ఇలాంటి అధికారులు ఉన్న కారణంగానే పన్నెండేండ్ల సివిల్‌ సర్వెంట్‌గా పనిచేసిన నేను రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. పదవిపొందాక వైకల్యం వస్తే, అప్పుడేం చేస్తారో చెప్పాలనీ ఆవిడ ప్రశ్నించారు. అంధులంటే ఎవరోకాదు, కళ్లుండీ వాస్తవాలను చూడలేని గర్వాంధులనే వ్యాఖ్య నిజమేననిపి స్తున్నది. తరతరాలుగా బలహీనులను హీనంగా చూడటమనేది కొనసాగుతూనే ఉన్నది. ఈ రోజు వైకల్యం ఉన్నవారికి రిజర్వేషన్లు నిరాకరించేవారే, రేపు దళిత, బలహీనవర్గాలకు ఆ సౌకర్యాలు అవసరం లేదని, వారు ఆ ఉద్యోగాలకు సరిపోరని కూడా వాదిస్తారు. అన్ని శారీరకాంగాలు సరిగా ఉన్నవాళ్లకు మానసికాంగం మానవీయంగా లేకపోవడం ఒక విషాదం. సామర్థ్యాలనేవి సంకల్పం, నిజాయితీ, చిత్తశుద్ధిలోంచి వస్తాయి. వీటితో పాటుగా సాటి మనుషుల పట్ల ప్రేమ, గౌరవాలు లేకుండా అన్ని శరీరాంగాలు ఉన్నా ఏమి ప్రయోజనం! ప్రభుత్వంలో ఒక స్థాయిలో పనిచేస్తున్న వాళ్లు విజ్ఞతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ‘కనపడే వైకల్యం కన్న, మదిలో వికలత్వం ఉన్న, అదే ప్రమాదకరమన్న’ కవి వాక్కులు నిత్యసత్యం.