– పంత్, అయ్యర్, రాహుల్‌పై ఫోకస్
– నేడు, రేపు ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముంగిట ఆటగాళ్ల మెగా వేలానికి సిద్ధమైంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించేందుకు పది ప్రాంఛైజీలు ఎదురుచూస్తున్నాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, జోశ్ బట్లర్‌లు నేడు వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. ఈసారి వేలంలో అంచనాలకు మించి ధర దక్కించుకుని, జాక్‌పాట్ కొట్టేదెవరనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
నవతెలంగాణ-జెడ్డా
2025 ఆటగాళ్ల వేలం వేదిక :
ఐపీఎల్ నిర్వాహకులు గత సీజన్‌లో దుబారులో ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఈసారి మెగా వేలానికి వేదికగా జెడ్డా నగరాన్ని ఎంచుకున్నారు. ఆది, సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వేలం ప్రక్రియ షురూ కానుంది. స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలో వేలం ప్రసారం అవుతుంది.
వేలంలో ఎంతమంది ఆటగాళ్లు :
2025 ఐపీఎల్ వేలంలో 574 మంది క్రికెటర్లు తమ అదష్టం పరీక్షించుకోనున్నారు. 1574 మంది క్రికెటర్లు వేలంలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకోగా.. 574 మందితో తుది జాబితాను సిద్ధం చేశారు. ఇందులో 366 మంది భారత, 208 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.
దిగ్గజ ప్లేయర్లు సైతం.. :
గతంలో మాదిరిగానే ఈసారి సైతం దిగ్గజ ప్లేయర్ల జాబితా వేలంలోకి రానుంది. రెండు సెట్ల పాటు దిగ్గజ ప్లేయర్లను వేలం వేయనున్నారు. జోశ్ బట్లర్, శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ కగిసో రబాడ, అర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్‌లు తొలి సెట్‌లో.. యుజ్వెంద్ర చాహల్, లియాం లివింగ్‌స్టోన్, డెవిడ్ మిల్లర్, కెఎల్ రాహుల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లు రెండో సెట్‌లో ఉన్నారు. దిగ్గజ ప్లేయర్లలో ఒకరు నేడు జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉందని అంచనా.
వేలంలో రానున్న బిగ్ క్రికెటర్లు! :
దిగ్గజ క్రికెటర్లు కాకుండా చాలామంది స్టార్ క్రికెటర్లు నేడు వేలంలోకి వస్తున్నారు. ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్వన్, హర్షల్ పటేల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కష్ణ, టి నటరాజన్, దేవదత్ పడిక్కల్, కనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ సహా పలువురు భారత క్రికెటర్లు మంచి ధర కోసం ఎదురుచూస్తున్నారు. విదేశీ క్రికెటర్లలో డెవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, డుప్లెసిస్, డెవాన్ కాన్వే, టిమ్ డెవిడ్, రచిన్ రవీంద్ర, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, శామ్ కరణ్, జానీ బెయిర్‌స్టోలు ప్రాంఛైజీలను ఆకర్షించనున్నారు.
వేలంలో బిడ్ ఎలా జరుగుతుంది? :
వేలం ప్రక్రియ దిగ్గజ ప్లేయర్లతో మొదలవుతుంది. 12 మంది క్రికెటర్లు ఈ జాబితాలో ఉన్నారు. అనతరం, క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడినవారు) ప్లేయర్లను బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, పేసర్లు, స్పిన్నర్లు, వికెట్ కీపర్లు వారీగా విభజించి వేలం వేస్తారు. ఆ తర్వాత అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడనివారు) ప్లేయర్లు వేలంలోకి వస్తారు. 116 మంది క్రికెటర్లను వేలం వేసిన తర్వాత.. వేలం స్పీడ్ పెరుగుతుంది. 117-574 వరకు ఎక్స్‌ప్రెస్ వేలం వేస్తారు. ఆ తర్వాత, వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఆసక్తిగల క్రికెటర్ల పేర్లను ప్రాంఛైజీలు ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండో రోజు మళ్లీ ఆ జాబితాను మాత్రమే వేలంలో వేస్తారు.
వేలంలో ఎంతమందిని తీసుకుంటారు? :
ఐపీఎల్ రూల్స్ ప్రకారం ప్రతి జట్టు కనిష్టంగా 18, గరిష్టంగా 25 మందిని తీసుకోవాలి. అంటే పది ప్రాంఛైజీలు 250 మందిని తీసుకోవచ్చు. రిటెన్షన్ష్‌తో ప్రాంఛైజీలు ఇప్పటికే 46 మందిని అట్టిపెట్టుకున్నాయి. దీంతో వేలంలో గరిష్టంగా 204 మందిని తీసుకొవచ్చు. ప్రతి ప్రాంఛైజీ గరిష్టంగా 8 మంది విదేశీ క్రికటర్లను ఎంచుకోవచ్చు. దీంతో 70 మంది విదేశీ క్రికెటర్లకు మాత్రమే నేడు అదష్టం వరించనుంది.
ఏ ప్రాంఛైజీ వద్ద ఎంత సొమ్ము ఉంది? :
వేలంలో ప్రతి ప్రాంఛైజీ రూ.120 కోట్లను ఖర్చు చేయవచ్చు. పంజాబ్ కింగ్స్ మినహా అన్ని ప్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించాయి. పంజాబ్ కింగ్స్ రూ.110.5 కోట్ల పర్సుతో వేలంలోకి రానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రూ.83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.73 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.69 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ రూ.69 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.55 కోట్లు, కోల్‌కత నైట్‌రైడర్స్ రూ.51 కోట్లు, ముంబయి ఇండియన్స్ రూ.45 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.45 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.41 కోట్లతో వేలంలోకి అడుగుపెడుతున్నాయి.