ఇటీవల గోవాలో జరిగిన జన జాగృతి సమితి అనే హిందుత్వ గ్రూపు సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హేతువాది,ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ధబోల్కర్, జర్నలిస్ట్ యాక్టివిస్ట్ గౌరీ లంకేశ్ హంతకుల తరుపున వాదించే న్యాయవాదులను సన్మానించి నట్టుగా వార్తను చూసాము.ఈ సమావేశాలు జూన్ 24 నుంచి 30 వరకు జరిగాయి. జన జాగఅతి సమితి అనే సంస్థ హిందూ తీవ్రవాద సంస్థగా ముద్రపడ్డ సనాతన సంస్థ నుంచి జాలువారిన మరొక రూపం. హంతకుల తరుపున వాదించే కర్నాటక, మహారాష్ట్ర న్యాయవాదులను సన్మానించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 101 కేసులు హైదరాబాద్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 18 కేసులు మత విద్వేషాలు రెచ్చగొట్టినవి కావటం గమనార్హం. ఇక హిందూ తీవ్రవాదానికి మాతృకయిన సనాతన సంస్థ పుట్టుక, కార్యకలాపాలను ఒకసారి పరిశీలిద్దాం.
హిందూ మతాన్ని ఉద్ధరించే ముసుగులో హిందుత్వ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే సనాతన సంస్థను గోవాకు చెందిన హిప్నోసిస్ట్, సైక్రియాటిస్ట్ డాక్టర్ జయంత్ అథవాలే 1999లో గోవా కేంద్రంగా ఎన్జీవో ముసుగులో రిజిస్టర్ చేశాడు.సనాతన సంస్థ హిందూ మత ప్రచారాన్ని సాగిస్తూ మత గ్రంథాలను ప్రచురిస్తూ సనాతన ప్రభాత్ అనే పక్ష పత్రికను వివిధ భాషల్లో ప్రచురిస్తూ, గురుపూర్ణిమ లాంటి వేడుకలను నిర్వహిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా కార్యకలాపాలను నిర్వహించటం పరిపాటి. మహారాష్ట్రలోని పన్వేల్ పట్టణంలో 2008లో సనాతన సంస్థకు చెందిన ఆరుగురు వ్యక్తులను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని అరెస్ట్ చేయటం జరిగింది. వీరు థానేలో, వశి ఆడిటోరియంలో, పన్వేల్ పట్టణంలోని సినిమా థియేటర్లో బాంబులు పెట్టి విధ్వంసం సృష్టించారు. ఇందులో ఇద్దరికీ 2011లో పది సంవత్సరాల సెషన్స్ కోర్ట్ విధించటం జరిగింది. గోవాలో కూడా బాంబులు పెట్టి విధ్వంసం సృష్టించినందుకు ఆరుగురిని ఉపా కింద అరెస్ట్ చేయగా ఎన్‌ఐఏ ఆధారాలు లేవని వదిలేసింది. ఇంకా ముగ్గురు నిందితులు ఇప్పటి వరకు పరారీలోనే వున్నారు.
ఆగష్టు 2018లో మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక స్క్వాడ్ (ఏటిఎస్) నల్లసొపారా, పూణే, షోలాపూర్‌లో సనాతన సంస్థ కార్యకర్తల ఇళ్లల్లో 20 బాంబులు, రెండు జెలిటిన్ స్టిక్స్, 4 ఎలక్ట్రానిక్, 22 నాన్ ఎలక్ట్రానిక్ డేటా నోటర్స్, 150 గ్రాముల పేలుడు పదార్దాలు, రెండు విషం అని రాసిన బుల్లెట్లు, బ్యాటరీలు, సోల్డరింగ్ పనిముట్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు.సెప్టెంబర్ 2016 లో మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక స్క్వాడ్ పన్వేల్‌లోని సనాతన సంస్థ అశ్రమలో 20 పెట్టెలలో నిల్వచేసిన నిషేదిత డ్రగ్స్‌తో పాటు నిద్రమాత్రలు,సప్రెసెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు మండులు సనాతన సంస్థ కార్యకర్తలను మానసికంగా కంట్రోల్ చేయటానికి వాడుతారని వారే చెప్పారు. ఇదేసందర్భలో ఏటిఎస్ అధికారి సీఎన్‌ఎన్, న్యూస్18తో హేతువాది, ఫిజిషియన్ ధబోల్కర్ హత్య తర్వాత మాట్లాడుతూ సనాతన సంస్థ కార్యకర్తలు బాగా బ్రెయిన్‌వాష్ చేయబడుతారని, వాళ్లతో నోరు విప్పించటం చాలా కష్టమని, కోడ్ భాషలో సమాచారం పంచుకుంటారని, వీరికి 84 పేజెస్ రూల్ బుక్ ఉంటుందని, బాగా మతోన్మాదంపై శిక్షణ ఇవ్వబడుతుందని, తుపాకీ పేల్చేముందు దేవుని పేరు ఉచ్చరించాలని ఆదేశాలున్నాయని విచారిస్తున్న ఆ అధికారి ఆ టీవీ ఛానెల్స్‌కు చెప్పటం జరిగింది.ఈ సంస్థ మహారాష్ట్రలోని నాలుగు ప్రముఖ పట్టణాల్లో, కర్నాటకలోని బెళగావి, బెంగళూరు లాంటి పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని అయన చెప్పాడు.
డాక్టర్ ధబోల్కర్ పూణే పట్టణంలో ప్రముఖ పేరున్న ఫిజిషియన్, ఈయన ప్రముఖ హేతువాది.రచయిత, అంధశ్రద్ద నిర్మూలన సంస్థను స్థాపించి మూఢనమ్మకాలకు, బాబాల మోసాలను, మత మౌడ్యాలను బట్టబయలు చేసేవాడు.పేరున్న యాక్టివిస్ట్. 20 జూన్ 2013న ఓంకారేశ్వరి ఆలయం దగ్గర ఇద్దరు పిస్తోలుతో కాల్చి చంపారు. గోవింద్ పన్సారే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ప్రముఖ కమ్యూనిస్ట్, ట్రేడ్ యూనియనిస్ట్ , ప్రముఖ హేతువాది, యాక్టివిస్ట్, రచయిత ఈయన రాసిన 17 శతాబ్దికి చెందిన శివాజీ బయోగ్రఫీ మరాఠి భాషలో శివాజీ కౌన్ హోతా బాగా ప్రసిద్ధి చెందింది.ఈయన్ను 16 ఫిబ్రవరి 2015న చంపివేశారు. ఎం.ఎం కల్బుర్గీ. కన్నడ భాషలో ప్రముఖ పండితుడు, రచయిత కన్నడ యూనివర్సిటీ, హంపికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసాడు.ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది.ఈయన వచన సాహిత్యములో దిట్ట.
ఈయన్ను 30 ఆగష్టు 2015 అయన ఇంటివద్ద ధార్వాడలో ‘గుర్తు తెలియని’ హంతకులు కాల్చి చంపారు. గౌరీలంకేశ్‌ను బెంగళూర్‌లోని ఆమె ఇంటి వద్దే 5, సెప్టెంబర్ నాడు పిస్తోల్‌తో కాల్చి చంపారు. ఈమె ప్రముఖ జర్నలిస్ట్, యాక్టీవిస్ట్. ఈమె ‘లంకేశ్’ పత్రిక ఎడిటర్. ఈమె మతోన్మాదానికి వ్యతిరేకంగా జనాన్ని జాగృతి చేస్తుండేవారు. ఈ నాలుగు హత్యల్లో వాడింది ఒకే పిస్తోలు అని చెబుతున్నారు.ఇటీవల ఒక్క ధబోల్కర్ హత్యపై సెషన్స్‌కోర్ట్ ఇద్దరికీ పదేండ్లు శిక్ష విధించింది.ఇందులో సిబిఐ పాత్రను, కేసును తప్పుతోవ పట్టేలా చేసినందుకు జడ్జి తీవ్రంగా తప్పు పట్టారు.
హత్య కావించబడ్డ ఈ నలుగురు హిందూ తీవ్రవాదాన్ని, మూఢనమ్మకాలను వ్యతిరేకించి ప్రజలను జాగృతం చేసినవారు. మనుధర్మాన్ని, అంధ విశ్వాసాలను ప్రేరేపించే సనాతన సంస్థ మతం ముసుగులో తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో మేధావులను సత్య చోదకులను ఖతం చేయటమే ఈ సంస్థ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఒకసందర్భంలో మాట్లాడుతూ తాను మానసిక ట్రీట్మెంట్ చేసిన రోగులలో 30శాతం మందికి హిందూ మత గ్రంథాలను, శ్లోకాలను చదివి వినిపిస్తే మానసిక రోగం తగ్గిందని, మందులకు తగ్గలేదని చెబుతాడు. అంటే ఈయన ఆ సనాతన సంస్థ ద్వారా సమాజానికి ఏమి చెబుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు.
ఇక మన రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ ఉన్నాడు. అంతకు ముందు 2009లో టీడీపీ నుంచి గోషామహల్ కార్పొరేటర్‌గా గెలిచాడు. ఈయన పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ నుండి హైదరాబా ద్‌కు వలసొచ్చారు.ఇతను ఇటీవల గోవాలో జరిగిన హిందూ జనజాగృతి సభలో మేధావుల హంతకుల తరుపున వకాల్తా పుచ్చుకున్న న్యాయవాదులను సన్మానించాడు. దీని ద్వారా సమాజానికి శాసనకర్తగా ఏమి చెప్పాలనుకుంటున్నాడో ప్రజలు గమనించాలి.
– డాక్టర్ కె.సుధాకర్ రెడ్డి