‘రిజర్వేషన్ అనేది రాజ్యాంగపరమైన హక్కు. మహిళల రిజర్వేషన్ కూడా అందులో భాగమే. వాటిని అమలు చేయకుండా ఎలా ఉంటారు? మీ సొంత పార్టీ బీజేపీ పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీకు అనుకూలంగా లేని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఎలాంటి చర్యలు ఉండటం లేదు’ అని జులై25న సుప్రీంకోర్టు నాగాలాండ్ స్థానిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన మహిళా రిజర్వేషన్లు అమలుపరచకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘మహిళల విద్య, ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థాయిపరంగా నాగాలాండ్ మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని అంగీకరించలేకపోతున్నాం’ అని పేర్కొంది. అయితే మహిళా సాధికారతపై ఎప్పుడూ జరిగే సదస్సుల్లో ప్రధాని ఎన్నో మాటలు చెబుతారు. తల్లులు, సోదరీమణుల సాధికారత కోసం తన ప్రభుత్వ హామీలు, ఉద్దేశాల గురించి చాలా వినిపిస్తారు. కానీ ఈసారి రిజర్వేషన్ల పరిధి పెంచే సమయం ఆసన్నమై నపుడు దుష్యంతుడులాగే ఆయన కూడా ఇచ్చిన మాట మర్చిపోయారు. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదా? అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఈనాటిది కాదు. ఇది 1974కు ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువుతీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందక ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. మరి కనీసం వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయ్యే లోగా అయినా ఈ బిల్లు ఆమోదం పొందుతుందా? అనేది నేడు అంతు చిక్కని ప్రశ్న.
నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చినా చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు. 1974లోనే దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది.తరువాత 1988లో జాతీయ మహిళా దష్టి కోణ పథకం (నేషనల్ పరస్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30శాతం స్థానాలను రిజర్వ్ చేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992-93 సంవత్సరాలలో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడో వంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. 1993లో జరిగిన రాజ్యాంగ సవరణ ఈ బిల్లుకు మూలం.మహిళా రిజర్వేషన్ బిల్లును 1996 సెప్టెంబర్ 12న అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ నేతత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికీ ఇది చట్ట రూపం దాల్చలేదు. లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో 33 శాతం స్థానాలను మహిళలకు కేటాయించాలని, చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని, వారి ప్రతిభా పాటవాలను దేశం కోసం, ప్రజల కోసం వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మూడు సార్వత్రిక ఎన్నికల్లో రొటేషనల్ ప్రాతిపదికపై ఈ రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. అంటే మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మాత్రమే ఒక నియోజకవర్గాన్ని మహిళలకు కేటాయిస్తారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును 1996 సెప్టెంబరు 12న అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ నేతత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ దీనికి ఆమోదం లభించలేదు. గీతా ముఖర్జీ నేతత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును నివేదించింది. ఈ కమిటీ తన నివేదికను 1996 డిసెంబరు 9న లోక్‌సభకు సమర్పించింది.1998 జూలై 13న ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అప్పటి న్యాయ శాఖ మంత్రి ఎం తంబిదురై సమాయత్తమవుతుండగా, ఆర్జేడీ ఎంపీ సురేంద్ర ప్రసాద్ యాదవ్ సభ వెల్‌లోకి వెళ్ళి స్పీకర్ జీఎంసీ బాలయోగి వద్దనున్న ఈ బిల్లు ప్రతులను లాక్కొని,చింపేశారు. ఈ బిల్లును 1999లో ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది,కానీ ఆమోదం లభించలేదు.2004 సార్వత్రిక ఎన్నికల్లో యుపిఎ కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు.తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే లోక్‌సభ, శాసన సభల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయిస్తూ చట్టం చేసేందుకు నాయకత్వం వహిస్తామని తెలిపింది. 2005లో బీజేపీ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే మహిళలకు కోటా కులం ప్రాతిపదికపై ఉండాలని బీజేపీ నేతలు కొందరు డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు కాలదోషం పట్టకూడదనే ఉద్దేశంతో 2008లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2010 మార్చి 9న ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సమాజ్‌వాదీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ నేతత్వంలోని ఆర్జేడీ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాయి. వెనుకబడిన కులాలకు చెందిన మహిళ లకు మహిళా రిజర్వేషన్లలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలని ఈ పార్టీలు పట్టుబట్టాయి. ప్రస్తుత కాలంలో అయితే లోక్‌సభలో ఆధిక్యతగల పార్టీయే దీనిని ఆమోదించే విధంగా పరిస్థితులను చక్కదిద్దగలుగుతుంది. దేశంలోని ప్రజా ఆస్తులు లాంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన ప్రధానిమోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షా తల్చుకుంటే దీనిని కూడా ఆమోదింపజేసి, ప్రజాదరణను సొంతం చేసుకోగలుగుతారు.
మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఓబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులున్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పినదాని ప్రకారం ఎగువ నిచ్చెన మెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమేనని వాదించిన వారూ లేకపోలేదు. పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరోవైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు, పౌరసేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి.గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీ చేసే వారిలో నిర్ణీత శాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శకూడా వచ్చింది.
చట్టపరంగా లేదా రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవటం మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజా స్వామిక దేశమని ప్రచారం చేసుకోవటాన్ని అపహాస్యం చేస్తున్నది. అన్నింటికంటే పెద్ద వైరుధ్యం, సిగ్గుచేటైన అంశం ఏమంటే ఎన్నికలలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు ముందుకు రాని పార్టీలు మరోవైపున నేరచరితులకు పెద్ద పీట వేసేందుకు ముందుకు వస్తున్నాయి.ఎడిఆర్ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43 శాతం మంది ఉన్నారు. లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. ఇలాంటి నాయకుల్ని చట్టసభలకు పంపడం బదులు మహిళలకు అవకాశం ఇస్తే వారు కూడా రాజకీయాల్లో రాణిస్తారు కదా అని కూడా దేశంలో చర్చ జరుగుతున్నది. పాలరాతి బొమ్మైనా,పార్లమెంట్ భవన మైనా వాడు కడితేనే ఆకారం, చుడితేనే శ్రీకారం అని అలిశెట్టి ప్రభాకర్ అన్నట్టు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం చర్చకు రాక మునుపే అరగంటలో మూడు బిల్లులను ఎలాంటి చర్చ, ఓటింగ్ లేకుండానే మొన్న శుక్రవారం లోక్‌సభలో ఆమోదింపజేసుకుంది. అలాంటిది ఇప్పుడు బీజేపీ తలచుకుంటే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అడ్డం పడేదెవరు?
నాదెండ్ల శ్రీనివాస్ సెల్: 9676407140