ఎవరు దోషి?

అతను నిర్దోషి అని నాకే కాదు నీకూ తెలుసు
నీది కేవలం ఉన్మాదం కాదని
నీకే కాదు నాకూ తెలుసు
నీ మాయల మాంత్రిక
డిజిటల్‌ భూతపు నోట్ల కత్తిరింపులైనా
మేము బీళ్ళు దున్నుతున్నప్పుడు
నువ్వు నాగళ్ళ మొనలు విరవడమైనా
తలాపున మొలిచిన హత్రాస్‌ గుడిలో
పదేండ్ల పసిపాప గర్భాల్ని చీల్చడమైనా
అసహాయుల గుండెల మీద
నీ బుల్‌డోజర్‌ విషనాగుల విధ్వంస నత్యమైనా
ఎదుట కనిపించే దశ్యం ఒక్కటే నిజం కాదని
కనిపించని యవనికల మాటున దాచిన
కుట్రల కత్తులు వేరొకటని
నాకు తెలుసనే విషయం నీకు తెలవడం లేదు…
ఈ మట్టి బిడ్డలను మా నేలనుంచి పరాయీకరించే
నీ ‘కా’ వు కావు అరుపులు
కేవలం కాషాయీకరణ మాత్రమే కాదనీ
కాశ్మీర్‌ ను విడగొట్టి పడగొట్టే నీ పెట్టుబడి కుట్ర
గోముఖ వ్యాఘ్ర శ్యాముని అర్జీకి
నువ్వు సమర్పించే వాగ్థాన సంరంభ
ప్రసాదం మాత్రమే కాదనీ
రామరాజ్య ప్రేలాపనలో
రామ్‌ లల్లా ప్రతిష్ఠాపనలో
మూర్తీభవించిన మతవాద మూఢత్వం మాత్రమే కాదనీ
నాకు తెలుసనే విషయం నీకు తెలవడం లేదు
ఈ పది హేమంతాల ఉన్మాదపు మండే ఎండలకు
హిందూ సంద్రపు హదయంలో మానవత ఆవిరయ్యింది
నీ దేవుడి సాక్షిగా చీల్చబడ్డ కతువా మానాల గాయాలకు
భీతిల్లిన వక్షాలు పుష్పవతులవ్వడం మానేసినయి
నీ రాకాసి మూకల దాడులకు గుండె పగిలిన
నా లక్షల హెక్టార్ల ఛాతీ మీది పర్వతశ్రేణులు
వుట్టి రాతి కుప్పలైనవి
అమత్‌ భారత్‌, అచ్ఛేదిన్‌, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌
మేడిపండు విప్పినందుకు
మా విజ్ఞులు కల్బుర్గిలైనరు, గౌరీ లంకేష్‌ లైనరు
డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ లైనరు…
అయినా, మా సమూహ గానం ఆగదు
మా సామాజిక చేతన ఆగదు
ఎప్పటికైనా నాటకానికి తెరపడుతుంది
నీ ఏకపాత్రాభినయం ముగుస్తుంది
– డా|| కాసుల లింగారెడ్డి