ఇజ్రాయిల్‌ – హమాస్‌: ఉగ్రవాది ఎవరు?

ఇజ్రాయిల్‌ - హమాస్‌: ఉగ్రవాది ఎవరు?అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయిల్‌ కట్టుకున్న నిర్భేద్య మయిన గేట్లు, గోడలని పాలస్తీనా రాజ్యంలోని గాజా ప్రాంతాన్ని పరిపాలించే హమాస్‌కి చెందిన సాయుధులు (పాలస్తీనాకి సైన్యం లేదు) ఛేదించినప్పుడు జరిగిన పాశవికమైన కొట్లాటల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ సాయుధులు రెండు వందల మందిని కిడ్నాప్‌ చేసి తీసుకుపోయి వారిని వదలటానికి కొన్ని షరతులు విధించారు. ‘ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై తన దురాక్రమణకి, గాజాపై పద్దెనిమిదేండ్ల నుండి నడుస్తున్న దిగ్భం ధానికి అంతం పలకాలి. పాలస్తీనా స్వతంత్ర రాజ్య సరిహద్దుల్ని గుర్తించి తన హద్దుల్లో తానుం డాలి. ఇప్పటివరకూ ఇజ్రాయిల్‌ కిడ్నాప్‌ చేసుకెళ్లి సైనిక కోర్టుల్లో విచారణ జరిపి, లేక అసలు విచారణ లేకుండానే జైళ్లల్లో కుక్కి పెట్టిన ఆరు వేలమంది పాలస్తీనా వాసులని (పిల్లలు, కవులు, స్త్రీలు, ఎన్నికయిన రాజకీయ ప్రతినిధులతో సహా) విడిచి పెట్టాలి. అంతేకాక, తనకిష్టమొచ్చినప్పుడల్లా పాలస్తీనా ప్రాంతా లపై, ప్రజలపై జరిపే మారణకాండల్ని, దాడుల్ని ఆపె య్యాలి.’ ఈ షరతులతో గత ఆరునెలల్లో అనేక సార్లు హమాస్‌ తన దగ్గరున్న బందీలని విడుదల చేయడానికి ముందు కొచ్చింది. ఖతార్‌, ఈజిప్ట్‌ ప్రభుత్వాలు మధ్యవర్తులుగా ఇజ్రాయిల్‌ పభుత్వంతో చర్చలు జరిపాయి, కానీ ఇప్పటి వరకూ ఇజ్రా యిల్‌, నెతన్యాహూ, అతని పార్టీ ఏ చర్చలనీ ముందుకు సాగనివ్వలేదు.
అప్పటికే అనేక రకాలుగా జన సమ్మతి కోల్పోయిన అతివాద బెంజమిన్‌ నెతన్యాహూ ప్రభుత్వం అక్టోబర్‌ 7న జరిగిన దాడుల్ని దేశం మీద, యూదు అస్తిత్వం మీద దాడిగా చూపించి కనీవినీ ఎరుగని రీతిలో 25 మైళ్ళ గాజా అంతు చూస్తామని (బిబ్లికల్‌ భాషలో ఆర్మగెడాన్‌) ప్రకటించింది. అన్నట్లుగానే గాజా ప్రాంతం మీద వేల టన్నుల బాంబులు కురిపించింది. 14 లక్షల మంది ప్రజల్ని ఇల్లూ, వాకిలీ, ఊరూ అన్నీ వదిలేసి ఉత్తర గాజా నుండి పొమ్మంది. అక్కడ నుండి ఖాన్‌ యూనిస్‌ ప్రాంతానికి, తర్వాత రఫాకి పొమ్మని, ఇప్పుడు రఫా మీద బాంబింగ్‌ మొదలుపెట్టింది. రఫా పక్కనే ఈజిప్టు సరిహద్దులు. లక్షలాది ప్రజల్ని అటు నుండి ఇటూ, ఇటు నుండి అటూ తరిమికొడుతూ, తిరిగే వాళ్ళ మీద బాంబులేస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో అనేక జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, కవులు, రాజకీయ నాయకులని, ఎవరయితే సమాజ మనుగడకి, అస్తిత్వానికి అవసరమో వారినీ, వారి కుటుంబాలని గురి చూసి చంపుతోంది. ఒక ప్రజా అస్తిత్వానికి అవసరమయ్యే ఆస్పత్రులు, యూనివర్సిటీలు, ఫ్యాక్టరీలు, స్కూళ్ళు, శ్మశానవాటికలతో సహా నామరూపాలు లేకుండా నాశనం చేసేసింది. రక్షిత నీటి సరఫరా, వ్యర్ధ పదార్ధాల రీసైక్లింగ్‌ సదుపాయాల పైనా బాంబులు వేసింది.
ఐక్య రాజ్య సమితి పంపించిన తిండి సామాగ్రి వచ్చినప్పుడు తీసుకోవటానికి వచ్చిన ప్రజల మీద కాల్పులు జరిపి వందలాది మందిని చంపింది. ఆ సిబ్బంది పైన దాడులు చేస్తోంది. హాస్పిటల్లో రోగుల్ని, వారిని వదలి వెళ్లలేమన్న డాక్టర్లని, చిత్ర హింసలు పెట్టి, కాళ్లూ చేతులూ కట్టేసి, బతికున్న వారిని పాతి పెట్టి వారిపైన బుల్డోజర్లు నడిపింది. బయటి నుండి వచ్చే సహాయ సామాగ్రిని రాకుండా గేట్లు మూసేసింది. 20 లక్షల జనాభాని (హైదరాబాద్‌లో పావు వంతు చోటులో) ఏ సౌకర్యం లేకుండా భయంకరంగా, బలవంతంగా మాడ్చి చంపాలనే ప్రయత్నంలో వుంది. పదేండ్లలో ఇరాక్‌ మీద, ఇరవై ఏండ్లలో అప్ఘ్గనిస్తాన్‌ మీద అమెరికా వేసినన్ని బాంబులు ఇప్ప టికే వేసేసింది. అన్నేండ్లలో అమెరికా చంపినంతమంది పిల్లల్ని ఆరు నెలల్లో చంపేసింది. ఇజ్రాయిల్‌ సైన్యం తాము చేస్తున్న తాము ఘోరాలని తామే షూట్‌ చేసి అన్ని సోషల్‌ మీడియాలో పెట్టుకుంటున్నారు. పాలస్తీనా బందీలని బట్టలువిప్పి, మంచా లకి కట్టేసి, నెలల తరబడి తిండి పెట్టకుండా కొట్టి, ఆడవాళ్ళపై లైంగికంగా దాడులు చేసి, చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. రోజుకొక మాస్‌ గ్రేవ్‌ (సమూహ సమాధి) బయట పడుతోంది. వారు చేసే ఘోరాలకి అంతూ పొంతూ లేకుండా వుంది.
దీనికంతా కారణం హమాస్‌ అక్టోబర్‌ 7న పాల్పడిన చర్యలు అంటూ ఒక ఉధృతమైన ప్రచార యుద్ధాన్ని ప్రపంచం మీదికి వదిలింది. నలభై మంది పసిపిల్లల కంఠాలు తెగ కోశారని, ఆడవాళ్లపై పాశవికంగా అత్యాచారాలు జరిపారని అంటూ అబద్ధపు డిజిటల్‌ వీడియోల్ని తయారు చేసింది. అయితే ఇజ్రాయిల్‌ కె చెందిన హార్ట్స్‌ దిన పత్రిక కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే చనిపోయారని, చనిపోయిన స్త్రీలలో ఎవరూ అత్యాచారానికి గురి కాలేదని తన పరిశోధనా వ్యాసంలో ప్రచురించింది. పోలీసు అధికారులు దాన్ని ధ్రువ పరిచారు. ఆ రోజున చనిపోయిన 1200 మందిలో దాదాపు 400లకు పైగా పౌరులు ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో చనిపోయారని ఆ ప్రభుత్వ దర్యాప్తులోనే తేలింది. పెద్దగా బయటికి రాని ఇజ్రాయిల్‌ విధానం ఏంటంటే – బందీల గురించి పట్టించుకోవద్డు అనే హానిబాల్‌ విధానం. బందీలపై సంప్రదింపులు బలహీనతకి దారి తీస్తాయని, పాలస్తీనా రాజకీయ ప్రతినిధుల డిమాండ్లకు అనవసరంగా ఒప్పుకోవాల్సి వస్తుందని, ఎవరయినా బందీలయితే వారిని చనిపోయిన వాళ్ల కింద పరిగణించాలన్నదే ఈ విధాన సారాంశం. అందువల్లే బందీల గురించిన ఏ చర్చలనూ ముందుకు పోనివ్వలేదు. హమాస్‌ వదిలేసిన ఇద్దరు బందీలని, తెల్ల జండాలు ఊపుతూ వచ్చిన వారిని, ఇజ్రాయిల్‌ సైన్యం కాల్చి చంపేసింది. గాజా మీద చేసిన దాడుల్లో చాలా మంది బందీలు చనిపోయారు. తమ వాళ్లని తీసుకురావాలని నిరసనలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులపై, యుద్ధం ఆపాలనే వాళ్లపై ఇజ్రాయిల్‌ పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారు.
హమాస్‌ గురించిన ప్రచార ఉధృతంలో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ 1948 నుండి చేస్తూ వస్తున్న, ఇప్పుడు చేస్తున్న ఘోరాలు ఎంత మరుగు పడిపోయాయంటే పాలస్తీనా ప్రజలకి దశాబ్దాల పాటు మద్దతిచ్చిన మన దేశంలో కూడా ఇజ్రాయిల్‌కి వెళ్లి దాని తరఫున పోరాటం చేస్తాం అనే వాళ్ళు, ‘ముస్లిములు ఎక్కడుంటే అక్కడ అలజడి ఉంటుంది’ అనే వాళ్ళు, ‘టెర్రరిస్టు లంటే ముస్లింలు’ అనే వాళ్ళు కూడా తయారయ్యారు. ‘టెర్ర రిజం’ అనే బూచి గత ముప్ఫయి ఏండ్లుగా తెల్లజాతి దేశాల ప్రభుత్వాలకి (వారి తోకల్లాంటి ఇతర ప్రభుత్వాలకి) ప్రధానంగా ముస్లిం దేశాలయిన ఇరాక్‌, ఆప్ఘానిస్తాన్‌, సిరియా, లిబియా, లెబనాన్‌దేశాలపై అమెరికా నేతృత్వంలో జరిపిన అనేక మారణ హోమాలకి జన సమ్మతి (కన్సెన్ట్‌)ని ప్రభావశీలంగా కూడగట్టు కోవటానికి పనికొచ్చింది. ‘టెర్రరిజం’కి ఇస్లాం మతానికీ అవినాభావ బంధాలున్నాయనే నమ్మకాన్ని, ముస్లిం ద్వేష ప్రచారం (ఇస్లామోఫోబియా)లో భాగంగా అనేక దేశాల ప్రజల్లో అనేక సమాచార సాధనాల ద్వారా చొప్పించారు. ఇజ్రాయిల్‌ పాత్ర ఇందులో కీలకం. అరబ్బు దేశాల్లో జాతీయతా భావాలుం డటం వల్ల తన ఉనికికే ముప్పొస్తుందనే జ్ఞానం ఇజ్రాయిల ్‌కుంది. దానితో పాటుగా ప్రపంచంపై తన ఆధిప త్యం కోసం, చమురు నిల్వల కోసం అమెరికా, దాని మిత్ర దేశా లు ఇజ్రాయి ల్‌ ఏం చేసినా దాన్ని వెనకేసుకుంటూ రావటంతో, ఎవరూ తననేమీ చెయ్యలేరని అంతులేని ధైర్యం దానికి వచ్చింది.
ఉగ్రవాదం అనే ముద్రని అన్ని రకాల సాయుధ పోరాటా లకు, సంస్థలకి, గుంపులకి వాడటం 2001లో న్యూయార్క్‌లో ట్విన్‌ టవర్ల పై దాడి జరిగిన తర్వాత గత రెండు దశాబ్దాలలో పెరిగింది. వివిధ రకాల భావజాలాలతో, ఉద్దేశాలతో, లక్ష్యాలతో రక రకాల దేశాల్లో ఆయా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా లేక స్వతంత్రం కావాలని, లేదా దేశాల కతీతంగా పనిచేసే సాయుధ పోరాటాలు, సంస్థలన్నింటినీ కలిపి ‘ఉగ్రవాదం’ అని వర్ణించటం అమెరికా నేతృత్వంలో జరిగిన గ్లోబల్‌ ప్రచార ఫలితమే. అమెరికా కూడా అంతర్జాతీయ ఉగ్రవాది అని నిషేధించి, యుద్ధం చేసిన తాలిబాన్‌ సంస్థకే అప్ఘనిస్తాన్‌ని అప్పగించి అక్కడి నుండి వైదొలగింది. ఇజ్రాయిల్‌ కూడా పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ని ఉగ్రవాది అనేది, ఆ తర్వాత దాని ఎన్నికల అంగమైన ఫతాని దెబ్బకొట్టటానికి హమాస్‌ని వెనుక నుంచి ప్రోత్సహించింది కానీ గాజా ప్రజలు వారిని 2006లో ఎన్నుకున్న తర్వాత టెర్రరిస్టులని ముద్ర వేసింది. ప్రభుత్వాలు తాము చేసే హింస సాధికారమైందనీ, ఇతరులు చేసే హింసని ఉగ్రవాదమనీ ఆయా దేశ ప్రభుత్వాలు ముద్ర వేస్తాయని గుర్తుంచుకుంటే టెర్రరిజం చుట్టూ నడిచే రాజకీయ ఎత్తుగడలు అర్ధమవుతాయి.
హమాస్‌పై ఉగ్రవాద ముద్ర వేసే ముందు అప్ఘనిస్తాన్‌లో బిన్‌లాడెన్‌ ఉన్నాడని బాంబులు వేసిన అమెరికాను ఎలా చూడాలి? ఇరాక్‌లో అణుబాంబులు, మారణాయుధాలు ఉన్నాయని యుద్ధానికి దిగి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే ఉరితీయడాన్ని ఏ చర్య కింద పరిగణించాలి? ఇప్పుడు హమాస్‌ నెపంతో ఇజ్రాయిల్‌కు దన్నుగా నిలిచి గాజాపై టన్నులకొద్దీ బాంబులేసి వేలాది మందిని చంపటాన్ని ఏమనాలి? లక్షలాది మంది నిరాశ్రయుల్ని చేసి, ఆర్ధికంగా దిగ్బంధించి ప్రజలు అత్యవసరమైన మందులు దొరక్కపోవడం, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిని కల్పించడాన్ని ఏ చట్టంకింద చూడాలి? పాలస్తీనా పౌరులను అత్యంత క్రూరంగా హింసించి, కసితో, పగతో, తీరని ప్రతీకారేచ్చతో, అంతులేని దుర్మార్గంతో ప్రవర్తించటాన్ని ఏ ఉగ్రవాదంగా పిలవాలి?
ఎ. సునీత
9490804098