కరీంనగర్‌ కాంగ్రెస్‌ ‘ఫైటర్‌’ ఎవరో..?

Who is the Karimnagar Congress 'fighter'?– ఏఐసీసీ లెవల్లో బొమ్మకల్‌ సర్పంచ్‌ ప్రయత్నాలు
– టికెట్‌ ధీమాతోనే హస్తం గూటికి జయపాల్‌రెడ్డి
– సైలెంట్‌ మోడ్‌లో ఎమ్మెస్సార్‌ మనువడు రోహిత్‌రావు
– కాంగ్రెస్‌ గ్యారంటీకార్డు ప్రచారంలో నరేందర్‌రెడ్డి
– రహస్య సర్వే.. కేడర్‌పై అధిష్టానం నజర్‌
– టీపీసీసీ ఫస్ట్‌ లిస్టులో ‘గంగుల’ను ఢకొీట్టే నాయకుడు తేలేనా?
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌ కాంగ్రెస్‌లో టికెట్లపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. కొందరు ప్రచారంలోకి దిగేశారు. అధికార పార్టీ నేత మంత్రి గంగుల కమలాకర్‌ను ఢకొీట్టే ఫైటర్‌ ఎవరా? అన్న చర్చ సాగుతున్న క్రమంలో హస్తం టికెట్‌ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు పడ్డారు. అందులోనూ ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమళ్ల శ్రీనివాస్‌ ఢిల్లీలో మకాంవేసి ఏఐసీసీ లెవల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు ఆర్థికంగా బలంగా ఉన్న మైత్రిసంస్థల చైర్మెన్‌ జయపాల్‌రెడ్డి టిక్కెట్‌ ధీమాతోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇంకోవైపు మొదట్నుంచీ కాంగ్రెస్‌ వాయిస్‌ వినిపిస్తున్న పార్టీ కరీంనగర్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తనకే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రచారంలో దిగారు. మరోవైపు సీఎం అన్న కూతురు రమ్యారావు సైతం కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డుతో జనంలో తిరుగుతున్నారు.
2004 నుంచి 2009 వరకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాబల్యాన్ని బలంగా చాటుకుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కీలకమైన నాయకులు టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో క్షేత్రస్థాయిలో బాగా బలహీనపడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాతి పరిణామాలు, ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సైలెండ్‌మోడ్‌లోకి వెళ్లిపోవడం.. కర్నాటక గెలుపు, ఇటీవల పార్టీ అధినేత్రి సోనియా రాకతో పుంజుకుంది. ప్రస్తుతం ఆ పార్టీలో నియోజకవర్గాల వారీగా టిక్కెట్‌ ఆశించే వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అందులో కరీంనగర్‌ సెగ్మెంట్‌ లో 15 అప్లికేషన్లు రావడం గమనార్హం. కానీ టిక్కెట్‌ తమకే వస్తుని ఐదారుగురు మాత్రమే తమ వాణి వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ మొదట్నుంచీ అధికార పార్టీపై ఫైట్‌ చేస్తున్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పిలుపునందుకుని కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తూ యాక్టీవ్‌రోల్‌లో కనిపించేవారు. పార్టీ విధేయుడిగా పని చేసిన తనకే టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూనే పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలోనే కనిపించే సీఎం అన్న కూతురు రమ్యారావు కూడా పార్టీ గ్యారంటీ స్కీం పత్రాలను పట్టుకుని రెండ్రోజులుగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు మొన్నటివరకూ యాక్టీవ్‌గా కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, దివంగత ఎమ్మెస్సార్‌ మనువడు రోహిత్‌రావు పక్షం రోజులుగా సైలెండ్‌మోడ్‌లోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. దీంతో ప్రధానంగా మైత్రీచానెల్‌ చైర్మెన్‌ జయపాల్‌రెడ్డి, బొమ్మకల్‌ సర్పంచ్‌ శ్రీనివాస్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పార్టీ హైకమాండ్‌ రహస్య సర్వే చేయిస్తోంది. పార్టీ కేడర్‌ అడుగులపైనా నజర్‌ పెట్టింది.
మూడ్రోజులుగా ఢిల్లీలోనే ‘పురుమళ్ల’
బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ఈనెల 23న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పురుమళ్ల శ్రీనివాస్‌ మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉండి ఏఐసీసీ లెవల్లో టిక్కెట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిద్దరు ఆశావహులు తమ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మిగతా నాయకులు టీపీసీసీ పెద్దల ఆశీర్వాదాన్నే నమ్ముకున్నారు. కానీ పురుమళ్ల మాత్రం ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. మిగతా ఢిల్లీ స్థాయి నేతల అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తూ కలుస్తుండటం ఇప్పుడు కరీంనగర్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి పార్టీ కేడర్‌ను, టీపీసీసీని కాదని ఏఐసీసీ లెవల్లో నెరుపుతున్న ప్రయత్నం హాట్‌టాపిక్‌గా మారింది.
టికెట్‌ ధీమాతోనే జైపాల్‌రెడ్డి చేరిక..
మైత్రి గ్రూప్స్‌ చైర్మెన్‌ కొత్త జైపాల్‌ రెడ్డి తొలుత బీజేపీ నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ తన అనుచరగణంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. టిక్కెట్‌ ధీమాతోనే హస్తం గూటికి చేరిన ఆయన అదే రోజు భారీ కాన్వారుతో కరీంనగర్‌కు వచ్చారు. అయితే ఆయన మొదట్నుంచీ అధికారపార్టీపై ఆందోళనలుగానీ, ధర్నాలుగానీ చేసింది లేదు.
ఏనాడూ ప్రజాక్షేత్రంలో తిరిగింది లేదు. కేవలం పలు సేవాకార్యక్రమాలతో దర్శనమిచ్చే ఆయన టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న రోజు నుంచీ పెద్దగా జనంలోకి వచ్చింది లేదు. ఆర్థిక బలమున్న నేతగా పేరుండటంతో ‘గంగుల’పై పోటీ చేసేందుకు తనకే అవకాశం ఇస్తారన్న ధీమాతో ఉన్నారు.