మల్కాజిగిరి బరిలో ఎవరు..?

Who is Malkajigiri Bari..?– లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనపై పార్టీల కసరత్తు
–  బీఆర్‌ఎస్‌ నుంచి భద్రారెడ్డి..బీజేపీ నుంచి ఈటల పేర్లు దాదాపు ఖరారు

– కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
– ఈ నెల 29న బీజేపీ మొదటి జాబితా

నవతెలంగాణ-సిటీబ్యూరో
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మరో పది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. మరోపక్క ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ నెల 29న బీజేపీ మొదటి జాబితా విడుదల కానుంది. ఇందులో మల్కాజిగిరి అభ్యర్థి పేరు ఉంటుందా..? మరో విడతలో ఖరారు అవుతుందో తేలనుంది. ఇక కాంగ్రెస్‌లో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారి పేరును ప్రకటిస్తారా..? లేక కొత్త వారిని బరిలో దించుతారా..? అనేది చూడాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో అభ్యర్థి ప్రకటన ఈజీ కానుంది. మార్చి మొదటి వారంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్‌ ఉంది.
మల్కాజిగిరి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ‘మినీ ఇండియా’. ఇక్కడ దాదాపు 40 లక్షల జనాభా ఉంది. ఇందులో 7 లక్షల వరకు నార్త్‌ ఇండియన్స్‌ ఉండటంతో బీజేపీ ఈ సెగ్మెంట్‌పై కన్నేసింది. దీనికితోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలవడంతో ఓటు బ్యాంక్‌ కూడా పెరిగింది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానం కావడంతో ఈ సెగ్మెంట్‌ విషయంలో కాంగ్రెస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారితోపాటు కొత్తగా పార్టీలో చేరిన, చేరే నాయకుల్లో ఒకరిని పోటీ చేయించినా ఆశ్చర్య పోనక్కర్లేదు. బీఆర్‌ఎస్‌ నుంచి పెద్దగా పోటీ కనిపించడం లేదు. సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని నియోజకర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నా.. లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. టికెట్‌ ఆశించిన జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కాంగ్రెస్‌లో చేరడంతో మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ ముందంజ..
ఇప్పటికే ఇంద్రవెల్లి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించగా.. విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ సైతం ఎన్నికల కదన రంగంలోకి దిగింది. ఇప్పటికే మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఈ యాత్ర ముగిసింది. ఈ ఇరు పార్టీలూ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు ప్రస్తుతం పార్లమెంట్‌ పరిధిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ తరుపున మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి ఉచిత మెడికల్‌ క్యాంపులతో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీజేపీ నుంచి దాదాపు ఏడు నుంచి పది మంది వరకు అభ్యర్థులు వాల్‌ పోస్టర్లు, భారీ కటౌట్లతో ప్రచారంలోకి దిగారు. కొందరు అభ్యర్థులు సెగ్మెంట్‌ పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశ మవుతున్నారు. ఇక కాంగ్రెస్‌ ఆశావహులు మాత్రం ఇప్పటి వరకు జనాల్లోకి వెళ్లలేదు.
పోటాపోటీ..
బీజేపీ నుంచి చాలా మంది ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ అధినేత మల్క కొమురయ్య, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర నేత కూన శ్రీశైలంగౌడ్‌తోపాటు రూరల్‌ జిల్లా అధ్యక్షులు హరీశ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి పోటీ పడుతున్నారు. కానీ అధిష్టానానికి పంపిన షార్ట్‌ లిస్టులో మురళీధర్‌రావు, ఈటల రాజేందర్‌, మల్క కొమురయ్య పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్‌రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్‌తోపాటు నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. టికెట్‌ కేటాయిస్తే ‘మర్రి’ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దాదాపు వీరి పేర్లు ఖరారు..
ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. గెలుపు గుర్రాల ఎంపికపై ఫోకస్‌ పెట్టాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యి మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిత్వంపై చర్చించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన కుమారుడు బరిలో ఉంటాడని బహిరంగంగా చెప్పారు. తదనంతరం ఆ పార్టీ నుంచి భిన్న స్వరాలు వినిపించకపోవడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా భద్రారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక బీజేపీ నుంచి తాము బరిలో ఉంటామని ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా ప్రకటించినా అధిష్టానం మాత్రం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక తరగతిలో బలమైన నేత కావడం ఒక కారణం అయితే.. టికెట్‌ కేటాయించకపోతే పార్టీ మారి నష్టం జరిగే ప్రమాదం ఉందని భావించిన బీజేపీ అధిష్టానం దాదాపు ఈటల పేరునే ఫైనల్‌ చేసినట్టు సమాచారం.