రాంజీ గోండ్‌ ఎవరు?

రాంజీ గోండ్‌ ఎవరు?మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు, గోండు పరిపాలనదక్షుడు, గోండ్వాన రాజు రాంజీ గోండ్‌. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసులు, గోండుల హక్కుల కోసం పోరాడిన వీరుడు. నేడు ఆయన వర్థంతి. ఈ సందర్భంగా రాంజీ గోండ్‌ను ఎందుకు స్మరించుకోవాలి? అనేది నేటితరానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. 1857 తర్వాత భారత దేశ స్వాతంత్య్రం కోసం- బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులతో పోరాటాలు చేసి బ్రిటిష్‌ సైన్యానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌లోని గొలుసు కట్టు చెరువుల నీళ్లు తాగించి ముప్పుతిప్పలు పెట్టిన ధీరుడు రాంజీ. గోండుల స్వయం పరిపాలన కోసం, ఆదివాసీలపైన బ్రిటిషర్ల అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు. ఆయనతోపాటు పాటు తాంతీయ తోపే అనుచరులైన రోహిల్లాలతో కలిసి రెండుసార్లు ఆ కాలంలోనే అత్యాధునిక ఆయుధాలు కలిగిన బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించారు. నిర్మల్‌లో ఉన్న కొండలు, గుట్టలు, అడవుల్ని ఆసరా చేసుకొని రాంజీ బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించగలిగాడు. రాంజీ గోండ్‌తో ముఖాముఖిగా తలపడి ఓడించడం, అంతం చేయడం సాధ్యం కాదని బ్రిటిష్‌వారు భావించి అప్పటి నిర్మల్‌ కలెక్టర్‌తో కలిసి కుట్రకు తెరదీశారు. రాంజీ తన వెయ్యి మంది అనుచరులతో ప్రస్తుత సోన్‌ ప్రాంతంలోని గోదావరి నది పక్కన నిద్రిస్తున్న సమయంలో ఒక్క ద్రోహి ఇచ్చిన సమాచారంతో దొంగచాటుగా పట్టుకున్నారు. ప్రస్తుత నిర్మల్‌లోని ఎల్లపెల్లి, ఖురాన్‌ పేట్‌ మధ్యలో గల ప్రాంతంలో మర్రి చెట్టుకు రాంజీ గోండ్‌తో సహా వెయ్యిమందిని ఒక్కో ఊడకు ఒక్కొక్కరిని ఉరితీశారు. రాంజీ గోండ్‌ గురించి అప్పటి ప్రభుత్వాల రికార్డులు పరిశీలిస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి.
కానీ కేంద్రంలోని బీజేపీ నాయకులు ఈ చరిత్రను వక్రీకరించి, తమ స్వార్థ ఓట్ల కోసం రాంజీ గోండ్‌ను రాజకీయం చేస్తున్నారు. ఆయన విరోచిత పోరాటాన్ని ముస్లింలపై చేసిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రచారం రాంజీగోండ్‌ భారత స్వాతంత్య్రం కోసం ఆదివాసీల స్వయం పాలన కోసం చేసిన వీరోచిత పోరాటానికి మసిపూసి, దానిని ఒక తెగ నాయకులు ఒక మతంపైన దాడి చేశారని చరిత్రను వక్రీకరించి, ఆదివాసీలను, సమాజాన్ని పక్కతోవ పట్టించడమే అవుతుంది. ఇది గోండుల పరిపాలన సామర్థ్యం, వీరత్వానికి కళంకంగా వుంటుంది. కాషాయ నేతలకు చరిత్ర తెలియకుంటే తెలుసుకోవడం మంచిది. కానీ ఇలా దుష్ప్రచారం చేయడం తగదు. గోండులు, ఆదివాసీలు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలు (1240 నుంచి 1750 వరకు) పరిపాలన చేశారు. ఈరోజు ప్రస్తుత ప్రభుత్వాలు ఆదివాసీలను అడవులలో అక్రమంగా చొచ్చుకొని వచ్చారని చెబుతూ వారిని వ్యవసాయ భూముల నుంచి, నివాస ప్రాంతాలనుండి తరిమేస్తున్నారు. ఈ రోజు వారసత్వంగా చూసినా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవులు, భూములు వాస్తవంగా ఆదివాసిలవే. వారు ప్రస్తుతం సాగు చేసుకుంటున్న అన్ని భూములకు పట్టాలిచ్చి, వారు నివాసిస్తున్న ప్రాంతాలను అబాదిలుగా గుర్తించాల్సిన ప్రభుత్వం విద్వేషపూరిత వాదనలు, ఆరోపణలు చేయడం అనైతికం. రాంజీగోండ్‌పై చేసే బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టడటంతో పాటు ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది.
(ఏప్రిల్‌ 9 రాంజీ గోండ్‌ వర్థంతి)
– కిషన్‌